iDreamPost

First Day First Show ఫస్ట్ డే ఫస్ట్ షో రిపోర్ట్

First Day First Show  ఫస్ట్ డే ఫస్ట్ షో రిపోర్ట్

జాతిరత్నాలుతో అతి తక్కువ బడ్జెట్ లో ముప్పై కోట్ల వసూళ్లు రాబట్టిన దర్శకుడిగా అనుదీప్ ఎంత పేరు సంపాదించాడో తెలిసిందే. ఏ రేంజ్ లో అంటే మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడే ఇదే తన మొదటి సినిమా అనుకునేంత. నిజానికి పిట్టగోడ డెబ్యూ మూవీ అనే విషయం చాలా మందికి కనీసం గుర్తు కూడా లేదు. అలాంటి డైరెక్టర్ ఒక చిన్న చిత్రానికి రచన చేయడం అంటే అందులో చాలా స్పెషల్ కంటెంట్ ఉంటుందని ఆశిస్తాం. అలా అంచనాలు రేకెత్తించిన మూవీనే ఫస్ట్ డే ఫస్ట్ షో. ప్రమోషన్లు చాలా గట్టిగా చేసుకుని నిన్నే థియేటర్లలో అడుగు పెట్టింది. అనుదీప్ టీమ్ లోని వంశీధర్ గౌడ్, లక్ష్మినారాయణలు దీనికి సంయుక్త దర్శకత్వం వహించారు.

లవర్ మొదటి రోజు పవన్ కళ్యాణ్ ఖుషి టికెట్లు సంపాదించుకుని రమ్మంటే అది మన హీరో ఎలా సాధించుకు వచ్చాడనేదే ఇందులో మెయిన్ పాయింట్. ట్రైలర్ లోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. మహా అయితే ఓ అరగంటలో చెప్పాల్సిన లైన్ ని రెండు గంటలసేపు సాగదీసేందుకు సాహసించిన అనుదీప్ ధైర్యానికి వీరతాళ్ళు వేయాల్సిందే. లేని కామెడీని ఇరికించి అవసరం లేని సీన్లతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి ఎంత విసిగించాలో అంతా చేశారు. బ్లాక్ లో ఓ వంద ఎక్కువ ఖర్చు పెడితే వచ్చే టికెట్ల కోసం అదేదో ఐఎఎస్ ఎగ్జామ్ లాగా అసాధ్యమన్న రీతిలో చూపించే ప్రయత్నం చేయడం మరీ అతిశయోక్తిగా ఉంది. ఇదసలు ఎగ్జైటింగ్ పాయింట్ కూడా కాదు.

నిజానికి దీని మీద అంతో ఇంతో హైప్ వచ్చిందంటే అది అనుదీప్ వల్లే. ఖుషి టికెట్లు సంపాదించడం తప్ప ఇంకెలాంటి సబ్ ప్లాట్స్ రాసుకోక పోవడంతో పదే పదే కథ ఒకే చోట తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏప్రిల్ 1 విడుదలలో నిజాలే మాట్లాడాలి అనే హీరో క్యారెక్టరైజేషన్ కి పారలల్ గా ఓ మర్డర్ మిస్టరీ రన్ అవుతుంది. అందుకే అది కామెడీతో పాటు థ్రిల్ ని ఇచ్చింది. ఇందులో కూడా అలాంటిది ఏదైనా చేసుంటే ఎంగేజ్ చేసే అవకాశం ఉండేది. హీరో హీరోయిన్లు శ్రీకాంత్ సంచితలతో పాటు ఇతర తారాగణం బాగానే చేసినప్పటికీ వీక్ రైటింగ్ వల్ల ఎవరి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదు. పవన్ ఫ్యాన్స్ లోనూ అందరికీ నచ్చే ఆవకాశాలు తక్కువగా ఉన్న ఈ కామెడీని ఓటిటిలో చూడటమే కరెక్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి