iDreamPost

రేపటి “పలుకు” లో తళుకులు ఇవేనా ?

రేపటి “పలుకు” లో తళుకులు ఇవేనా ?

రాజధాని మార్పు

“ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ముఖ్యమంత్రి మీద నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా తమ పొలాలు త్యాగం చేసి మరీ నిర్మించుకున్న రాజధాని నగరం అమరావతి. కేవలం చంద్రబాబు మీద కక్షసాధింపుతో అక్కడ రాజధాని లేకుండా చేయాలని చూస్తున్న వైఎస్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో తరలిస్తుండటం దురదృష్టకరం. ‘పదమూడు జిల్లాల రాష్ట్రానికి న్యాయ, శాసన నిర్వాహక, కార్య నిర్వాహక రాజధానులు అంటూ మూడు నగరాల్లో అవసరమా?’ అని సీనియర్ రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఈ రాజధానుల వ్యవహారం అడ్డుపెట్టుకుని అధికార వైసీపీ మరో కొత్త రాజకీయానికి తెరలేపింది. అదే శాసనమండలిని రద్దు చేయడం… నిజానికీ ఆంధ్రరాష్ట్రంలో కొత్తేమి కాదు. అప్పట్లో శాసనమండలిని ఎన్టీఆర్ రద్దు చేసిందీ, వైఎస్సార్ పునరుద్ధరించిందీ ఆయా పరిస్థితుల్లో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే తప్ప వేరే ఏ కారణాలు లేవు.

రాజధాని నగరాన్ని తమ కక్షసాధింపు ధోరణితో అక్కడి నుంచి మరో చోటకు మార్చడానికి అడ్డుపడుతున్నందున పెద్దల సభను ఏకంగా రద్దు చేసేందుకే ప్రభుత్వం సిద్ధమవుతుండటం చూసి ప్రజలు తాము ఇలాంటి నాయకుణ్ణా ఎన్నుకున్నది? అని బాధపడుతున్నారు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబును గెలిపించడానికి సిద్దపడుతున్నారు.

లోకేష్ ధాటిని తట్టుకోలేకనే మండలి రద్దు

కోర్టుల చుట్టూ ముఖ్యమంత్రి తిరగడానికి ఒక్కో వాయిదాకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వమే శాసనమండలి నిర్వహణకు ఖర్చు అనవసరరం అనడంతో అంతర్జాతీయ సమాజం విస్తుపోయింది. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ శాసనమండలిలో సమర్ధంగా ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీలోని నాయకులు నారా లోకేష్ బాబు నాయకత్వం గురించి, ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ మండలిలో ఎవరు, ఎప్పుడు ఎలా మసులుకోవాలో ఆదేశాలు ఇస్తూ నడిపించిన తీరు గురించి ‘తండ్రికి తగ్గ తనయుడు’ అని వైసీపీ నాయకులు కూడా వారి సన్నిహితుల దగ్గర అనడం జగన్ కు తెలిసినట్టు సమాచారం. ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన లోకేష్ బాబు శాసనమండలిలో ఈ బిల్లును అడ్డుకోవడంతో ద్వారా మరో రెండేళ్లలో బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న అధికార పార్టీ లోకేష్ను అడ్డుకోవటానికి శాసనమండలిని రద్దు చేయడమే పరిష్కారమార్గంగా తెలుస్తున్నదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు .

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ,బీజేపీ పొత్తు

ఇక జనసేన – భారతీయ జనతా పార్టీ(భాజపా)ల పొత్తు సంగతికొస్తే – ఇది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆహ్వానించదగ్గ పరిణామమనే చెప్పవచ్చు. ప్రత్యేకహోదా విషయంలో మాట తప్పి, అయిదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల మనోభావాల్ని భాజపా దెబ్బతీసిందన్న మనోవేదనతో ‘తెలుగుదేశం’ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాతో తెగతెంపులు చేసుకుంది.

ఆ రోజున చంద్రబాబు భాజపాతో తెగతెంపులు చేసుకోకుండా, ప్రత్యేకహోదా విషయంలో ఒక ఒప్పందానికి వచ్చి 2014 ఎన్నికల్లో మాదిరిగానే కలిసి పోటీ చేసుంటే ఫలితం వేరేలా ఉండేది. రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబుకు మరో సారి అవకాశం ఇస్తే భాజపా పెద్దల్ని ఒప్పించి ప్రత్యేకహోదా తీసుకొస్తాడనే నమ్మకంతో అధికారం కూడా కట్టబెట్టే వారు. ఇవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసిన పార్టీతో కలిసుండకూడదనే పంతానికి పోయి తెగతెంపులు చేసుకుని జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేశాడు. ఈ పరిణామాలన్నీ గమనించి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం రాష్ట్రానికి ఎంత అవసరమో ఆకళింపు చేసుకున్న పవన్ కల్యాణ్, భాజపాకు చేరువయ్యే దిశగా అడుగులేసి ఒక ప్రణాళిక ప్రకారం వారితో పొత్తు పెట్టుకున్నాడు. నిజానికీ ఈ కలయిక రాష్ట్రానికి మంచి చేసేదే.

అదీ గాక – రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న కాపు సామాజికవర్గానికి, వారిని ఎప్పటి నుంచో బీసీల్లో చేర్చాలన్న వారి డిమాండ్ కి ఈ పొత్తు ఉపకరిస్తుందని పలువురి అంచనా. చంద్రబాబు గతంలో కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్ల కోసం ఎంత పోరాడినా, ఈబీసీ రిజర్వేషన్ కోటాలో సగం కాపులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కేవలం కమ్మ కులస్తులకే మంచి చేస్తారనే ప్రచారాన్ని వైసీపీ కాపుల్లోకి విరివిగా తీసుకెళ్లడంతో తెలుగుదేశం పార్టీకి కాపులు దూరమయ్యారు. కాపుల్లో కొంత భాగం పవన్ కల్యాణ్ వెంట నిలబడటం కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించిందని చెప్పచ్చు.

జగన్ మీద వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి

కొందరు తెలుగుదేశం నాయకులు చెప్తున్నట్లు 75 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ మీద అసంతృప్తితో ఉన్నారు. వీరిలో అనేక మంది జగన్ను వీడి చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చాలని భావిస్తున్నారంట.కానీ చంద్రబాబు తొందరపడకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. తనకు అధికారం కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని,మీరంతా జగన్ మీద ఒత్తిడి తెచ్చి అమరావతిని కొనసాగేలా ఒప్పించమని వారితో చెప్పినట్లు సమాచారం.

ఏది ఏమైనా రాష్ట్రప్రయోజనాలే ముఖ్యం. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు సూచనలు ,సలహాలు తీసుకొని జగన్ మంచి పరిపాలన చెయ్యాలి,మేము కూడా అలాంటి పరిపాలనకు మద్దతు ఇస్తాం.

ఇవి నేటి పలుకులు కాదు రేపు వచ్చే పలుకులు… ఇవి రాయటానికి జ్యోతిష్యం అవసరం లేదు ..వారం వారం ఆ పలుకులు చదివితే ఎవరైనా ఆ పలుకుల్లో ఏమి రాస్తారో ముందే చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి