iDreamPost

Maa Oori Cinema Review: మా ఊరి సిన్మా మూవీ రివ్యూ!

Maa Oori Cinema Review: మా ఊరి సిన్మా మూవీ రివ్యూ!

తెలుగు ప్రేక్షకులకు చిన్న సినిమానా- పెద్ద సినిమానా? చిన్న హీరో, హీరోయిన్.. పెద్ద హీరో ఇలాంటి బేధాలు ఏమీ ఉండవు. సినిమాలో విషయం ఉంటే నెత్తిన పెట్టుకుంటారు. పర భాష సినిమాలకు కూడా తెలుగునాట బ్రహ్మరథం పట్టిన సందర్భాలు చాలానే చూశాం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రికార్డు బద్దలు కొట్టిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. సినిమా చిన్నదైనా పెద్దదైనా బాగుంటే ఆడుతుంది అంతే. అలాంటి కంటెంట్ ఉన్న ఒక సినిమా అక్టోబర్ 12న థియేటర్లలో రిలీజ్ అయి మంచి టాక్ తో దూసుకుపోతోంది. అదే నిర్మాత మంజునాథ్ రెడ్డి తెరకెక్కించిన ‘మా ఊరి సిన్మా’. మరి.. ఆ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు ఏ మేర నచ్చింది? తెలియాలంటే ఈ రివ్యూ పూర్తిగా చదవాల్సిందే.

కథ:

‘మా ఊరి సిన్మా’.. మహేశ్(పులివెందుల మహేశ్) అనే కుర్రాడి జీవితం ఆధారంగా సాగుతుంది. డైరెక్టర్ కావాలి అనేది మహేశ్ కల. ఆ కల కోసం ఎంతో కష్టపడతాడు. తను రాసుకున్న కథను తెరకెక్కించి పెద్ద డైరెక్టర్ కావాలి అని కలలు కంటూ ఉంటాడు. కానీ, ఉన్న ఊరిని.. పుట్టిన గడ్డను వదిలి వెళ్లేందుకు ఇష్టపడడు. పులివెందులలోనే పుట్టాను.. పులివెందులలోనే కథ రాశాను.. పులివెందులలోనే హీరో అవుతాను అంటూ గట్టిగా నిర్ణయించుకుంటాడు. మహేశ్ కలను నెరవేర్చేందుకు బుల్ రెడ్డి(నిర్మాత మంజునాథ్ రెడ్డి), స్నేహితులు సహాయం చేస్తారు. మహేశ్ జీవితంలో ప్రేమకథ కూడా ఉంటుంది. సినిమా తర్వాత మహేశ్ ఎక్కువగా ప్రేమించేది ఆ అమ్మాయినే. అయితే ఆమెను వివాహం చేసుకోవడంలో మాత్రం మహేశ్ ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.  మహేశ్ తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకుంటారు. వాళ్ల పెళ్లి వల్ల మహేశ్ జీవితంలో కొన్ని అనుకోని పరిణామాలు సంభవిస్తాయి. వాళ్ల పెళ్లి ఇతని జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపించింది? మహేశ్ సినిమా తీయగలిగాడా? ఆ సినిమా రిలీజ్ అయ్యిందా లేదా? తాను కోరుకున్నట్లుగా థియేటర్లో తాళి కట్టాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే థియేటర్ లో మా ఊరి సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సినిమా తీయాలి, డైరెక్టర్ అవ్వాలి అనే పాయింట్ తో టాలీవుడ్ లో చాలానే సినిమాలు వచ్చాయి. ఒక్క ఛాన్స్ అంటూ నిర్మాతను బతిమిలాడి.. సినిమా తీసి సక్సెస్ అయిన హీరోలు చాలా మందే ఉన్నారు. వారి జాబితాలోకి మహేశ్ కచ్చితంగా చేరతాడు. ఒక యువకుడి లక్ష్యం, ప్రేమకథ, పుట్టిన ప్రాంతం మీద ఉండే అభిమానాన్ని దర్శకుడు శివరామ్ తేజ చాలా చక్కగా తెరకెక్కించారు. కామెడీ, ఎమోషన్, యాక్షన్, ఇలా ప్రతి అంశాన్ని పరిధికి తగ్గట్లు, ప్రేక్షకులకు నచ్చే రీతిలో తీయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా మహేశ్ సినిమా తీయాలి అనే కలను చూపిస్తూనే అందులో అతని ప్రేమకథను, తల్లిందండ్రులతో ఉన్న అనుబంధం, స్నేహితులు, బుల్ రెడ్డిలాంటి సపోర్టింగ్ రోల్స్ తో అతని కలను నెరవేర్చడం ఇలా అన్ని పాయింట్లను చాలా కన్విన్సింగ్ జోనర్ లో తెరకెక్కించారు. ముఖ్యంగా భాష, యాస మొత్తం రాయలసీమదే అయినా కూడా.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కథకు కనెక్ట్ అవుతారు. ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాదు.. ఓ కుర్రాడి సక్సెస్ స్టోరీ అని చెప్పాలి.

ఎవరెలా చేశారు?:

ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ పులివెందుల మహేశ్, నిర్మాత మంజునాథ్ రెడ్డి అని చెప్పాలి. మూవీ మొత్తంలో కథ దాదాపుగా వీళ్లిదరితోనే ముందుకు వెళ్తూ ఉంటుంది. హీరోగా పులివెందుల మహేశ్ ఒదిగిపోయి నటించాడనే చెప్పాలి. పాత్రకు తగ్గట్లు యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా మహేశ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. హీరో కల నెరవేరడంలో ఫ్యాక్షనిస్ట్ బుల్ రెడ్డి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. అంతటి ప్రాధాన్యమున్న పాత్రను మంజునాథ్ రెడ్డి చాలా బాగా పోషించారు. ఈ రెండు పాత్రలు తర్వాత మహేశ్ విట్టా క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. విట్టా ఎప్పటిలాగానే తన కామెడీ టైమింగ్ తో ఇరగదీశాడు. ప్రతినాయకుడిగా మైకేల్ సిద్ధు ఒదిగిపోయాడు. కొన్ని సందర్భాల్లో హీరోని కూడా మైకేల్ సిద్ధు డామినేట్ చేస్తాడు. హీరోయిన్ గా ప్రియా పాయల్ నటన అలరిస్తుంది. తల్లిదండ్రుల పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

టెక్నికల్ వర్క్:

ఈ సినిమాలో డైరెక్టర్ కు చాలా మంచి మార్కులు పడతాయి. తాను అనుకున్న కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో చాలా బాగా సక్సెస్ అయ్యాడు. ఈ మూవీకి మ్యూజిక్ బిగ్ అసెట్ అనే చెప్పాలి. ఎస్కే బాజి చాలా మంచి సంగీతం సమకూర్చాడు. పోరాట సన్నివేశాల్లో బీజీఎం ఆకట్టుకుంటుంది. డీవోపీ ధర్మ ప్రభ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ పాడిన ఎక్కు బండెక్కు పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. టేకింగ్ విషయంలో నిర్మాత మంజునాథ్ రెడ్డి ఎక్కడ రాజీ పడలేదు.

ప్లస్ లు:

  • పులివెందుల మహేశ్, మంజునాథ్ రెడ్డి
  • కథ, కథనం
  • యాక్షన్ సీక్వెన్స్
  • మ్యూజిక్

మైనస్:

  • కొత్త మొహాలు ఎక్కువ కావడం
  • మాస్ మాత్రమే నచ్చే అంశాలు

రేటింగ్: 3/5

(ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి