iDreamPost

కరోనాపై పోరు : ఏపీలో స్కూల్స్ బంద్

కరోనాపై పోరు : ఏపీలో స్కూల్స్ బంద్

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైరస్‌ కట్టడికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. వైరస్‌ బారిన పడేవారి సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో ఈ రోజు విద్యాశాఖ మంత్రి, అధికారులతో సీఎం వైఎస్‌జగన్‌ సమీక్ష నిర్వహించారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పాఠశాలలను మూసివేసేందుకు నిర్ణయించారు. ఇంటర్, పదో తరగతి మినహా మిగతా అన్ని తరగతుల క్లాస్లులను రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.

ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగిసిందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు ప్రిపరేషన్‌ హాలిడేస్‌ ఇప్పటికే ఇచ్చారని, వారికి ముందుగా నిర్థేశించిన ప్రకారం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 1–9 తరగతుల విద్యార్థులను తరువాత తరగతికి ప్రమోట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. రేపటి నుంచే అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశంలో తీవ్రంగా ఉన్న తరుణంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మహమ్మారి కట్టడికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థల మూసివేశారు. ఇంటర్‌ సహా పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. మహారాష్ట్ర, కర్నాటక సహా పలు రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఢిల్లీలో ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. కరోనా చైన్‌ తెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వైరస్‌ ప్రభావం ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలు కూడా ఢిల్లీ బాటలోనే పయనించే అవకాశాలు లేకపోలేదు.

Also Read : మళ్లీ లాక్ డౌన్ అనివార్యమా, ఢిల్లీ అనుభవం ఏం చెబుతోంది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి