iDreamPost

కళాతపస్వి నృత్యభరిత దృశ్యకావ్యం – Nostalgia

కళాతపస్వి నృత్యభరిత దృశ్యకావ్యం – Nostalgia

1979 ‘శంకరాభరణం’ ప్రభంజనం తర్వాత దర్శకులు కళాతపస్వి కె విశ్వనాథ్ గురించి దేశమంతా మాట్లాడుకుంది. ఒక ముసలాయన్ని హీరోగా పెట్టి సంగీత భరిత సినిమా తీస్తే బాషా భేదం లేకుండా క్లాసు మాసు అందరూ దానికి నీరాజనాలు పట్టడం గురించి అంతర్జాతీయ వేదికల మీద కూడా చర్చలు జరిగాయి. కమర్షియల్ సూత్రాలకు దూరంగా చేసిన ఈ ప్రయత్నం ఇప్పటికీ చెక్కుచెదరని పేరు ప్రతిష్టలు సంపాదించింది. తర్వాత విశ్వనాథ్ 3 చిత్రాలు చేశారు. సిరిసిరిమువ్వ హిందీ రీమేక్ ‘సర్గం’ ఘనవిజయం అందుకోగా ఆయన శైలికి భిన్నంగా రూపొందించిన ‘అల్లుడు పట్టిన భరతం’ ఆశించిన ఫలితం అందుకోలేదు. శుభోదయం పేరు తెచ్చింది.

ఇవయ్యాక ఈసారి నృత్య ప్రధాన చిత్రాన్ని తీయాలనే సంకల్పంతో భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మాతగా సప్తపదికి శ్రీకారం చుట్టారు. డిస్కో డాన్సుల ట్రెండ్ లో ఇలాంటి నేపధ్యాన్ని ఎంచుకున్న విశ్వనాథ్ సాహసం పట్ల ఇండస్ట్రీ మరోసారి షాక్ తింది. అయితే ఈసారి కేవలం పాటలు భావోద్వేగాలు మాత్రమే చెప్పదలుచుకోలేదు కళాతపస్వి. సమాజాన్ని పట్టిపీడిస్తూ జాడ్యంలా మారిన కుల రక్కసిని స్పృశించాలనుకున్నారు. అప్పటికి జనంలో ఛాందస భావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కులం ఉచ్చులో పడి ప్రాణం కన్నా ప్రతిష్ట ఎక్కువని భావించడం చిన్న స్థాయి జనంలోనూ ఉండేది. అందుకే సప్తపది ప్రయోగమే కాదు ఒకరకమైన తెగింపు కూడా

ఓ గుడి పూజారి కుటుంబంలో గూడు కట్టుకుపోయిన కులభావాలకు అతీతంగా ఆయన మనవరాలు ఓ వేణువు ఊదే హరిజన యువకుడిని ప్రేమిస్తుంది. కానీ తన బావనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ భర్తకు ఈమెలో అమ్మవారు కనిపించడంతో సంసారానికి దూరంగా ఉంటాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు సినిమాలోనే చూడాలి. సప్తపదిలో ఈ సున్నితమైన అంశం పండిత పామరులను మెప్పించింది. శంకరాభరణం స్థాయిలో కాకపోయినా విశ్వనాథ ప్రతిభకు తార్కాణంగా మరో కలికితురాయి అయ్యింది. సోమయాజులు, సవిత, గిరీష్, అల్లు, రమణమూర్తి, సాక్షి రంగారావు తదితరులు తమ పాత్రలకు ప్రాణం పోశారు. జంధ్యాల సంభాషణలు, కెవి మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిచాయి. 1981 జూన్ 26 విడుదలైన సప్తపది ప్రతిఒక్కరు చూడాల్సిన క్లాసిక్

Also Read : అక్కడ అద్భుతం ఇక్కడ సామాన్యం – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి