iDreamPost

కండలవీరుడి కోసం గాడ్ ఫాదర్ రిక్వెస్ట్ ?

కండలవీరుడి కోసం గాడ్ ఫాదర్ రిక్వెస్ట్ ?

మరికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభించుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ తాలూకు క్యాస్టింగ్ పనులు ఇంకా ఒక కొలిక్కి రానట్టు ఉంది. ముఖ్యంగా కొన్ని కీలక పాత్రలకు సంబంధించి నటీనటులను ఎంపిక చేసుకోవడం దర్శకుడు మోహన్ రాజాకు పెద్ద సవాల్ గా మారింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఒరిజినల్ వెర్షన్ లో దర్శకుడు కం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన క్యారెక్టర్ ని ముందు అసలు వద్దనుకున్నారు. కానీ చివరి అరగంట మాత్రమే వచ్చే ఆ పాత్ర మంచి కిక్ ఇస్తుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకుని దాని కోసం ఏకంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ని ట్రై చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది

మెగాఫ్యామిలీకి సల్మాన్ బాగా దగ్గర. అతను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చరణ్ ఇంటి నుంచే బిర్యానీ వెళ్తుంది. చిరంజీవి అరవై పుట్టినరోజుకు ప్రత్యేకంగా ముంబై నుంచి కండల వీరుడు వచ్చాడంటేనే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ బాండింగ్ ఏ స్థాయిలో ఉంటుందో. ఆ చనువుతోనే చిరు స్వయంగా సల్మాన్ ను ఫోన్ చేసి మరీ అడిగినట్టు సమాచారం. వ్యక్తిగతంగా ఒకసారి కలుసుకుని రిక్వెస్ట్ చేసే ఆలోచన కూడా ఉందట. మరి ఓ ఇరవై నిమిషాల పాటు సాగే ఆ పాత్రను సల్మాన్ నిజంగా ఒప్పుకుంటే ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాడో. ఆ ఒక్క ఎపిసోడ్ కోసం నిర్మాత అంత భారీ మొత్తాన్ని వెచ్చిస్తారా అనేది కన్ఫర్మ్ అయ్యేదాకా చెప్పలేని పరిస్థితి.

సల్మాన్ ఇప్పటిదాకా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసింది లేదు. మైనే ప్యార్ కియా కాలం నుంచే తనకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ప్రేమాలయం రికార్డులు చెక్కుచెదరకుండా భద్రంగా ఉన్నాయి. దబాంగ్ లాంటివి తెలుగులోనూ డబ్బింగ్ చేయడానికి కారణం ఇదే. తను లూసిఫర్ రీమేక్ లో ఉండటం వల్ల సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వస్తుంది. హిందీ వెర్షన్ ను భారీ రేట్ కు అమ్ముకోవచ్చు. నార్త్ లోనూ రిలీజ్ విషయంలో చాలా అడ్వాంటేజ్ దక్కుతుంది. మరి తను ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి. దీనికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే

Also Read : ఇంకో రీమేక్ పనులు షురూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి