iDreamPost

‘సింహా’వతారంలో బాలయ్య విశ్వరూపం

‘సింహా’వతారంలో బాలయ్య విశ్వరూపం

ఎంత స్టార్ హీరో అయినా వరసగా డిజాస్టర్లు పడినప్పుడు దాని ప్రభావం మార్కెట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ మాస్ ప్రేక్షకుల అండతో ఎంతో ఎత్తుకు ఎదిగిన బాలకృష్ణ లాంటి కథానాయకులకు ఇది సవాల్ అనే చెప్పాలి. అలాంటి పరిస్థితి పలుమార్లు ఎదురైనప్పటికి తిరిగి బౌన్స్ బ్యాక్ కావడంలో బాలయ్య స్టైలే వేరు. 2003లో తమిళ హిట్ మూవీ సామీ రీమేక్ గా వచ్చిన లక్ష్మి నరసింహ ఓ మోస్తరు విజయం సాధించాక విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారధి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు ఇలా ఏకంగా ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా ఫెయిలవ్వడం అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేసింది.

బాలయ్య స్టామినాని వాడుకోకుండా కొత్త పాత అనే తేడా లేకుండా దర్శకులు చేసిన తప్పులకు తమ హీరో మూల్యం చెల్లించాల్సి రావడం వాళ్ళకు జీర్ణం కావడం లేదు. సోషల్ మీడియా ఇంత ఉదృతంగా లేని రోజుల్లోనూ ఈ విషయాన్ని ట్రోలింగ్ చేసేవి కొన్ని వర్గాలు. సరిగా ఆ సమయంలో ఆశాకిరణంలా దూసుకువచ్చాడు బోయపాటి శీను అప్పటికి అతనిది కేవలం 2 సినిమాల అనుభవం. రవితేజ భద్ర, వెంకటేష్ తులసి రెండూ ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ గా నిలిచాయి. ఆ నమ్మకంతో బాలయ్య బోయపాటి శీను చెప్పిన కథకు ఎక్కువ ఆలోచించకుండా ఓకే చెప్పాడు. ఇందులో సీమ సినిమాల్లాగా అరుపులు కేకలు ఉండవు. తొడకొట్టే సవాళ్ళు రాయలేదు. సుమోలు గాల్లోకి ఎగరవు. కౌరవులంత పెద్ద గ్యాంగ్ విలన్లూ లేరు. ,మెయిన్ హీరొయిన్ ఫ్లాష్ బ్యాక్ లోనే చనిపోతుంది.

ఇవన్ని ఒక ఎత్తు అయితే బాలయ్య మాస్ ఇమేజ్ కి అంతగా సూట్ కాదనిపించే డాక్టర్ పాత్రనే టైటిల్ రోల్. శివమణి తప్ప ఇంతపెద్ద మాస్ హీరోకి చక్రి పాటలు ఇవ్వలేదు. వీటిని విన్నప్పుడు ఇలాంటి అనుమానాలే వచ్చాయి నందమూరి క్యాంప్ లో. ఇవన్నీ వాళ్ళకు మైనస్ గానే తోచాయి. కాని బోయపాటి నమ్మకం వేరు. లెక్క వేరు. ఆ నమ్మకం బాలయ్యకూ కుదిరింది. దర్శకుడు చెప్పింది చేసుకుంటూ పోవలనిబ్ డిసైడ్ అయ్యాడు. అంతే. షూటింగ్ అయిపోయింది.

ఏప్రిల్ 30, 2000 సంవత్సరం ….

సింహా విడుదల. అభిమానుల అంచనాలు మాములే కాని సామాన్య ప్రేక్షకుల్లోనే ఎక్కడో చిన్న డౌట్. మొదటి ఆటతోనే వాటిని పటాపంచలు చేయడం మొదలుపెట్టారు బాలయ్య బోయపాటిలు. వయోలెన్స్ ఎంత భీభత్సంగా ఉన్నా చాలా సెటిల్డ్ గా బాలకృష్ణను చూపించిన తీరుకి ప్యాన్స్ నివ్వెరబోయారు. ఫ్యాక్షన్ సినిమాను ఇంత స్టైలిష్ గా తీయొచ్చా అని ఆశ్చర్యపోయారు. ఛాలెంజులు విసరకుండానే శత్రువులను ఊచకోత కోస్తూ చాలా తేలికైన పదాలతోనే భయపడేలా మాటలు రాసిన వైనానికి ఒక్కసారి చూసి వదిలేయకూడదని డిసైడ్ అయ్యారు.

అంతే స్క్రీన్లు పెరిగాయి. టికెట్లు దొరకడం కష్టమైంది. తమ హీరోని ఎలా చూడాలని తాపత్రయపడ్డారో అంతకు పదింతలు బోయపాటి తెరపై ఆవిష్కరించేసరికి ఏడు అడ్డంకులు సృష్టించిన పరాజయం తల వంచుకుని పక్కకు వెళ్లిపోయింది. అంతే ఆరు సంవత్సరాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ రికార్డుల పర్వం మొదలైపోయింది. నిజానికి సింహాలో గొప్ప కథేమి ఉండదు. డాక్టర్ అయిన హీరో ఊరి బాగు కోసం శత్రు సంహారం చేసి భార్యతో సహా ప్రాణాలు కోల్పోయి బిడ్డను తల్లికి అప్పగించి వెళ్ళిపోతాడు. ఇతను పెరిగి పెద్దయ్యాక ఎక్కడో దూరంగా ఉన్న తనను శత్రు శేషం మళ్ళి వెతుక్కుంటూ వస్తుంది.

అప్పుడు నాన్న గురించి అతని గొప్ప గతం గురించి తెలుసుకున్న కొడుకు ఏం చేశాడన్నది క్లైమాక్స్ అంతే. బ్యాక్ డ్రాప్ పరంగా చూసుకుంటే ఇంచుమించు ఇలాంటి లైన్స్ తో ఇంతకు ముందే ఎన్నో సినిమాలు వచ్చాయి. కాని మాస్ పల్స్ ని అప్పటికే ఔపసోన పట్టిన బోయపాటి శీను కాస్త విభిన్నంగా ఆలోచించి బాలకృష్ణని కొత్త యాంగిల్ లో ప్రెజెంట్ చేశారు. ఫలితంగా 300 కేంద్రాలకు పైగా 50 రోజులు ఆడి 92 సెంటర్స్ లో శతదినోత్సవం పూర్తి చేసుకుని బాలయ్యకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది.

హుందాగా నడిచిన నయనతార పాత్ర, ఫ్లాష్ బాక్స్ ఎపిసోడ్, ట్రైన్ స్టేషన్ ఫైట్, ఒకవైపే చూడు అంటూ బాలయ్య చెప్పే డైలాగ్, ఎస్పికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం, చక్రి హుషారైన పాటలు, చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవన్ని సింహా విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే 2010లో వచ్చిన సింహా బాలయ్య అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీ. అందుకే పది వసంతాలు దాటినా ఇంకా దాని తాలూకు బాక్సాఫీస్ వైబ్రేషన్స్ ఇంకా విన్పిస్తూనే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి