iDreamPost

Sabarimala Devotees: శబరిమలలో భారీగా భక్తుల రద్దీ! అల్లాడిపోతున్న అయ్యప్పలు!

శబరిమల దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగిపోతోంది. అక్కడి ప్రస్తుత పరిస్థితులపై కేరళ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

శబరిమల దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగిపోతోంది. అక్కడి ప్రస్తుత పరిస్థితులపై కేరళ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

Sabarimala Devotees: శబరిమలలో భారీగా భక్తుల రద్దీ! అల్లాడిపోతున్న అయ్యప్పలు!

కార్తీక మాసం మొదలు కాగానే అందరికి గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి దీక్ష. ఈ మాసం మొదలవ్వగానే ఇతర రాష్ట్రాలతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోనూ భక్తులు స్వామివారి దీక్షను ధరిస్తారు. 41 రోజుల పాటు అయ్యప్ప మాలధారణతో నియమాల తోరణాలను చేపట్టి.. ఆ మణికంఠునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మండల దీక్ష  తర్వాత దీక్షా విరమణ కోసం ఇరుముడితో స్వామివారి దర్శనానికి బయలుదేరతారు. కేరళలోని శబరిమలలో 18 కొండలు, 18 మెట్లపై అధిష్టించిన హరిహరిసుతుడైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు.. ఏటా కొన్ని లక్షల మంది భక్తులు పోటెత్తుతారు. అలాగే ఈ ఏడాది కూడా స్వామివారి దేవాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల  ప్రకారం..

ప్రస్తుతం శబరిమల భక్త జనసంద్రంగా మారింది. అయ్యప్ప శరణు గోషతో ఆ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం వారు స్వామివారి దర్శన సమయాన్ని గంటపాటు పెంచారు. అయినప్పటికీ స్వామి దర్శనం అంత సాధారణంగా అవ్వడం లేదు. దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోందని సమాచారం. ఇంకా ఆలస్యం కావడంతో కొంత మంది భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్నారట. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన కొందరు భక్తులు శ్రీధర్మ శాస్త్ర ఆలయంలో ఇరుముడులు సమర్పించుకుంటున్నారు. ఆ ఆలయంలోని అయ్యప్పకు నెయ్యాభిషేకం చేయించి స్వస్థలాలకు తిరుగు ప్రయాణం సాగిస్తున్నారు. ఇలా స్వామి దర్శనార్థమై వెళ్లిన భక్తులు.. వారికి  తగిన సదుపాయాలు అందచేయాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు శబరిమలకు వెళ్లే దారుల్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

రోజుల తరబడి అయ్యప్ప భక్తులు రోడ్లపైన వేచి ఉంటూ అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. పంబ చేరుకుని వెను తిరగాలంటే అత్యంత కష్ట తరంగా మారిందని వాపోతున్నారు. కాగా, ఈ విషయమై కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. “రోజుకి దాదాపు లక్ష మందికి పైగా భక్తులు విచ్చేయడంతో భారీగా రద్దీ ఏర్పడింది. ఇటువంటి సందర్భాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజం. త్వరలోనే భక్తుల సమస్యలను  పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. శబరిమలలోని పరిస్థితులు ఇలా ఉండగా.. అక్కడికి చేరుకునే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే వారు కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలను కలుపుతూ.. డిసెంబరు, జనవరి నెలల్లో మొత్తంగా 51 ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. వివిధ తేదీలలో రాకపోకలు సాగించే రైళ్ల వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏదేమైనా ప్రస్తుతం ఆ శబరిగిరీషుని సన్నిధానానికి చేరుకోవడం కాస్త కష్ట తరంగా మారిందని చెప్పి తీరాలి. మరి స్వామివారి దర్శనార్ధమై బారులు తీరిన భక్తుల ఇబ్బందులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి