iDreamPost

సర్కారు కోసం మురారి ఎంట్రీ – OTT అప్డేట్

సర్కారు కోసం మురారి ఎంట్రీ – OTT అప్డేట్

గతంలో ఏదైనా పెద్ద సినిమా కలెక్షన్లు తగ్గినప్పుడు మళ్ళీ ఊపు తెచ్చేందుకు ఓ పాటనో ఫైటో కలిపి అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. విజయశాంతి ఆశయం 50 రోజులయ్యాక యాక్షన్ ఎపిసోడ్ జోడించి కొత్త పబ్లిసిటీ చేశారు. చిరంజీవి చూడాలని ఉంది అర్ధశతదినోత్సవం దాటి డల్ అయినప్పుడు టబు, ఊర్మిళతో వేర్వేరుగా షూట్ చేసి పక్కన పెట్టిన పాటలను అతికించి ప్రమోషన్ చేశారు. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇదంతా గతం. ఇప్పుడు సినిమాలన్నీ మహా అంటే నెల రోజుల రన్ రావడమే గొప్పగా మారిపోయిన పరిస్థితుల్లో వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ లేదని అర్థం చేసుకుని ఇలాంటి ఆలోచనలు ఎవరూ చేయడం లేదు.

సర్కారు వారి పాట టీమ్ మాత్రం ఇవాళ్టి నుంచి థియేటర్లలో కొత్తగా మురారివా పాటను జోడిస్తున్నారు. ఇది ఇంతకుముందే షూట్ చేశారు. కాకపోతే లెన్త్ కు అడ్డం వస్తోందని ఎడిట్ లో తీసేశారు. తీరా చూస్తే మూడో వారంలోనే వసూళ్లు నీరసించిపోవడంతో నిర్ణయం మార్చుకున్నారు. ప్రీ రిలీజ్ టైంలో ఈ పాట యూట్యూబ్ లో వదులుతామని చెప్పిన మహేష్ మాటకు భిన్నంగా జరగడం విశేషం. అయినా ఈ ఒక్క సాంగ్ కోసం వీరాభిమానులు వస్తారేమో కానీ రెగ్యులర్ ఆడియన్స్ అదే పనిగా చూస్తారా అంటే అనుమానమే. ఫైనల్ రన్ కు దగ్గరగా ఉన్న ఏ సినిమా అయినా సరే ఇలాంటి టాక్టిక్స్ తో అద్భుతాలు చేయడం జరగదు. అది కూడా ఈ ఓటిటి జమానాలో.

సర్కారు వారి పాట ఓటిటి ప్రీమియర్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో పే పర్ వ్యూ మోడల్ లో 199 రూపాయలకు ఈ రోజు విడుదల చేశారు. చెప్పాపెట్టకుండా స్ట్రీమింగ్ స్టార్ట్ కావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఇలా వద్దనుకుంటే చివరి వారంలో ఓపెన్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 200 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని చెప్పుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఇంత త్వరగా డిజిటల్ కు ఇవ్వడం షాక్ అనిపించేదే. కెజిఎఫ్ 2 ఇదే మోడల్ లో రిలీజ్ చేసిన ప్రైమ్ ఇకపై తమ ప్లాట్ ఫార్మ్ లో కొత్త సినిమాలు త్వరగా చూడాలంటే డబ్బులు కట్టేలా తన సబ్స్క్రైబర్స్ ని అలవాటు చేస్తోంది. అజయ్ దేవగన్ రన్ వే 34 సైతం ఇదే తరహాలో వచ్చిన సంగతి తెలిసిందే.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి