iDreamPost

రేవంత్ రెడ్డి సైలెంట్.. కారణం అదేనా..?

రేవంత్ రెడ్డి సైలెంట్.. కారణం అదేనా..?

అనుమతి లేకుండా తెలంగాణ ఐటీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఫామ్ హౌస్ పైకి డ్రోన్ కెమెరా పంపిన కేసులో కాంగ్రెస్ ఎంపీ అనుమోలు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లొచ్చారు. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన రేవంత్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక నుంచి తాను కేసీఆర్‌, కేటీఆర్‌ ల అక్రమాలన్నీ బయటపెడతానని చాలెంజ్ చేసారు. అసలు కేసీఆర్‌ అక్రమాలను బయటపెట్టేందుకే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ కరోనా పార్టీ అయితే టీఆర్‌ఎస్‌ ఎయిడ్స్‌ పార్టీ అంటూ విమర్శలు చేసారు.

ఈ క్రమంలో సహజంగానే తెలంగాణ కాంగ్రెస్ లీడర్లలో లేని ఏకాభిప్రాయాన్ని కూడా రేవంత్ బహిరంగంగా ప్రస్తావించారు. పార్టీ అగ్రనేత కుంతియా ఆదేశాల మేరకే తాను ఆ కార్యక్రమం చేపట్టానన్నారు. అసలు కేసీఆర్‌, కేటీఆర్‌ల అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించాల్సిందని కానీ ఆయన అలా చేయలేదని వ్యాఖ్యానించారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ ముట్టడికి ఉత్తమన్న పిలుపు ఇచ్చి ఉంటే కార్యకర్తలు ఎంతో ఉత్తేజంతో పనిచేసుండేవారన్నారు. అలాగే తాను చర్లపల్లి జైల్లో ఉన్నపుడు ఉత్తమ్‌ పరామర్శకు రాలేదని, ఈ విషయాన్ని అక్కడి ఖైదీలు తనను అడిగారని రేవంత్ చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌ అవినీతిపై పోరాటంలో భాగంగా భూ లావాదేవీలపై పోరాట బాధ్యత తనకు, సాగునీటి రంగంలో దోపిడీపై పోరాట బాధ్యత ఉత్తమ్‌కు కుంతియా అప్పగించారని రేవతం చెప్పారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. వెంటనే రేవంత్ మరో స్టేట్మెంట్ ఇచ్చారు. రేపటినుంచి టీఆర్‌ఎస్‌ దోపిడీ వివరాలను కాగితాల రూపంలో విడుదల చేస్తానని, నిత్యం వారి అక్రమ కోటలవద్దకు వెళ్లి వారి అన్యాయాల్ని ప్రజలకు వివరిస్తానని రేవంత్ ప్రకటించారు.

కానీ ఆ తర్వాతి రోజు రేవంత్ కనీసం కిమ్మనలేదు. అసలు బయటకు కూడా రాలేదు. అదేంటి మన నాయకుడు కార్యాచరణ ప్రకటించాడు కదా బయటకు వస్తాడని చూసిన రేవంత్ అనుచరులకు కూడా నిరాశే ఎదురైంది. అయితే కేసీఆర్‌, కేటీఆర్‌కు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి ఉత్తమ్ సహా కాంగ్రెస్ లీడర్లెవ్వరూ మద్దతు ప్రకటించకపోవడం, మరోవైపు మీడియా మొత్తం కరోనా చుట్టూ తిరుగుతుండగా, ప్రజలంతా కరోనా భయాందోళనలె ఉండగా తాను హడావిడి చేసినా ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో రేవంత్ సైలెంట్ అయ్యారని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి