iDreamPost

కథలు ఒకటే ఫలితాలు వేరు – Nostalgia

కథలు ఒకటే ఫలితాలు వేరు – Nostalgia

ఏదైనా ఒక మంచి కథ సినిమాగా తీసినప్పుడు అది విజయం సాధించలేకపోతే దాన్ని వేరొకరు మళ్ళీ తీసే ప్రయత్నం చేయడం ఎప్పుడూ కాదు కాని ఇండస్ట్రీలో పలుమార్లు జరిగింది. అదే ఇద్దరు గొప్ప దర్శకులు చేస్తే అది ఖచ్చితంగా విశేషమే. దానికిది ప్రత్యక్ష ఉదాహరణ. 1991లో హాస్యబ్రహ్మ జంధ్యాల గారు ‘లేడీస్ స్పెషల్’ అనే సినిమా తీశారు. నలుగురు మహిళలను ప్రధాన పాత్రలలో పెట్టి హాస్యం ప్లస్ మెసేజ్ కలబోతగా తనదైన శైలిలో రూపొందించారు. ఒక సూపర్ మార్కెట్ లో పని చేసే లేడీ ఎంప్లొయ్స్ ని వేధించే మేనేజర్ ని ఆ నలుగురు కలిసి ఒక ప్లాన్ ప్రకారం బుద్ధిచెప్పే కథతో దీన్ని తీశారు. వాణి విశ్వనాధ్, దివ్యవాణి, పూజిత, లావణ్య కీలక పాత్రల్లో నటించగా స్పెషల్ క్యామియోలో దాసరి నారాయణరావు కనిపిస్తారు.

హాస్యనటులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాసూరావు సంగీతం. అయితే ఇది ఆశించిన విజయం సాధించలేదు. ఎందుకో జనానికి కనెక్ట్ కాలేకపోయింది. తర్వాత టీవీలో, వీడియో రూపంలో మంచి దక్కించుకుంది. ఆ తర్వాత మూడేళ్ళకు 1994లో తమిళంలో సింగీతం శ్రీనివాసరావు గారు ‘మగలీర్ మట్టుం’ తీశారు. ఇది కూడా అచ్చం అదే కథతోనే తీశారు. తెలుగులో ‘ఆడవాళ్లకు మాత్రమే’ పేరుతో మురళీమోహన్ డబ్బింగ్ చేశారు. దాసరి పాత్రలో ఒరిజినల్ నిర్మాత కమల్ హాసన్ తళుక్కున మెరుస్తారు. అందులో రాళ్ళపల్లి మేనేజర్ కాగా ఇందులో నాజర్ కు ఆ వేషం ఇచ్చారు. ఇళయరాజా సంగీతం. క్యాస్టింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. రేవతి ఊర్వశి, రూపిణిలతో నాలుగు క్యారెక్టర్స్ ని మూడింటికి కుదించారు.

కామెడీ డోస్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ ఉండేలా స్క్రిప్ట్ రాసుకున్నారు. దానికి ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కూడా తోడయ్యింది. సూపర్ మార్కెట్ కు బదులు ఇందులో కార్పోరేట్ ఆఫీస్ ని సెట్ చేశారు. కట్ చేస్తే ఇది ఘన విజయం సాధించింది. అరవంలో 175 రోజులు ఆడింది. పలు అవార్డులు కూడా వచ్చాయి. తెలుగు వెర్షన్ కూడా బాగానే వసూలు చేసింది. ఇలా జంధ్యాలకు వర్కవుట్ కాని కాన్సెప్ట్ అలా సింగీతం వారికి బ్రహ్మాండంగా పని చేసింది. ఈ రెండు సినిమాలకు మూలం 1980లో వచ్చిన అమెరికన్ మూవీ 9 టు 5 అనే సినిమా. ఎవరికి తగ్గట్టు వాళ్ళు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కాకపోతే బాషకో ఫలితం రావడమే విశేషం. ఇప్పటికీ తమిళ సినిమాలో ఒక బెంచ్ మార్క్ లా నిలిచిపోయింది ఆడవాళ్లకు మాత్రమే. కాని దానికన్నా ఎంతో అడ్వాన్సుగా ఆలోచించిన జంధ్యాల గారికి చేదు ఫలితం దక్కడమే ఆశ్చర్యం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి