iDreamPost

వర్షాలతో, టికెట్ రేట్లతో వారియర్ టెన్షన్

వర్షాలతో, టికెట్ రేట్లతో వారియర్ టెన్షన్

ఈ గురువారం విడుదల కాబోతున్న ది వారియర్ కు కొత్త టెన్షన్లు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా కురుస్తున్న వర్షాలు థియేటర్ కలెక్షన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ కి కాలేజీలకు ఏకంగా మూడు రోజులు సెలవులు ప్రకటించడం చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనం ఏసి థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే మూడ్ లో లేరు. పైగా ఇటీవల వచ్చిన పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్ డే లాంటి అంతో ఇంతో అంచనాలున్నవి కూడా నిరాశ పర్చడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కుటుంబాలను హాలుకు తీసుకెళ్లే ఆలోచన ఎంత మాత్రం చేయడం లేదు.

ఈ పరిస్థితి ఇంకో వారం పది రోజులు ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనా ది వారియర్ ను ఇబ్బంది పెడుతోంది. ఒకపక్క నైజామ్ లో టికెట్ 295 రూపాయల దాకా గరిష్ట ధర పెట్టడంతో ఓపెనింగ్స్ మీద అనుమానాలున్నాయి. దానికి తోడు ఇప్పుడీ రైన్ ఎఫెక్ట్. రెండు మూడు రోజుల్లో అంతా సద్దుమణిగితే పర్లేదు కానీ లేదంటే మాత్రం వసూళ్ల పరంగా వారియర్ కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి