iDreamPost

ఆత్మహత్య చేసుకుంటానని రామ్ చరణ్ వీరాభిమాని వార్నింగ్! లెటర్ లో ఇద్దరి పేర్లు..

  • By Soma Sekhar Published - 03:33 PM, Sat - 30 September 23
ఆత్మహత్య చేసుకుంటానని రామ్ చరణ్ వీరాభిమాని వార్నింగ్! లెటర్ లో ఇద్దరి పేర్లు..

తెలుగు ప్రజలకు సినిమాలంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ అభిమాని సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి మూవీ విడుదల అయ్యే దాక ప్రతీ చిన్న అప్డేట్ ను కూడా ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. ఇక అభిమానులకు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందిస్తుంటారు సదరు హీరోలు. అయితే కొన్ని కొన్ని సార్లు అభిమానం మితిమీరి పిచ్చిగా మారుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకుంటాను అని సూసైడ్ లేఖ రాసి వార్నింగ్ ఇచ్చాడు. ఆ లేఖలో ప్రముఖుల పేర్లు ఉండటం గమనార్హం. ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు సూసైడ్ చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దిల్ రాజు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఏళ్లు గడుస్తున్నప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం ముందుకు వెళ్లట్లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ ఇంకా 50 శాతం కూడా షూటింగ్ పూర్తి చేసుకోలేదంట. దానికి కారణం శంకర్.. ఇండియన్ 2 సినిమాను తెరపైకి తీసుకురావడమే అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదీకాక ఈ మూవీ వాయిదాలు పడుతూ వస్తోంది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.

ఇక ఈ సినిమా గురించి ఒక్క అప్డేడ్ కూడా ఇవ్వట్లేదు చిత్ర యూనిట్. తాజాగా రెండు నెలల పాటు ఈ మూవీ షూట్ ను వాయిదా వేశారని తెలుస్తోంది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతుండటంతో తట్టుకోలేని చరణ్ వీరాభిమాని ఒకరు ఏకంగా సూసైడ్ లెటర్ తో మూవీ టీమ్ కు వార్నింగ్ ఇచ్చాడు. మరో 3 రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ చెప్పకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. ఇక తన చావుకు కారణం దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ లేనని ఆ లెటర్ లో రాసుకురావడం కొసమెరుపు. ఇంతకీ ఆ సూసైడ్ నోట్ లో ఏం రాశాడంటే?

“రామ్ చరణ్ వీరాభిమానిగా నేను గేమ్ ఛేంజర్ కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను. మూవీ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. కనీసం రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. మీరు మరో మూడు రోజుల్లో సినిమా విడుదల తేదీని ప్రకటించకపోతే.. నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇక నా చావుకు ప్రధాన కారణం డైరెక్టర్ శంకర్, దిల్ రాజు, SVC Ram Charan,నిర్మాణ సంస్థ వారే, నా బాధను అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా. లవ్ యూ చరణ్ అన్నా.. నిన్ను చాలా మిస్ అవుతున్నా.. ఇట్లు బాబు గౌడ్” అనే పేరుతో సూసైడ్ లెటర్ రాశాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎంత అభిమానం ఉన్నాగానీ ఇలా చేయడం తగదు అంటున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరు మాత్రం ఇలాంటివి సరదా కోసం చేస్తారని కొట్టిపారేస్తున్నారు. మరి మూవీ రిలీజ్ డేట్ చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్ని చరణ్ ఫ్యాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.