iDreamPost

భయపెట్టిన ప్రేమకథకు బ్రహ్మరథం – Nostalgia

భయపెట్టిన ప్రేమకథకు బ్రహ్మరథం – Nostalgia

ఎవరైనా మనల్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తే అంతకన్నా జీవితానికి కావాల్సింది ఏముంటుందనుకుంటాం. కానీ అదే ప్రేమ భయపెడితే. చచ్చిపోతామేమో అనేలా వెంటాడి వేటాడి వేధిస్తే. అది కూడా ఒక అమ్మాయికి జరిగితే. ఊహించుకోవడానికే ఏదోలా ఉంది కదూ. ఇదే పాయింట్ కథావస్తువుగా మారి సినిమాగా తెరకెక్కి దానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడితే. అసలు ఇలా జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా. కానీ ఇది సాధ్యం చేసి చూపించారు దర్శక నిర్మాత యష్ చోప్రా. ఆ సాహసం పేరు డర్. అప్పటిదాకా స్టార్ డం లేక ఎదిగేందుకు ప్రయత్నిసున్న షారుఖ్ ఖాన్ ని నెగటివ్ రోల్ తోనే స్టార్ చేసిన అద్భుత చిత్రం. ఆ విశేషాలు చూద్దాం

1989లో ‘చాందిని’ బ్లాక్ బస్టర్ సాధించాక యష్ చోప్రా శ్రీదేవితో తీసిన ‘లమ్హే’ కమర్షియల్ గా కంటెంట్ పరంగా రెండిట్లోనూ దెబ్బ తింది. తర్వాత కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది కానీ రిలీజైన రోజుల్లో అది డిజాస్టరే. తర్వాత తీసిన ‘పరంపరా’ ఇంకా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. తాను ఆడియన్స్ పల్స్ ని పట్టుకోవడం ఏం మిస్ అవుతున్నాడో గుర్తించిన యష్ చోప్రా అప్పుడు రాసుకున్న కథే డర్. ఓ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించిన ఓ యువకుడు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్ళైనా కూడా భరించలేక వెంటపడుతూ వేధిస్తూ చివరికి వాళ్ళ చేతుల్లోనే కన్ను మూయడమనే రిస్కీ పాయింట్ ని ఆడియన్స్ ని మెప్పించే ట్రీట్ మెంట్ తో చాలా జాగ్రత్తగా రాసుకున్నారు.

విపరీతంగా ప్రవర్తించే రాహుల్ పాత్రకు ముందు అమీర్ ఖాన్, హీరోయిన్ గా శ్రీదేవిని తర్వాత దివ్యభారతిని అనుకున్నారు యష్ చోప్రా. కానీ ఏవో కారణాల వల్ల ఆ అదృష్టం షారుఖ్ ఖాన్, జుహీ చావ్లాలకు దక్కింది. సన్నీ డియోల్ చేసిన క్యారెక్టర్ కు తక్కువ ప్రాధాన్యత ఉండటంతో డర్ కాస్తా షారుఖ్ వన్ మ్యాన్ షో అయిపోయింది. శివ్ హరి అందించిన పాటలు దేశం మొత్తం మారుమ్రోగిపోయాయి. మ్యాడ్ లవర్ గా షారుఖ్ నటనకు అశేష ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 1993 డిసెంబర్ 24న రిలీజైన డర్ 3 కోట్ల బడ్జెట్ తో రూపొంది 21 కోట్ల దాకా వసూలు చేయడం ఒక రికార్డు. కన్నడలో ప్రీత్సే, తెలుగులో ఓ కొత్త హీరోతో చేసిన రీమేకులు ఆ స్థాయి ఫలితాలను అందుకోలేకపోయాయి. ఫైనల్ గా ట్రాజెడీగా ముగిసినా రాహుల్ పాత్ర ఒక ఐకానిక్ లవర్ గా బాలీవుడ్ హిస్టరీలో మిగిలిపోయింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి