Tirupathi Rao
Tirupathi Rao
లోకేశ్ కనకరాజ్.. ఈ ఒక్క పేరుకి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. తన ఐడెంటిటీని ప్రత్యేకంగా చాటుకోవడానికి లోకీ ఏకంగా “ఎల్.సీ.యూ” అని ఒక సినిమాటిక్ యూనివర్స్‌నే సృష్టించుకున్నారు. ఇప్పుడు ఆ దర్శకుడి నుంచి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రమే “లియో”. ఇళయదళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ మూవీ ఎలా ఉంది? అసలు “లియో”.. “లోకీ సినిమాటిక్ యూనివర్స్”లో భాగమా? కాదా? ఇలాంటి అన్ని విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
పార్ధివన్(విజయ్) ఓ అనాథ. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో కాఫీ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. అతనిది ఓ అందమైన కుటుంబం. అయితే.. ఆ ప్రాంతంలో జరిగిన ఓ గొడవ వల్ల పార్ధివన్ వార్తల్లో నిలుస్తాడు. అదే సమయంలో అతని కుటుంబం కూడా చిక్కుల్లో పడుతుంది. అలా పార్ధివన్ ఫొటో పేపర్‌లో రావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లోని రౌడీలు అలెర్ట్ అవుతారు. చివరికి పార్ధివన్ ఫొటో తెలంగాణలోని అంథోని దాస్(సంజయ్ దత్), హెరాల్డ్ దాస్(అర్జున్) దగ్గరికి చేరుతుంది. ఇక పార్ధివన్ జీవితంలోకి అంథోని దాస్ వచ్చాక కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అసలు లియోకి, పార్ధివన్‌కి ఉన్న లింక్ ఏంటి? వీరు ఇద్దరా? లేక.. ఒక్కడేనా? ఇవన్నీ కాక.. అసలు లియోకి అంథోని దాస్‌కి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే మిగిలిన కథ.
“లియో” మూవీ విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. లోకేశ్ కనకరాజన్ కెరీర్ చాలా ప్రమాదంలో ఉంది. ఈ ఒక్క మాట గుర్తు పెట్టుకోండి. ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందో చివర్లో చెప్పుకుందాం. ఇక “లియో” కథ పరంగా చూసుకుంటే చాలా చిన్న లైన్. కథలోని కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌కి దూరంగా నెరేషన్ ఓపెన్ చేసిన లోకీ.. తాను తీసింది ఓ మామూలు సినిమా అని ఆడియన్స్‌కి ముందే హింట్ ఇచ్చేశాడు. హిమాచల్ ప్రదేశ్ బ్యాగ్రౌండ్, కాఫీ షాప్, కుటుంబం, అతి సాధారణమైన హీరో జీవితం అన్నిటిని మొదటి 15 నిమిషాల్లోనే చూపించేశాడు. ఇంతటి ఎస్టాబ్లిష్‌మెంట్ తరువాత మాములుగా అయితే ఆడియన్స్ ఎలాంటి ఓవర్ ఎక్స్‌పెట్టేషన్స్ పెట్టుకోరు. కానీ.., లియోకి వచ్చే ఆడియన్స్ అందరూ ఆ మూవీని “లోకి యూనివర్స్”లో ఎక్కడ లింక్ చేస్తాడు? ఎప్పుడు ఆ క్యారెక్టర్స్ ఈ సినిమాలోకి వస్తాయి? అసలు విక్రమ్‌కి, లియోకి ఎక్కడ లింక్ పెడతాడు అన్న ఆత్రుతతోనే ఆసాంతం సినిమాని చూసే పరిస్థితి ఏర్పడింది. ఇదే లియోకి అతి పెద్ద మైనస్. ఎప్పుడైనా కథని చెప్పే క్రమంలో అడిషనల్ లేయర్స్ ఉన్నా, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నా.. అవి ఆడియన్స్‌కి మంచి కిక్ ఇస్తాయి. కానీ.., ఆ స్పెషల్ ఎలిమెంట్స్ కోసం ఓ సినిమాని చూడాల్సి వస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. “లియో” విషయంలో జరిగింది కూడా ఇదే.
పార్ధివన్ లైఫ్ లోకి అంథోని వచ్చాక.. ఆడియన్స్ ఎక్స్‌పెట్టేషన్స్ కూడా పీక్స్‌కి చేరుద్ది. ఇక్కడ నుంచి ప్రేక్షకుడు కోరుకునేది కచ్చితంగా లియో కథ గాని, పార్ధివన్ కథ ఎంత మాత్రము కాదు. దీన్నే సినీ భాషలో ఆడిటోరియం మూడ్ అంటారు. ఈ విషయాన్ని పట్టుకోవడంలో విఫలమైన లోకేశ్ కనకరాజ్.. సెకండ్ ఆఫ్‌లో కూడా పార్ధివన్ కథపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. దీంతో.. ప్రేక్షకుడు “లియో” మూవీ నుంచి కోరుకుంటుంది ఒకటైతే.. దర్శకుడు తీసింది మరొకటి అన్న చందాన సినిమా సాగింది. ఇక్కడి నుంచే ప్రేక్షకుడికి సినిమాతో కనెక్షన్ మిస్ అయిపోద్ది. అలా.. కథ చాలా నీరసంగా సాగుతున్న సమయంలో లియో క్యారెక్టరైజేషన్ బ్యాక్‌డ్రాప్.. జస్ట్ ఇలా వచ్చి, అలా పోవడం నిజంగా జీర్ణించుకోలేనిది. అసలు ఏ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ అయితే.. హైలెట్ అవ్వాలో.. ఆ మొత్తం సీక్వెన్స్‌ని లోకేశ్ కనకరాజ్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇంతటి సాధారణ కథని.. ఎంత మంచి మేకింగ్‌తో చూపించినా, ఎన్ని ట్విస్ట్‌లు పెట్టినా, ఆఖరికి లోకీ యూనివర్స్‌తో ముడిపెట్టినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇక.. ముందుగా చెప్పుకున్నట్టు లోకేశ్ కనకరాజన్ కెరీర్ నిజంగా చాలా ప్రమాదంలో ఉంది. అతను.. “లోకీ సినిమాటిక్ యూనివర్స్” అనే ఓ ముళ్ల కిరీటాన్ని తనకి తానుగా నెత్తిన తెచ్చి పెట్టుకున్నాడు. ఇకపై అతను తీసే ప్రతి సినిమా మాత్రమే కాదు, తీసే ప్రతి సన్నివేశాన్ని కూడా ఆడియన్స్ ఆ సినిమాటిక్ యూనివర్స్ మూడ్‌తోనే చూస్తున్నారు. చూస్తారు కూడా. ఇకపై ఆ రేంజ్‌లో లోకీ సినిమాలు ఉన్నాయా? లోకేష్ కనకరాజ్‌ని పట్టుకోవడం మిగతా దర్శకుల వల్ల కాదు. అలా కాదని.. లోకీ ట్రాక్ మారిస్తే మాత్రం ఆడియన్స్ అతన్ని రిసీవ్ చేసుకునే మార్గం కనిపించడం లేదు.
లియోలో మొత్తం మీద మెచ్చుకుని తీరాల్సింది విజయ్‌ని. అతను ఈ కథని బలంగా నమ్మాడు అనే కన్నా.. లోకేశ్ కనకరాజ్‌ని ఎక్కువగా నమ్మాడు అని చెప్పుకోవచ్చు. చాలా సన్నివేశాల్లో తన స్టార్డమ్, తన ఫాలోయింగ్ అన్నిటినీ పక్కన పెట్టేసి నటించాడు. ఇక యాక్టింగ్ కూడా చాలా సెటిల్డ్‌గా, తెలుగు ప్రేక్షకులకి సైతం నచ్చే రేంజ్‌లో ఉంది. కాకుంటే.. విజయ్ డబ్బింగ్ విషయంలో లిప్ సింక్ చాలా సన్నివేశాల్లో మిస్ అయ్యింది. ఇది అతను పడ్డ కష్టానికి అర్థం లేకుండా చేసింది. ఇక హీరోయిన్‌గా నటించిన త్రిష పాత్ర పరిధి చాలా చిన్నది. ఇక హెరాల్డ్ దాస్ పాత్రలో అర్జున్ లుక్ అదిరిపోయినా, యాక్టింగ్‌కి పెద్దగా స్కోప్ లేదు. అంథోని దాస్‌గా సంజయ్ దత్ మాత్రం ఆకట్టుకున్నారు. ఫారెస్ట్ రేంజర్ జోషీ పాత్రలో నటించిన గౌతమ్ మీనన్ నటన అద్భుతం.
అనిరుధ్.. దండం స్వామి నీకు! ఏమి చెప్పాలి ఆ మ్యూజిక్ గురించి? గూస్ బంప్స్ అంతే. లియోలో కొన్నిసాధారణ సన్నివేశాలు కూడా అనిరుధ్ బీజీఎమ్ తో అదిరిపోయినట్టు అనిపిస్తాయి. అనిరుధ్ మ్యూజిక్ ఉన్నన్ని నాళ్ళు.. దర్శకులకి సగం బలం పెరిగినట్టే. ఇక అనిరుధ్ తరువాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ గురించి. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ లో పరమహంస మాయ చేసేశారు.సెకండ్ ఆఫ్ లో వచ్చే సింగిల్ టేక్ యాక్షన్ సీక్వెన్స్ , ఛేజింగ్ షాట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక దర్శకుడు లోకేశ్ కనకరాజ్ గురించి చెప్పుకోవాలి. దర్శకుడిగా లోకీ బలం కథ చెప్పే విధానం. ఖైదీ, విక్రమ్ సినిమాల్లో జరిగిన మ్యాజిక్ ఇదే. కానీ..,”లియో” లో మాత్రం లోకీ కథకుడిగా లెక్క తప్పేశాడు. కానీ.., అతని మేకింగ్ స్టయిల్ కి మాత్రం హ్యాట్సాఫ్. ఇక నిర్మాణ విలువలు అదిరిపోయాయి.
రేటింగ్: 2.25/5
చివరి మాట: “లియో”.. లెక్క తప్పిన లోకీ సినిమా.
ఇవి కూడా చదవండి : Bhagavanth Kesari Review: బాలయ్య- అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ ఎలా ఉందంటే?