iDreamPost

1945 Movie : 1945 రిపోర్ట్

1945 Movie : 1945 రిపోర్ట్

ఎప్పుడో అయిదారేళ్ళ క్రితం రానా నటించిన 1945 ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నాకెలాంటి సంబంధం లేదని రానా పలుమార్లు స్పష్టం చేయడమే కాదు దీనికి కనీసం డబ్బింగ్ కూడా చెప్పుకోలేదు. రిలీజ్ దగ్గరలో ఉన్నా ప్రమోషన్ కాదు కదా కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు. హీరోనే అంత నిరాసక్తంగా ఉన్న ఈ మూవీ మీద అంతో ఇంతో దగ్గుబాటి అభిమానులు మాత్రమే ఆసక్తి చూపించారు. పబ్లిసిటీ లోపం వల్ల సగటు ప్రేక్షకులకు ఇది వచ్చిందన్న సంగతి కూడా అవగాహన లేదు. రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ వార్ డ్రామాకు దర్శకుడు సత్యశివ. ఇన్ని ప్రతికూలతల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

ఇది బర్మా నేపథ్యంలో 1945 సంవత్సరం వేదికగా సాగుతుంది. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సుభాష్ చంద్ర బోస్ ఐఎన్ఎని ప్లాన్ చేసుకుంటారు. తన కుటుంబ వ్యాపారం చూసుకోవడానికి అదే సమయంలో బర్మా వస్తాడు ఆది(రానా). స్థానిక తహసీల్దార్ (నాజర్) కూతురు(రెజీనా)తో నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో బ్రిటిష్ సైన్యం అల్లకల్లోలం రేపుతోంది. దీంతో తనకు ఆ ఉద్దేశం లేకపోయినా వాళ్ళతో పోరాడాల్సిన పరిస్థితిలోకి వెళ్తాడు ఆది. ఇతను సుభాష్ చంద్ర బోస్ కి ఎలా లింక్ అయ్యాడు, బ్రిటిషర్లతో యుద్ధంలో ఎలా గెలిచాడు, చివరికి ఏమయ్యాడు అనేది తెరమీద చూసి తరించాలి.

ఈ 1945లో సగం ఉడికిన వంటకం. ఏమైనా విబేధాలు రావడం వల్ల ఇంత ఆలస్యం జరిగిందా లేక ఎలాగూ పోయే కళ కనిపిస్తోంది కాబట్టి హీరోతో సహా అందరూ చేతులెత్తేశారో తెలియదు కానీ ఒక క్రమపద్ధతిలో ఇందులో కథనం సాగకపోవడం ప్రధాన మైనస్. నిర్మాణ విలువలు, ఆర్ట్ డైరెక్షన్ లాంటివి తమ పని సవ్యంగానే చేసినా ఎమోషన్స్ తో అవసరమే లేదన్నట్టు సాగిన ఈ దేశభక్తి డ్రామా చివరికి నిరాశనే మిగులుస్తుంది. క్లైమాక్స్ లేకుండా హఠాత్తుగా ముగించడం ప్రేక్షకులను మోసం చేయడమే. నాజర్,సత్యరాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు వృథా అయ్యారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో పెద్దగా మెరుపులు లేవు. కనీస అంచనాలు పెట్టుకున్నా నేరమనేలా సాగిన ఈ 1945ని రానా ఎందుకు అలా వదిలేశాడో థియేటర్ నుంచి బయటికి రాకముందే అర్థమైపోతుంది

Also Read : Atithi Devo Bhava : అతిథిదేవోభవ రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి