iDreamPost

జాతరమ్మ జాతర.. మేడారం జాతర

జాతరమ్మ జాతర.. మేడారం జాతర

ఏ ఊళ్లో అయినా జాతర జరిగితే.. ఆ ఊరితోపాటు చుట్టుప్రక్కల ఊళ్లన్నీ ఒక్కటవుతాయి.. కలిసికట్టుగా సంబరాలు చేసుకుంటారు.. కానీ రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు మాత్రం.. ప్రపంచం మొత్తం కదిలివస్తుంది.. కుంభమేళ తర్వాత మనదేశంలో జరిగే మరో అతిపెద్ద జాతరే మేడారం.. కన్నుల పండువగా జరిగే ఈ గిరిజనుల వైభోగ వేడుక వెనుక గురించి ఎన్నో చెప్పుకోదగ్గ విశేషాలున్నాయి.

మాఘమాసంలో 4రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే మేడారం జాతర వెనుక అద్భుతమైన కథ ప్రాశస్త్యంలో ఉంది. ఒకప్పుడు మేడారానికి చెందిన కొందరు కోయ దొరలు గోదావరి నది తీరంలోని అడవికి వేటకు వెళ్లగా.. అక్కడ ఒక పాప పులుల మధ్య ఆడుకుంటూ కనిపించిందట.. వెంటనే ఆ కోయదొరలు ఆ పాపను తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్కగా పేరు పెట్టారట.. దీంతో ఆపాప గ్రామానికి వచ్చినప్పటినుంచీ పాముకాటుకి గురైనవాళ్లను తన మహిమలతో బ్రతికించేదట.. ఏళ్లతరబడి పిల్లలులేనివారికి పిల్లలు పుట్టించేదట.. దాంతో ఊరంతా ఆమెను వనదేవతగా భావించేవారట..

ఆరోజుల్లో మేడారం ప్రాంతాన్ని కాకతీయుల సామంతుడైన పగిడిద్దరాజు పాలించేవాడు.. అతడితో సమ్మక్కకు పెళ్లి చేశారు. తర్వాత ఆదంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. సారలమ్మకు గోవిందరాజులుతో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్నాళ్లకు ఆ ఊరిని కరవు కాటు వేసింది.. మూడేళ్లపాటు కరవు బారిన పడిన ఊరి ప్రజలు కాకతీయులకు కప్పం కట్టలేకపోయారు. దాంతో కాకతీయ ప్రభుత్వం తండాలపై సమరశంఖం పూరించింది. ఇది తెలుసుకున్న గిరిజనులు వారిపై పోరాడటానికి సిద్ధపడ్డారు.

గిరిజనులు కాకతీయ సేనతో ములుగు సమీపంలోని లక్నవరం సరస్సు దగ్గర ఎదురొడ్డి పోరాడారు. పగిడిద్దరాజు అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు మేడారం సరిహద్దు అయిన సంపెంగవాగు వద్ద శత్రువుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. ఓటమి భారాన్ని తట్టుకోలేని పగిడిద్దరాజు కుమారుడు జంపన్న సంపెంగవాగులో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆవీరుడి స్మృతిచిహ్నంగా ఆ వాగును జంపన్న వాగుగా పిలుచుకుంటున్నారు.

ఈ దుర్వార్తలతో సమ్మక్క మొదట కృంగినా.. వెంటనే మరు నిమిషంలో రౌద్రమూర్తిలా కత్తిపట్టి యుద్ధానికి బయలుదేరింది.. వీరోచితంగా పోరాడుతుండగా ఓ సైనికుడు సమ్మక్కను వెన్నుపోటు పొడిచి పారిపోయాడు.. అలా రక్తమోడుతూ మేడారం గ్రామానికి ఈశాన్య దిక్కులో ఉన్న చిలకలగుట్లవైపు వెళ్లిన సమ్మక్క మలుపు ప్రాంతంలో మాయమైపోయింది.

ఈ విషయం తెలుసుకున్న కోయగూడెం వాసులు దివిటీలు పట్టి గాలిస్తే గుట్టమీదున్న నెమలినార చెట్టుకింది ఓ పుట్టదగ్గర కుంకుమభరిణ కనిపించింది.. ‘కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కానేకాదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతివ్యక్తీ వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలి. ’ అన్న స్ఫూర్తి సమక్కది . గిరిజనులు దీన్నే అమ్మ ఆదేశంగా భావించారు. కొంత కాలానికి ప్రతాప రుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దుచేసి, సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీచేసాడు. అలా ప్రారంభమైంది సమ్మక్క, సారలమ్మ జాతర..

నాలుగురోజులపాటు వేడుకలు

ఈఏడాది ఫిబ్రవరి 5 నుండి 8వరకు నాలుగురోజులపాటు జరుగుతుంది. అంతకంటే ముందే 10రోజుల నుండి పూజలు మొదలుపెడతారు. వేర్వేరు ప్రాంతాలనుంచి దేవతామూర్తులను తీసుకువచ్చి కొలుస్తారు. జాతరకు వచ్చే భక్తులు ముందుగా ఊరి పొలిమేరలోని జంపన్నవాగులో స్నానం చేస్తారు.. జంపన్నవాగు ఒడ్డున జంపన్న గద్దె ఉంటుంది.. ఆ తరువాతే సమ్మక్క సారలమ్మల దర్శనానికి బయలుదేరతారు.

ఈ వేడుకలో వెదురుకర్ర, కుంకుమభరిణలే ఉత్సవ మూర్తులు. మొదటిరోజు సారలమ్మ ఆమె భర్త గోవింద రాజులు, తండ్రి పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారు.. సారలమ్మను కన్నెపల్లి గ్రామం నుంచి మేళ తాళాలతో ఆరుగురు పూజారులు ఊరేగింపుగా తీసుకొస్తారు. జాతరకు రెండ్రోజుల ముందు కొత్తగూడ మండలం పోనుగుండ్లలోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది. సారలమ్మ భర్త గోవిందరాజులును ఏటూరు నాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామంనుంచి కాకతీయ వంశస్థులు తీసుకొస్తారు. చివరగా సమ్మక్కను కుంకుమభరిణ రూపంలో చిలుకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు ఎటువంటి ఆర్భాటం లేకుండా తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు.

వెదురుబొంగుతో చేసిన మొంటెలో గిరిజనులు చేసిన కుంకుమవేసి దాన్ని చిన్నపిల్లాడి నెత్తిన పెట్టి తీసుకొస్తారు. ఆ సమయంలో అధికారిక లాంఛనాలతో గాల్లోకి తుపాకీని పదిరౌండ్లు పేలుస్తూ సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. అప్పుడు కోరికలు కోరుకుంటే నెరవేరతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దేవతరాకతో ఆప్రాంతం శివసత్తుల శివాలతో దద్దరిల్లిపోతుంది.. మూడోరోజున అమ్మవారి గద్దెను దర్శించి బంగారం(బెల్లం) మొక్కులు చెల్లించుకుంటారు.. అమ్మవారికి నైవేద్యం పెట్టే బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు.. నాలుగవరోజున అమ్మలిద్దరూ అధికారక లాంఛనాలతో తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం జాతర మహోత్సవం ముగుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి