iDreamPost

పార్టీ సన్నాహాల్లో ర‌జ‌నీ స్పీడ్..!

పార్టీ సన్నాహాల్లో ర‌జ‌నీ స్పీడ్..!

సూప‌ర్ స్టార్ రజనీకాంత్‌ పార్టీ పెట్ట‌డంపై సందిగ్గ‌త తొల‌గిన‌ప్ప‌టి నుంచీ త‌మిళ‌నాడు రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో ప్రకంపనలు మొద‌ల‌య్యాయి. రజనీ పార్టీ వల్ల తమ పార్టీకి లాభనష్టాలను బేరీజు వేసుకోవడంలో ప్రధాన పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా.. రజనీకాంత్‌ పార్టీని ప్రారంభించక ముందే అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నెలాఖరులోగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్టర్‌ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీ ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలని మండ్రం నేతలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి జోన్‌కు కనీసం 30 మందికి తగ్గకుండా బూత్‌కమిటీ సభ్యులను నియమించాలని మండ్రం జిల్లా నేతలకు ఆయన ఆదేశించారు.

28 రోజుల్లో రిజిస్ట్రేష‌న్ పూర్తికి ఏర్పాట్లు

కొత్తపార్టీ స్థాపనకు అవసరమైన సన్నాహాలు ప్రారంభించామని రజనీకాంత్‌ స్థాపించబోయే పార్టీకి ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన అర్జున్‌మూర్తి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ పనులు 28 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రజనీ చిత్రం పూర్తయిన తరువాతనే పార్టీని రిజిస్ట్రే్టషన్‌ చేస్తామన్నారు. బీజేపీకి గురువారం ఉదయమే ఆయన రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి జనాకర్షణ నేతలు లేరు. ఈ పరిస్థితుల్లో రజనీ మాత్రమే ప్రజల మన్ననలు పొందగలిగిన నేతగా తెరపైకి వచ్చారు. కరోనా ఆంక్షల కారణంగా అన్ని పార్టీలూ ఎన్నికల ప్రచారాలకు సామాజిక మాధ్యమాలపై ఆధారపడక తప్పదు. బూత్‌ కమిటీల వరకు రజనీ పార్టీ ఇప్పటికే బలమైన శక్తిగా నిలిచి ఉంది. పార్టీ ప్రకటనలో రజనీ ఆలస్యం చేశారనడం సరికాదు, సరైన సమయంలోనే నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.

ఇదిలా ఉండ‌గా.. ర‌జ‌నీ పార్టీ పెడితే ఎవ‌రికి ఎలాంటి న‌ష్టం వాటిల్లుతుంద‌నే దానిపై రాష్ట్రంలోని పార్టీల్లో జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. విజయకాంత్‌ 2006లో పార్టీ పెట్టి ఒంటరిగా పోటీకి దిగినపుడు కేవలం ఒక్క సీటు (విజయకాంత్‌) మాత్రమే గెలుచుకున్నా 8.5 శాతం ఓట్లను చీల్చడం ద్వారా వంద నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపారు. వచ్చే ఎన్నికల్లో రజనీ వల్ల అదే పరిస్థితి ఎదురైతే అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఎవరికి నష్టం అనే అంశంపై భిన్నాభిప్రాయలున్నాయి. దీంతో పాటు రజనీది ఒంటరి పోరా, కూటమా అనేది స్పష్టం కావాల్సి ఉంది. ఒంటరిగా పోటీచేస్తే ఎన్నిసీట్లు దక్కుతాయనేది ఇటీవల రజనీ స‌ర్వే జ‌రిపించిన‌ట్లు తెలిసింది. కమల్‌హాసన్‌ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే కనీసం 20 శాతం ఓట్లు ఖచ్చితంగా చీలుస్తారని తెలుస్తోంది. అదే జ‌రిగితే అన్నాడీఎంకే, డీఎంకేలకు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంది. ఏం జ‌రుగుతుందో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి