iDreamPost

తప్పుడు వార్తల సంగతి చూడండి – కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం

తప్పుడు వార్తల సంగతి చూడండి – కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం

దేశంలో మిగతా రాష్ట్రాల సంగతి ఏమోగానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చిత్రమైన పరిస్థితులున్నాయి. ప్రధానమైన మీడియా సంస్థలన్నీ తెలుగుదేశం ఆధీనంలోగాని, ఆ పార్టీ మద్దతుదారుగా గానీ ఉంటూ వస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయా మీడియా సంస్థలన్నీ జూలు విదిలిస్తున్నాయి.ఇది వరకు పెట్టుబడులు ఏపీ నుంచి తరలిపోతున్నాయని, అమరావతి నుంచి రాజధాని మార్పు ఘోరమైన తప్పిదమని రాస్తూ వచ్చాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి సంక్షేమ పథకంలోను, ప్రభుత్వము తీసుకునే ప్రతి నిర్ణయం లోను తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుని వార్తలు, కథనాలు రాస్తూ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వారికి మరొక అవకాశం వచ్చింది.

ఉగాది నాటికి దాదాపు పాతిక లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని సంకల్పించిన ప్రభుత్వం ఈమేరకు ముందుకు సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎసైన్డ్ భూముల వివరాలను సేకరిస్తూ ఎసైన్డ్ భూముల్లో కొన్నింటిని వెనక్కు తీసుకుని వాటిలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. సరిగ్గా ఈ అంశాన్ని వ్యతిరేక మీడియా పట్టుకుని పేదల నుంచి. భూములు లాక్కుంటున్నారని, వారి ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయని, దోపిడీ రాజ్యం సాగుతోందని నిరాధారాలతో కూడిన వార్తలు వండి వారుస్తున్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయా వార్తా కథనాలు రాసిన, ప్రసారం చేసిన పత్రికలు, చానెళ్లు మీద చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో జిఎడి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చారు. తప్పుడు వార్తలు రాసినవారికి వివరణ ఇవ్వాలని, ఖండనలు ఇవ్వాలని, ఇంకా వీలైతే పరువు నష్టం కేసులు పెట్టాలని ఆదేశించారు. అంటే ఆధారాలు లేకుండా ఇష్టానుసారం వార్తలు రాస్తే ఉపేక్షించేది లేదన్న విషయం ఆయా మీడియా సంస్థలకు స్ట్రాంగ్ గా చేరాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం గా ఉంది. దీన్ని అమలు చేసే బాధ్యత కలెక్టర్లు తీసుకునే పనిలో ఉన్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి