iDreamPost

కరోనాతో మూడు నెలల ఫించన్ ఒకేసారి

కరోనాతో మూడు నెలల ఫించన్ ఒకేసారి

కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలుచేస్తున్న విషయం తెలసిందే. లాక్ డౌన్ ప్రభావంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యమైనంతవరకూ వైరస్ నివారణ చర్యలు తీసుకుంటూనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సామాన్యులకు బ్యాంకు రుణాలు వడ్డీల విషయంలో వెసులబాటు కల్పించింది. అలాగే పేదలకు అండగా ఉండేందుకు ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. ఫించన్ లబ్దిదారులకు 3 నెలల పెన్షన్ ముందే చెల్లించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 3 కోట్లమంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది.

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్రం ఏప్రిల్ 14వ తేదీవరకు లాక్ డౌన్ విధించడంతో వితంతువులు, సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు మూడు నెలల పింఛను ముందుగానే ఇవ్వనుంది. జాతీయ సామాజిక చేయూత పథకం (ఎన్‌ఎస్‌ఏపీ) కింద కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 2.98 కోట్ల మందికి పేద సీనియర్‌ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు నెలవారీ పింఛన్లు ఇస్తోంది. అయితే తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఏప్రిల్‌ మొదటివారంలోనే 3నెలల పింఛను మొత్తాన్ని కలిపి ఆయా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది.

ఎన్‌ఎస్‌ఏపీ కింద 60–79 ఏళ్ల సీనియర్‌ సిటిజన్లకు నెలకు రూ.200 చొప్పున, 80 ఆపైన వయస్సు వారికి రూ.500 చొప్పున ఇస్తున్నారు. 79 ఏళ్లవరకు ఉన్న దివ్యాంగులకు రూ.300, 80 ఆపైన వయసున్నవారికి రూ.500, వితంతువులు 40–79 ఏళ్ల వారికి రూ.300, 80 ఆపైన వయసున్న వారికి రూ.500 చొప్పున అందజేయనున్నారు. దీంతోపాటు కరోనా ప్యాకేజీ కింద ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల అదనంగా రెండు విడతల్లో కలిపి రూ.1,000 ఇస్తామని ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి