iDreamPost

బాబు.. మళ్ళీ మొదలెట్టాడు బా..

బాబు.. మళ్ళీ మొదలెట్టాడు బా..

ఓయ్‌ కిట్టయ్య బావా.. ఎక్కడున్నావ్‌.. అంటూ అరుస్తున్నాడు మణిగాడు. యారా బాబూ పొద్దున్నే గుర్తొచ్చాను అంటూ లుంగీ కట్టుకుని కాఫీ తాగుతూ బైటకువచ్చాడు. వస్తూనే ఇంకో కాఫీ ఇవ్వవోయ్‌ మీ తమ్ముడు మణిగాడొచ్చాడు అంటూ చెప్పాడు. ఏం వద్దులే అక్కా.. ఇప్పుడే తాగాను అన్నాడు మణిగాడు.

యారా పొద్దునే హడావిడి చేస్తున్నావ్‌.. ఏంటి విషయం అంటూ ఆరా తీసాడు కిట్టయ్య. ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చుంటూనే మొదలెట్టాడు మణి.

బావా.. అసలు జమిలి ఎన్నికలు వస్తాయా? రావా? దీనిపై నీ అభిప్రాయం ఏంటి? నాకిప్పుడే చెప్పాలి అంటూ కుర్చీలో స్థిరంగా కూర్చుండిపోయాడు.

ఒరే పెద్ద విషయాన్నే పట్టుకున్నావురా? అంటూ విషయం వివరించడం ప్రారంభించాడు కిట్టయ్య.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే సారిఎన్నికలు జరగడమే జమిలి ఎన్నికలురా.. ఇందుకు కేంద్రమే నిర్ణయం తీసుకోవడంతపాటు రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఎక్కడా ఆ పరిస్థితి లేదు. కరోనాకు ముందు ఒక వేళ అటువంటి అభిప్రాయం ఉన్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు నిర్వహించేటంతటి అవసరం, పరిస్థితులు లేవని కేంద్రలో ఉన్న బీజేపీ నేతలో ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్నారట. ఇంకో వైపు కరోనా వైఫల్యం కారణంగా కేంద్ర ప్రభుత్వంపై ఆయా రాష్ట్రాల్లో గతంలో ఉన్న సదభిప్రాయం కూడా లేదు. దీని కారణంగా ఇప్పటికప్పుడు ఎన్నికలు పెట్టేసి ఉన్న మెజార్టీని వదులుకోవడానికి గానీ, లేదా అధికారం పొగొట్టుకోవడానికి గానీ బీజేపీ సిద్ధంగా ఉండే అవకాశమే లేదు. అందు వల్ల జమిలి ఎన్నికలు అన్నది జరగని పనేనని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నార్రా మణీ అంటూ ముగించాడు.

మరదేంటి బావా చంద్రబాబు జమిలి ఎన్నికలు 2022లో వచ్చేస్తాయంటూ చెప్పినట్టు పొద్దున్నే పేపర్లో వచ్చేసింది అంటూ పేపర్‌ చూపించాడు. చంద్రబాబు మాట పుచ్చుకుని నువ్వు నన్ను పొద్దునే షంటేస్తున్నావేంట్రా అంటూ కోపంగా చూసాడు కిట్టయ్య. అది కాదు బావా అసలు ఏదో ఒకటి లేకుండా అంత పెద్దమనిషి ఎందుకంటాడు? అన్నాడు మణి.

ఒరే మణి ‘మాన ప్రాణములకు అపాయం కలిగినప్పుడు బొంక వచ్చు’ అని ఒక వెసులుబాటు ఉంది తెలుసా అన్నడు కిట్టయ్య. లేదు బావా ఏంటి దానర్ధం అంటూ ఆసక్తిగా అడిగాడు మణి. సహజంగా అబద్ధం ఆడడం మహా పాపంగా మన ధర్మశాస్త్రాలు చెబుతుంటాయి. అటువంటి శాస్త్రాల్లో మానం పోయేటప్పుడు గానీ, ప్రాణం పోయేటప్పుడు గానీ అబద్ధం చెప్పడానికి అనుమతిచ్చాయి. ఇక తగని, తప్పని ప్రమాదమే ముంచుకొచ్చినప్పుడు తనని తాను కాపాడుకోవడానిక చెప్పే అబద్దంలాంటిదే ఈ జమిలి ఎన్నికలని నా అభిప్రాయంరా అంటూ ముగించాడు కిట్టయ్య.

అంటే బావ ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి బాగాలేదు కాబట్టి, తనను తాను అంటే తన పార్టీని కాపాడుకునేందుకు ఇటువంటి అబద్దాన్ని చెబుతున్నాడంటావా? అన్నాడు మణి. ఇప్పుడున్న పరిస్థితుల్ని బేరీజు వేసుకుని, ఎన్నికలు పెడితే ఎవరికి లాభం ఉంటుందో ఆలోచిస్తే అదే అర్ధమవుతుంది కదరా అంటూ చెప్పుకొచ్చాడు కిట్టయ్య.

బావా.. పెద్దమనిషి కదా? ఇలా చెబుతున్నాడేంటి? అనుకున్నాను గానీ దీని వెనక ఇంత కథ ఉంటుందని తెలీలేదు అంటూ బుర్రగోక్కుంటూ కాఫీ తాగడంలో మునిగిపోయాడు మణి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి