iDreamPost

సెహ్వాగ్‌ తొలి ట్రిపుల్ సెంచరీకి నేటితో పదహారేళ్లు

సెహ్వాగ్‌ తొలి ట్రిపుల్ సెంచరీకి నేటితో పదహారేళ్లు

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో సరిగ్గా ఇదే రోజు ఎన్నో ఏళ్లుగా లిటిల్ మాస్టర్ గావ‌స్క‌ర్‌, మాస్టర్ బ్లాస్టర్ స‌చిన్ వంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌ల సాధించలేని అరుదైన రికార్డును వీరేంద్ర సెహ్వాగ్‌ సాధించాడు.నేటికి 16 సంవత్సరాల క్రితం భారత బ్యాట్స్‌మన్‌లకు అందని ద్రాక్ష పండులా ఊరిస్తున్న ట్రిపుల్ సెంచరీని సెహ్వాగ్‌ తొలిసారి చేశాడు.2004లో మార్చి 29న‌ దాయాది పాక్ గడ్డపై ముల్తాన్ మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో తొలిసారిగా ట్రిపుల్ సెంచరీని సాధించాడు.

పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పాక్ బౌలర్ల బంతులను సెహ్వాగ్‌ చీల్చి చెందాడు.డేరింగ్ ఓపెనర్ 375 బంతులను ఎదుర్కొని 39 ఫోర్లు,6 సిక్సర్లతో 309 పరుగులు చేసి అవుట్ కావడంతో పాక్ బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు.సచిన్ కూడా అజేయంగా 194 పరుగులు చేసి రాణించడంతో భారత్ ఇన్నింగ్స్,52 పరుగుల తేడాతో దాయాది పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది.

నాలుగేళ్ల తర్వాత సెహ్వాగ్ 2008లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ద‌క్షిణాఫ్రికాపై ట్రిపుల్‌ సెంచరీ ఫీట్‌ను మరోసారి రిపీట్ చేశాడు.స‌ఫారీ బౌలర్లపై తన వన్డే తరహా బ్యాటింగ్‌తో విరుచుకుపడి కేవ‌లం 304 బంతులలో 42 ఫోర్లు,5 సిక్సర్లతో 319 ప‌రుగుల సాధించాడు.సెహ్వాగ్ టెస్టు కెరీర్‌లో ఇదే అత్యుత్త‌మ వ్య‌క్తిగ‌త స్కోరు.అయితే ఈ మ్యాచ్‌ డ్రాగా ముగియడం విశేషం.రెండుసార్లు ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మన్‌‌ కూడా ఈ డేరింగ్ ఓపెనరే.ఇక ఇంగ్లాండ్‌పై 2016లో క‌రుణ్ నాయ‌ర్ ట్రిపుల్ సెంచ‌రీ చేసి సెహ్వాగ్ త‌ర్వాత ఈ ఘనత సాధించిన రెండో భార‌త బ్యాట్స్‌మన్‌‌గా రికార్డులకెక్కాడు.

ఇదే రోజు నాలుగేళ్ల వ్యవధిలో రెండు ట్రిపుల్‌ సెంచరీలు సెహ్వాగ్‌ సాధించడం యాదృచ్చికం.ఇప్పటివరకూ ప్రపంచ టెస్టు క్రికెట్‌ చరిత్రలో రెండుసార్లు ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌‌లు నలుగురు.ట్రిపుల్‌ శతక ఘనత సాధించిన బ్యాట్స్‌మన్‌‌లలో ఆసీస్ నుండి బ్రాడ్‌మన్‌; వెస్టిండీస్ తరుపున బ్రియన్‌ లారా,క్రిస్‌గేల్‌ ఇద్దరూ కాగా, భారత్‌ తరుపున డాషింగ్ ఓపెనర్ వీరేందర్‌ సెహ్వాగ్‌ ఒకే ఒక్కడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి