iDreamPost

బియ్యమే కాదు ఇసుక కూడా

బియ్యమే కాదు ఇసుక కూడా

ఇసుక అక్రమాలకు పూర్తిగా చెక్‌ పెట్టేలా ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ సరికొత్త ఆలోచన చేసింది. రాష్ట్రంలో ఇసుకను డోర్‌ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రేషన్‌ బియ్యం లబ్ధిదారులకు ఇంటికే డెలివరీ చేస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తాజాగా ఇసుకను కూడా అవసరమైన వారి ఇంటికే చేర్చనుంది. ఇసుక అంశంపై అధికారులతో సమీక్ష చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ మేరకు ఈ ఆలోచనను ఆచరణలోకి తెవాలని సూచించారు.

కొత్త ఏడాది మొదటి వారం నుంచే ఇసుక డోర్‌ డెలివరీ విధానం అమలు చేయనున్నారు. జనవరి ఏడు నుంచి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో మొదట ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మరో రెండు వారాల అనంతరం జనవరి 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు సిద్ధమవ్వాలని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంలో ఇసుక అవసరాల దృష్ట్యా రోజుకు 2.5 లక్షల టన్నుల ఇసుక అవసరమవుతుంది. ఆ మేరకు ఇసుకను స్టాక్‌ పాయింట్లలో సిద్ధం చేయనున్నారు. డిమాండ్‌కు నాలుగు రెట్లు అధికంగా ఇసుకను స్టాక్‌ పాయింట్లలో నిల్వ చేయనున్నారు. తద్వారా వర్షాకాలంలో, నదులకు వరదలు కొనసాగిన కాలంలో ఇసుక కొరత రాకుండా ఉండేలా సీఎం జగన్‌ మార్గనిర్ధేశం చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానంతో ఒకే సారి రెండు సమస్యలు పరిష్కారం కానున్నాయి. మొదటి అంశం..ఇసుక అక్రమాలకు పూర్తిగా చెక్‌ పడనుంది. రెండో అంశం.. ముందుగానే మూడు నెలలకు సరిపడా ఇసుకను స్టాక్‌ చేసి ఉంచుతుండడంతో ఇసుక కొరతకు చెక్‌ పడనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి