iDreamPost

కేటీఆర్‌ ఆహ్వానంపై ఉలికిపాటు ఎందుకు..?

కేటీఆర్‌ ఆహ్వానంపై ఉలికిపాటు ఎందుకు..?

హిజాబ్, హలాల్‌ వివాదాలతో బీజేపీ రాజకీయంగా లబ్ధి పొందాలని యత్నిస్తుంటే.. ఆయా అంశాలతో బెంగుళూరుకు ఉన్న బ్రాండ్‌ ఇమేజీ దెబ్బతింటోందని తాజాగా నెలకొన్న పరిణామాల ద్వారా తెలుస్తోంది. బయోటెక్, సాప్ట్‌వేర్‌ రంగాలకు రాజధాని బెంగుళూరు. కార్పొరేట్‌ కంపెనీలు మౌలిక వసతులతోపాటు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటాయి. అయితే గత నాలుగు నెలలుగా కర్ణాటకలో శాంతిభద్రతల అంశం దారితప్పింది. మొన్న హిజాబ్, ఇప్పుడు హలాల్‌ వివాదాలు కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. రైట్‌ వింగ్‌ సంస్థలు, బీజేపీ అనుబంధ సంస్థలు ఆయా అంశాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, వాటిపై సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పందించడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటనలు చేస్తుండడంతో.. వివాదాలు మరింత పెద్దవిగా మారుతున్నాయి.

ఈ పరిస్థితులు అంతిమంగా నష్టం చేకూరుస్తాయని భావిస్తున్న పారిశ్రామికవేత్తలు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్‌ షా కర్ణాకటలో నెలకొన్న మతపరమైన విభేదాల్ని తొలగించాలని, లేకుంటే ఆ ప్రభావం ఐటీ, బయోటెక్‌ రంగాలపై తీవ్రంగా పడుతుందని సీఎం బసవరాజ్‌ను కోరడం పరిస్థితికి అద్దంపడుతోంది. మరో వ్యాపార వేత్త.. బెంగుళూరులో మౌలిక వసతులు లేవని ట్వీట్‌ చేయడం.. దానికి బ్యాగ్‌ సర్దుకుని హైదరాబాద్‌ వచ్చేయండి అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ రీ ట్వీట్‌ చేయడంతో ఇప్పుడు బెంగుళూరు వెర్సస్‌ హైదరాబాద్‌ అనేలా పరిస్థితి ఏర్పడింది.

ఐటీ, బయోటెక్‌ రంగాల్లో హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్‌.. పలు కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ క్రమంలోనే బెంగుళూరుపై ఓ వ్యాపార వేత్త చేసిన ట్వీట్‌పై తనదైన శైలిలో స్పందించారు. అయితే కేటీఆర్‌ రీ ట్వీట్‌పై ఏకంగా కర్ణాటక సీఎం బసవరాజ్‌ స్పందించడంతో అక్కడ నెలకొన్న పరిస్థితి ఏమిటో చెప్పకనే చెబుతోంది. కేటీఆర్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న బసవరాజ్‌.. మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉంటే వందలాది స్టార్టప్, పరిశోధనా సంస్థలు బెంగుళూరులో ఎలా ఉన్నాయో చెప్పాలని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఐటీ రంగంలో నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలంటూ చెప్పుకొచ్చారు. మౌలిక వసతులపై పారిశ్రామిక వేత్త కామెంట్‌ చేస్తే.. అది కేటీఆర్‌ చేసినట్లుగా భావిస్తూ సీఎం బసవరాజ్‌ స్పందించడం విశేషం.

కర్ణాటకలో నెలకొన్న మతపరమైన వివాదాలపై వ్యాపార వేత్తలు, ఐటీ సంస్థలు అందోళనలో ఉన్నట్లు పరిస్థితులు స్పష్టంగా తెలుస్తున్నాయి. అందుకే వ్యాపారవేత్తలు కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా ఆయా అంశాలపై స్పందిస్తున్నారు. అ విషయం సీఎం బసవరాజ్‌కు కూడా అర్థమైంది. అందుకే పారిశ్రామికవేత్తలకు కేటీఆర్‌ ఆహ్వానంపై ఉలిక్కిపడుతున్నారు. హిజాబ్, హలాల్‌ అంశాలను తెరపైకి తెచ్చి, వాటిని వివాదాస్పదం చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి జరిగినా.. అంతిమంగా బెంగుళూరు బ్రాండ్‌ ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కన్నా.. ముందుగానే అప్రమత్తం అవడం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌ ముందున్న కర్తవ్యం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి