iDreamPost

బాలీవుడ్ సింగర్ కు కరోనా పాజిటివ్

బాలీవుడ్ సింగర్ కు కరోనా పాజిటివ్

భయపడినంతా అయ్యింది. దేని కోసమైతే షూటింగులు, సినిమాలు అన్ని ఆపేసి స్ట్రైక్ చేస్తున్నారో ఆ ఉద్దేశాన్ని నీరు గారుస్తూ ఓ బాలీవుడ్ సింగర్ చేసిన తప్పు ఇప్పుడు ఎందరికో శాపంగా మారనుంది. ప్రముఖ గాయని కనికా కపూర్ కు కోవిడ్ 19 వైరస్ పాజిటివ్ గా తేలింది. ఇటీవలే గత ఆదివారం యుకె నుంచి వచ్చిన కనికా ఆ విషయాన్ని దాచి ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోలేదు. అంతే కాదు తన ట్రావెల్ హిస్టరీని కూడా సబ్మిట్ చేయలేదు. ఈవిడ గారు ఇక్కడితో ఆగలేదు. తిరిగి వచ్చాక ఓ 5 స్టార్ హోటల్ లో బస చేయడమే కాక వందలాది జనం ఉన్న ఓ పార్టీ కూడా హాజరయ్యింది.

దీంతో ఇది ఎవరెవరికి సోకిందో అర్థం కాక పోలీసులు ఆ ప్రదేశాలకు పరుగులు పెడుతున్నారు. తీవ్ర స్థాయిలో విచారణ మొదలుపెట్టారు. కనికా కపూర్ ని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్పించారు. అన్ని రకాల పరీక్షలు అయ్యాకే కరోనా సోకినట్టుగా నిర్ధారించారు. ఇప్పటిదాకా ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ గా తేలిన నలుగురిలో కనికా కపూర్ ఒకరు. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 195 కేసులు రిజిస్టర్ కాగా 4 చనిపోయారు. హాలీవుడ్ లోనూ ఇదే తరహాలో టామ్ హాంక్స్, అతని భార్య రీటా విల్సన్ లు కరోనా బారిన పడితే అది పూర్తిగా తగ్గేదక్కా బాహ్య ప్రపంచంలోకి రాలేదు.

కానీ కనికా కపూర్ ఇలా బాధ్యతారాహిత్యంగా కరోనా వైరస్ వచ్చాక పార్టీలు ఇవ్వడాన్ని నెటిజెన్లు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఇప్పటికిప్పుడు కనికా బాలీవుడ్ నుంచి బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఒకపక్క ప్రధానితో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశాల నుంచి వచ్చినవాళ్లు తప్పనిసరిగా ఆసుపత్రులకు వెళ్లి చెక్ చేయించుకోమని చెబుతుంటే దాన్ని నిర్లక్ష్యం చేయడమే కాక పార్టీ పేరుతో ఇంకొందరికి తగిలించే పని చేయడం ముమ్మాటికీ నేరమే. ఆ రోజు పార్టీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళను తక్షణమే క్వారెంటైన్ చేసేందుకు అధికార యంత్రంగం చర్యలు చేపట్టింది. ఒక చిన్న నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించడం తప్పేలా లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి