iDreamPost

రిపబ్లిక్ రివ్యూ

రిపబ్లిక్ రివ్యూ

గత ఏడాది లాక్ డౌన్ ఎత్తేశాక వచ్చిన మొదటి సినిమా సోలో బ్రతుకే సో బెటరూతో సక్సెస్ అందుకున్న సాయి తేజ్ ఈసారి సీరియస్ పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2010 ప్రస్థానంతో ఇప్పటికీ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ వచ్చాక అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. గత నెల బైక్ యాక్సిడెంట్ కు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న సాయితేజ్ లేకుండానే ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగిపోయింది. క్యాస్టింగ్, క్వాలిటీ అన్నీ పుష్కలంగా కనిపిస్తున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

నదీ తీరప్రాంతమైన తెల్లేరులో అవినీతి పరుడైన ప్రభుత్వ ఉద్యోగి(జగపతిబాబు)కొడుకు అభిరామ్(సాయి ధరమ్ తేజ్)యుఎస్ వెళ్లాలనే లక్ష్యంతో ఉంటాడు. అన్యాయాన్ని సహించని అతని తత్వం పోలింగ్ బూత్ లో కలెక్టర్ తో గొడవకు కారణం అవుతుంది. దీంతో తన టార్గెట్ ని మార్చుకుని ఐఏఎస్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. కొన్ని ఊహించని సంఘటనల జరిగిన తర్వాత కృష్ణా జిల్లాకు ప్రత్యేక అధికారాలతో కలెక్టర్ గా వస్తాడు. రాజకీయంగా సామాజికంగా పట్టున్న నాయకురాలు సిఎం తల్లి విశాఖ వాణి(రమ్యకృష్ణ)ని నిలువరించేందుకు సిద్ధపడతాడు. మరి ఈ ఆఫీసర్ కి ఆ పొలిటికల్ లీడర్ కి జరిగిన యుద్ధంలో ఎవరిది గెలుపో తెరమీదే చూడాలి

నటీనటులు

ఏ నటుడికైనా చేస్తున్న కథలు రొటీన్ గా అనిపించినప్పుడు సీరియస్ డ్రామాలు ఎంచుకోవడం ద్వారా తనలో రియల్ పొటెన్షియాలిటీని బయట పెట్టుకోవచ్చు. సాయి తేజ్ కు ఇది అలాంటి పాత్రే. తన వయసు, బాడీ లాంగ్వేజ్ కు కాస్త బరువైన క్యారెక్టర్ అనిపించినప్పటికీ అందులో ఒదిగిపోయి నెగటివ్ రిమార్క్స్ రాకుండా చూసుకున్నాడు. కొన్ని సీన్లలో ఎందుకో నీరసంగా అనిపించాడు.యంగ్ జెనరేషన్ హీరోలు ఈ టైపు సబ్జెక్టులు చేయడం చాలా అవసరం. ఐశ్వర్య రాజేష్ కు మరీ ఎక్కువ స్కోప్ దక్కలేదు కానీ రిస్కీ ట్విస్ట్ ఉన్న పాత్రను చేయడం మెచ్చుకోదగ్గ విషయం. సెకండ్ హాఫ్ లో బొత్తిగా రెండు మూడు సన్నివేశాలకే పరిమితం

అప్పుడెప్పుడో బాహుబలి తర్వాత మళ్ళీ కాస్త చెప్పుకోదగ్గ పాత్ర రమ్యకృష్ణకు దక్కింది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత షేడ్స్ లో డిజైన్ చేసిన ముఖ్యమంత్రి తల్లిగా హుందాగా కనిపించారు. కానీ ఎంతో ఆశించిన ఆవిడ పాత్రకు ఎక్కువ లెన్త్ లేకపోవడం అభిమానులను నిరాశ పరుస్తుంది. సెకండ్ హాఫ్ లోనే ఎక్కువ స్కోప్ దొరికింది. జగపతిబాబుది మరీ ప్రత్యేక తరహా కాదు కానీ ఉన్నంతలో దానికి ఫిట్ అయ్యారు. రాహుల్ రామకృష్ణ, పోసాని, ఆమని, సుబ్బరాజు, బాక్సర్ దిన తదితరులు ఆయా క్యారెక్టర్లకు తగ్గట్టు ఉన్నారు.

డైరెక్టర్ అండ్ టీమ్

పొలిటికల్ జానర్ లో ఒక రిస్క్ ఉంటుంది. ఇవి అంత సులభంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేవు. ప్రస్థానం ఎంత గొప్ప ప్రశంసలు దక్కించుకున్నా నిర్మాతకు లాభాలు ఇవ్వలేదు. ఒకప్పుడు కోడి రామకృష్ణ లాంటి దర్శకులు భారత్ బంద్, అంకుశం లాంటి సినిమాల ద్వారా రాజకీయ అంశాలను కమర్షియల్ ఫార్మాట్ లో అద్భుతంగా ఆవిష్కరించారు. దేవ కట్టా చేసేది కూడా అలాంటి ప్రయత్నమే కానీ ఈయన శైలి వేరు. చెప్పాలనుకున్న పాయింట్ నుంచి పక్కకు వెళ్లకుండా వీలైనంత బలంగా చూసేవాళ్ళ మెదడులో తన పాయింట్ ని రిజిస్టర్ చేసేందుకు సిన్సియర్ గా ప్రయత్నిస్తారు. కానీ రిపబ్లిక్ లో అది పూర్తిగా నెరవేరలేదు

ఈ సినిమాలో కొన్ని ఆలోచింపజేసే గొప్ప డైలాగులు ఉన్నాయి. చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప రాయలేని స్థాయిలో తూటాల్లా వస్తాయి. కానీ అవి అటు సన్నివేశాలను బలోపేతం చేయడానికి కానీ ఇటు ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించడానికి కానీ ఉపయోగపడలేదు. ఎందుకంటే కథనం చాలా నెమ్మదిగా సాగడం. సింగల్ పాయింట్ మీదే ఎక్కువ సాగదీయడం వల్ల ఇలా జరిగింది. అయినా కూడా వ్యవస్థను సూటిగా ప్రశ్నించే ఈ మాత్రం సాహసం చేయడం అభినందనీయమే. కానీ థియేటర్ దాకా ఆడియన్స్ వచ్చి సంతృప్తి చెందేలా మాత్రం దేవకట్టా పూర్తి స్థాయిలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేని సెట్ చేసుకోలేకపోయారు

ఈ సినిమా ట్రైలర్ చూశాక ఒక కలెక్టర్ కు ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ కు మధ్య హై ఇంటెన్సిటీ డ్రామాని ఆశిస్తాం. కానీ రిపబ్లిక్ మొదలైన గంట దాకా అసలు కథలోకే ఎంటర్ కాదు. అనవసరంగా పాటలు వచ్చి ఇబ్బంది పెడతాయి. పోనీ హీరో ఐఎఎస్ అవ్వడమైనా ఎగ్జైట్ చేసేలా ఉంటుందా అంటే అదీ జరగదు. కలెక్టర్ గా అభిరాం ఛార్జ్ తీసుకున్నాక ఒక గూండాను చంపడానికి సగటు కమర్షియల్ హీరో స్టైల్ లో ఒక పోలీస్ ని వెంటబెట్టుకుని రాత్రి పూట ఫైట్ చేయడానికి వాళ్ళ డెన్ కు వెళ్లడం ఏ మాత్రం సింక్ అవ్వలేదు. హీరో డ్యూటీ ఎక్కిన తర్వాత ఒకే ఒక్కడు తరహా రియలిస్టిక్ డ్రామా ఎక్స్ పెక్ట్ చేస్తాం కానీ చాలా మటుకు చప్పగా సాగుతుంది.

పోనీ సెకండ్ హాఫ్ లో అయినా కథనం పరిగెత్తుతుందా అంటే అదీ జరగదు. అభిరాం కేవలం తేల్లేరుకు మాత్రమే కలెక్టర్ అనిపించేలా సాగడం, మొదట్లో బిల్డప్ ఇచ్చిన ముఖ్యమంత్రి పాత్ర అసలు ఊసులో లేకుండా పోవడం, చాలా చోట్ల స్పీచుల తరహాలో సంభాషణలు ఉండటం మొదలైనవి పంటి కింద రాళ్లలా మారాయి. మైరా రేప్ ఎపిసోడ్ తర్వాత జరిగే క్రమం కూడా నీరసంగా ఉంటుంది. దేవకట్టా ఉద్దేశం మంచిదే అయినా దాన్ని తెరకెక్కించే క్రమంలో జరిగిన తడబాటు వల్ల గొప్ప సినిమాగా మిగలాల్సిన రిపబ్లిక్ జస్ట్ యావరేజ్ అనే ఫీలింగ్ ని మిగిలిస్తుంది. అరె ఇంతేనా అనే భావన క్రమం తప్పకుండా చూస్తున్నంత సేపూ కలుగుతూనే ఉంటుంది

బలమైన క్యాస్టింగ్ ని సరిగా వాడుకోకపోవడం కూడా లోటే. రమ్యకృష్ణని ఓ రేంజ్ లో ఊహించుకుంటామా. కానీ సెకండ్ హాఫ్ లో సగం తప్ప ఫస్ట్ హాఫ్ లో ఆవిడ ఎక్కువ కనిపించదు. జగపతిబాబు క్యారెక్టర్ లో ఉన్నంత డెప్త్ ఒక్కోసారి అభిరాం పాత్రలో కూడా లేదనిపించే ఉదంతాలు లేకపోలేదు. అలా అని పూర్తిగా తీసిపారేయడమని కాదు కానీ మూస డైరెక్టర్లతో పోలిస్తే దేవకట్టా మీద జనానికి ఉన్న గౌరవం వేరు. అది పూర్తిగా నిలబెట్టుకోలేదే అని బాధ అనిపించడం తప్పించి ఇలాంటి ఆలోచనలు సగటు దర్శకులు అంత సులభంగా ఎవరు చేయలేరు. క్లైమాక్స్ ని హడావిడిగా పరుగులు పెట్టించి ఊహించని ట్విస్ట్ ఇవ్వడం కూడా మైనస్సే

మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ సోసోగా ఉంది. ఆయన మునుపటి స్థాయితో పోల్చుకుంటే ఉన్న రెండు పాటలూ కనీసం గుర్తు కూడా ఉండవు. ఎం సుకుమార్ ఛాయాగ్రహణం దేవ కట్ట ఆలోచనలను స్పష్టంగా ఆవిష్కరించింది. కెఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ మీద కంప్లయింట్ లేదు కానీ అక్కడక్కడ ట్రిమ్మింగ్ కి కొంత అవకాశం ఉన్నా వదిలేయడం నిడివిని బాగా పెంచింది. జెబి-జీ స్టూడియోస్ నిర్మాణ విలువలు ఓకే. కోట్లాది ఖర్చయ్యిందని చెప్పుకున్నారు కానీ తేల్లేరు లొకేషన్ తప్ప మరీ భారీ బడ్జెట్ డిమాండ్ చేసిన కంటెంట్ లేదు

ప్లస్ గా అనిపించేవి

సాయి తేజ్ పెర్ఫార్మన్స్
రమ్యకృష్ణ
ఎంచుకున్న సబ్జెక్టు
డైలాగ్స్

మైనస్ గా తోచేవి

ఫస్ట్ హాఫ్ ల్యాగ్
సంగీతం
రిజిస్టర్ కాని ఎమోషన్
ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం

కంక్లూజన్

ప్రేక్షకులు ఫలానా టైపు సినిమాలే చూస్తామని ఎప్పుడూ డిమాండ్ చేయరు. తీసుకున్న సబ్జెక్టు ఏదైనా వాళ్ళను మెప్పించేలా టికెట్టుకు న్యాయం చేసేలా ఉంటే చాలు సక్సెస్ చేసేస్తారు. రిపబ్లిక్ మన వ్యవస్థను టార్గెట్ చేసుకుని అందులో లోటుపాట్లను ప్రశ్నించే మంచి ఉద్దేశంతో తెరకెక్కించిందే. అయినప్పటికీ సగటు సినిమాలో ఉండాల్సిన డ్రామా అండ్ ఎమోషన్ ఆశించిన స్థాయిలో పండకపోవడంతో పూర్తి సంతృప్తిని కలిగించలేకపోయింది. అయినా కూడా ఒక సోషల్ ఇష్యూ మీద రిస్కీ క్లైమాక్స్ ని ఒప్పుకుని తేజ్ దేవాలు చేసిన ఈ నిజాయితీ ప్రయత్నాన్ని ఓసారి చూడొచ్చు. కానీ పెద్ద అంచనాలు లేకుండానే సుమీ

ఒక్క మాటలో – స్క్రీన్ ప్లే ‘వీక్’

Also Read : లవ్ స్టోరీ రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి