iDreamPost

చేతికొచ్చిన అదృష్టం ‘గోవిందా’ – Nostalgia

చేతికొచ్చిన అదృష్టం ‘గోవిందా’ – Nostalgia

అదేదో సినిమాలో ఎల్బి శ్రీరామ్ రాసిన డైలాగ్ ఒకటుంది. అదృష్టలక్ష్మి ఇంటికొచ్చి కాలింగ్ బెల్ నొక్కితే సైకిల్ బెల్ అనుకుని సైడ్ ఇచ్చాడంట ఒకడు. బ్యాడ్ లుక్ వెంటే ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇలాంటివి మరీనూ. దానికో చక్కని ఉదాహరణ ఉంది. 1992లో రామ్ గోపాల్ వర్మ పేరు దేశమంతా మారుమ్రోగిపోతున్న టైంలో అతనితో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలని అగ్ర నిర్మాత అశ్వినిదత్ ప్లాన్ చేసుకున్నారు. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పమని కబురు పంపారు.

నాగార్జున డేట్స్ ఉన్నాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకోమని ముందే చెప్పారట. తన లైఫ్ కి బ్రేక్ ఇచ్చిన హీరో కాబట్టి వర్మ రెండు కథలతో దత్తు గారి దగ్గరికి వెళ్ళాడు. ఒకటి మల్టీ స్టారర్. రెండోది సోలో హీరో స్టోరీ. ఆయన రెండూ విన్నారు. మొదటిది అంతగా నచ్చలేదు. అందులోనూ వర్మ నాగార్జునతో పాటు ఇంకో హీరో కావాలన్నాడు. అది కూడా రజనీకాంత్. కథ కొంచెం రిస్కీగా అనిపించింది బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా దత్తుగారు రెండో దానికే ఓటు వేశారు. అదే గోవిందా గోవిందా. ఖర్చుని లెక్క చేయకుండా చాలా వ్యయంతో ప్రత్యేకంగా తిరుమల గుడి సెట్ వేసి మరీ అశ్వినిదత్ గోవిందా గోవిందా నిర్మించారు.

విడుదలకు ముందే రాజ్ కోటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బిజినెస్ కూడా బాగా జరిగింది. తీరా చూస్తే ఫలితం గోవిందా కొట్టేసింది. శ్రీదేవి బ్రాండ్, టాప్ టెక్నికల్ టీమ్ ఇవేవి నిలబెట్టలేకపోయాయి. నష్టాలు తప్పలేదు. ఇంతకీ దత్తుగారు వద్దనుకున్న మొదటి స్టోరీ ఏదో తెలుసా. రంగీలా. జాకీ ష్రాఫ్ పాత్రలో రజినీకాంత్, అమీర్ ఖాన్ రోల్ లో నాగార్జునను ఊహించుకుని వర్మ దాన్ని నెరేట్ చేశాడు. ఆ తర్వాత దాన్నే కొద్దీ మార్పులతో రంగీలాగా తీసి ఆల్ ఇండియా లెవెల్ లో హిట్టు కొట్టాడు. ఒకవేళ ఇదే దత్తు గారు ఓకే చేసి ఉంటే రజని-నాగ్ ల కాంబినేషన్ కి ఇంకో స్థాయికి వెళ్లివుండేది. అందుకే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు ఇలా కూడా ప్రభావితం చేస్తాయనడానికి ఇంత కన్నా ఉదాహరణ వేరే కావాలా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి