iDreamPost

డబ్బింగ్ చిత్రాల రీ”మేకులు”- రీమేక్ చిత్రాల డబ్బింగులు

డబ్బింగ్ చిత్రాల రీ”మేకులు”- రీమేక్ చిత్రాల డబ్బింగులు

చలన చిత్ర పరిశ్రమ చాల చిత్రమైనది..ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి.. ఒక భాషలో విడుదలై సంచలన విజయం సాధించిన సినిమాలను వేరే భాషలో రీమేక్ చేయడమో డబ్ చేయడమో చేసి సదరు నిర్మాతలు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడం మామూలే.. మాతృ భాషలో హిట్ అయిన చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేసి ఆ రీమేక్ చేసిన చిత్రాన్ని తిరిగి మాతృక రూపొందిన భాషలోకి డబ్ చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రయత్నించే నిర్మాతలు లేకపోలేదు.

కానీ ఒక భాషలో హిట్ అయిన సినిమాని వేరే భాషలో డబ్ చేసి దాన్ని ప్రేక్షకులు తిరస్కరించిన తర్వాత కూడా ఆ సినిమా కథపై ఉన్న నమ్మకంతో అదే సినిమాని రీమేక్ రూపంలో రూపొందించడానికి కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.ఒక్కోసారి ఆల్రెడీ డబ్ అయ్యి పరాజయం పొందిన చిత్రాలను రీమేక్ చేయడానికి కూడా నిర్మాతలు వెనుకాడటం లేదు.. హిట్ అవుతుందన్న నమ్మకమో లేక పెద్ద స్టార్ ఒప్పుకున్నాడన్న అతివిశ్వాసమో సదరు నిర్మాతల్లో ఉంటుందన్న మాట వాస్తవం. అలాంటి కొన్ని “చిత్రా”లను పరిశీలిస్తే..

నరసింహనాయుడు-ఎజుములై-సింహ బలుడు: 2001లో నరసింహనాయుడు చిత్రం తెలుగులో సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. గత రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన నరసింహనాయుడు బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని తమిళంలో అర్జున్ హీరోగా, స్వీయ దర్శకత్వంలో “ఎజుమలై” తమిళంలో కూడా హిట్ చిత్రంగా నిలిచింది. కానీ తెలుగులో అర్జున్ మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి అదే చిత్రాన్ని “సింహ బలుడు”గా డబ్ చేసి థియేటర్లలోకి వదిలారు. కానీ ప్రేక్షకులు తిరస్కరించారు.

కృష్ణ-రజని-రజని ఫ్రమ్ రాజమండ్రి: 2008 లో సంక్రాంతి కానుకగా విడుదలైన కృష్ణ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచింది. రవితేజ హీరోగా, వినాయక్ దర్శకతంలో రూపొందిన కృష్ణ, బాలకృష్ణ ఒక్కమగాడు చిత్రంతో పోటీపడి మరీ ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని కన్నడ భాషలో ఉపేంద్ర కథానాయకుడిగా రజని పేరుతో రూపొందించారు. అదే చిత్రాన్ని మళ్ళీ తెలుగులో రజని ఫ్రమ్ రాజమండ్రి పేరుతో డబ్ చేసి ప్రేక్షకులపైకి వదిలారు. కానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పరిగణలోకి తీసుకోలేదు.

వీరమ్-వీరుడొక్కడే-కాటమరాయుడు:  శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందిన వీరం సంచలన విజయం సాధించగా అదే చిత్రాన్ని తెలుగులో “వీరుడొక్కడే” పేరుతో డబ్ చేసారు. కానీ వీరుడొక్కడే ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది.తెలుగులో డబ్ అయ్యిందని తెలిసినా పవన్ కళ్యాణ్ వీరమ్ రీమేక్ కాటమరాయుడి లో నటించారు. వీరమ్ రీమేక్ కూడా పవన్ కళ్యాణ్ కు హిట్ అందించలేదు. అప్పటికే వీరుడొక్కడే చూసిన ప్రభావమో లేక మరే ఇతర కారణం వల్లనో “కాటమరాయుడు” అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేదు.

జిగర్తాండ-చిక్కడు దొరకడు- గడ్డలకొండ గణేష్: 2014 లో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన కామెడీ గ్యాంగ్ స్టర్ మూవీ జిగర్ తాండా..ఈ చిత్రంలో నటనకు గాను బాబీ సింహ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అవార్డులతో పాటు రివార్డులు దక్కించుకున్న ఈ చిత్రాన్ని చిక్కడు దొరకడు పేరుతో డబ్ చేయగా తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. అదే చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా గద్దల కొండ గణేష్ పేరుతో రీమేక్ చేసారు. గడ్డలకొండ గణేష్ మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

టెంపర్-అయోగ్య-అయోగ్య: 2015లో విజయాల్లేక నిరాశలో ఉన్న ఎన్టీఆర్ ని తిరిగి హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రంగా టెంపర్ నిలిచింది. సమకాలీన సమస్య ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన టెంపర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దీన్ని అయోగ్య పేరుతొ తమిళంలో విశాల్ హీరోగా రీమేక్ చేసారు. అక్కడ కూడా మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని విశాల్ కి తెలుగులో ఉన్న మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి అయోగ్య పేరుతో డబ్ చేసి థియేటర్లలో వదిలారు. కానీ విశాల్ అయోగ్య విజయం సాధించలేదు.

లూసిఫర్-లూసిఫర్: మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్విరాజ్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన లూసిఫర్ చిత్రం మలయాళ చిత్రాలన్నిటిలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చితంగా నిలిచింది. అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేసారు. కానీ అనుకున్నంత పేరు మాత్రం రాలేదు. ఇదే చిత్రాన్ని చిరంజీవి హీరోగా సుకుమార్ రూపొందిస్తారని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ డిజిటల్ ఫ్లాట్ఫార్మ్స్ లో ఉన్న ఈ చిత్రాన్ని ఇప్పటికే పలువురు ప్రేక్షకులు చూసారు. లూసిఫర్ చిత్రాన్ని చిరంజీవి ఇమేజ్ కి అనుగుణంగా మార్పులు చేయించి సరికొత్త కథగా తీస్తారని ప్రచారం జరుగుతుంది.

తేరి-పోలీసోడు: అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందిన చిత్రం తేరి.. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో పోలీసోడుగా డబ్ చేశారు. కానీ విజయం సాధించలేదు. ఇదే చిత్రాన్ని రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రీమేక్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ పట్టాలెక్కలేదు.

ఏదేని భాషలో రూపొందిన చిత్రాలను వేరే భాషలో డబ్ చేసినప్పుడు నేటివిటీ లేనందువల్ల పరాజయం పాలవ్వడం సాధారణంగా జరిగే విషయమే. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని కొందరు నిర్మాతలు ఆయా కథలపై ఉన్న నమ్మకంతో ఆల్రెడీ డబ్ అయినా సరే వాటిని రీమేక్ చేసే సాహసం చేస్తున్నారు. కానీ వాటిలో విజయాలు సాధించే చిత్రాలను వేళ్ళపై లెక్కపెట్టుకోవచ్చు. నిర్మాతలు ఇకనైనా డబ్ అయిన చిత్రాలను రీమేక్ చేయడం మాని కొత్త తరహా కథలను తెరకెక్కిస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకసారి చూసేసిన కథలను మళ్ళీ వేరే హీరోతో అదే కథతో పేరు మార్చి రూపొందించినంత మాత్రాన విజయం సాధించవనే విషయాన్ని నిర్మాతలు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి