iDreamPost

బా.. ఈ తొండాటేంటి..?!

బా.. ఈ తొండాటేంటి..?!

కిట్టయ్య బావా.. చిన్నప్పుడు నువ్వు గోళీలాట అడుకునేటప్పుడు తూచ్‌.. తొండి.. లాంటి ఆటలేమైనా ఆడావా? అంటూ అడిగాడు మణి. అంటే గోళీలనే కాదు ఇంకా ఏమైనా చిన్నప్పటి ఆటలాడేటప్పుడు ఇలాంటివేమైనా చేసావా? అని నా ఉద్దేశం.. అన్నాడు.

చిన్నప్పటి ఆటల్లో ఇవన్నీ మామూలే కదరా.. పెద్దేదో నువ్వు కరెక్టుగా అప్పుడు ఆడేసినట్టు,. చూస్తుంటే బిల్డప్‌ మరీ పెద్దగానే ఇస్తున్నావు రోయ్‌.. అన్నాడు కిట్టయ్య.

అది కాదు బావా.. అప్పుడంటే చిన్నతనం.. తెలియని తనం.. కాబట్టి అలాంటి ఆటలు ఆడుతుంటే వాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకులు, అందులోనే ప్రతిపక్ష నాయకులు కూడా ఈ తూచ్, తొండి ఆటలేంటి బావా.. అంటూ అసలు విషయం లోకొచ్చాడు మణి.

ప్రతిపక్షనాయకులు ఎవరు అన్నార్రోయ్‌.. అలాగని.. అంటూ మణిగాడి మాటలు విని ఉలిక్కిపడ్డాడు కిట్టయ్య.

అదే బావా సీయం జగన్‌ ప్రభుత్వం పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తోంది. స్వయంగా సీయమ్మే తాము నిర్మిస్తున్నది కాలనీలు కాదని, ఊళ్ళనే నిర్మిస్తున్నామని ప్రకటించారు. అయినా గానీ చంద్రబాబు, ఆయన పార్టీ బృందం తూచ్, తొండి ఆటలు మాత్రం మానడం లేదేంటి బావా.. అంటూ సందేహం వ్యక్తం చేసాడు మణి.

అసలేమన్నార్రా.. క్లియర్‌గా చెప్పు అన్నాడు కిట్టయ్య..

దీంతో గొంతు సవరించుకుని చెప్పడం మొదలెట్టాడు మణి..

చంద్రబాబు, ఆయన బృందం చేస్తున్న ఆరోపణల్లో మొదటిదేంటంటే.. ఊరికి దూరంగా ఇళ్ళ పట్టాలిస్తున్నారట. రెండోది అక్కడ సరిగ్గా వసతులేమీ కల్పించలేదంట. ప్రధానంగా ఈ రెండింటినే టార్గెట్‌ చేసి టీవీలు, వాళ్ళ పేపర్లలో ఊదర గొట్టేస్తున్నారు.. ఇది తొండాటే కదా బావా.. అన్నాడు.

అదెలాగరా.. అధికార పక్షం చేసే పనుల మీద, ప్రతిపక్షంగా విమర్శలు చేయడం సహజమే కదా.. అంటూ వారి వ్యాఖ్యలను సమర్ధింపుగా మాట్లాడాడు కిట్టయ్య.

నువ్వు కూడా అదే మాట అంటావేంటి బావా.. అసలు అన్ని లక్షల మందికి ఇళ్ళ స్థలాలను ఇవ్వాలంటే.. ఊరి మధ్యలో ఇవ్వడం కుదురుతుందా? నువ్వే ఆలోచించు. దాదాపు ప్రతి మండలంలోనూ 2వేల నుంచి 10వేల మంది వరకు లబ్దిదారులకు స్థలాలు కేటాయించారు. ఇన్ని వేల మందికి ఒకే చోట స్థలం ఇవ్వడం అంటే మరి అది ఊరికి దూరంగానే ఉంటుందా? ఉండదా? నువ్వే చెప్పు బావా.. అంటూ ఆగాడు మణి.

ఇక రెండోది మౌలిక వసతులు అంటున్నారు. అప్పుడెప్పుడో చంద్రబాబు హాయంలో ఇచ్చిన కాలనీల్లో ఇప్పటిక్కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు కాలేదు. యేడాదిన్న క్రితం వరకు చంద్రబాబే అధికారంలో ఉన్నప్పటికీ తామే ఇచ్చిన కాలనీలను గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇస్తున్న ఇళ్ళ స్థలాల మీద మాత్రం ఆయన పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారంటే ఇది తొండాట కాకపోతే ఇంకేంటి బావా.. అంటూ చెప్పుకొచ్చాడు మణి.

మణిగాడు అంతగా వివరించడంతో.. వాడు చెప్పదాంట్లో కూడా నిజముందనిపించిది కిట్టయ్యకు.. దీంతో నువ్వు చెప్పింది కూడా కరెక్టేనని పిస్తుందిరోయ్‌.. ప్రతిపక్షాలు ఆడుతున్నది తొండాటలాగే ఉందిరా అంటూ.. ఒప్పుకున్నట్టు తలాడించాడు కిటయట్య.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి