iDreamPost

Rajinikanth: రజినీకాంత్​ను ‘సంఘీ’ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఈ వివాదం ఎలా మొదలైంది!

  • Published Jan 31, 2024 | 8:18 PMUpdated Jan 31, 2024 | 8:18 PM

తమిళనాట ఇప్పుడు ‘సంఘీ’ కాంట్రవర్సీ నడుస్తోంది. అసలు తలైవా రజినీకాంత్​ను అలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఈ రగడ ఎలా మొదలైందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తమిళనాట ఇప్పుడు ‘సంఘీ’ కాంట్రవర్సీ నడుస్తోంది. అసలు తలైవా రజినీకాంత్​ను అలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఈ రగడ ఎలా మొదలైందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 31, 2024 | 8:18 PMUpdated Jan 31, 2024 | 8:18 PM
Rajinikanth: రజినీకాంత్​ను ‘సంఘీ’ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఈ వివాదం ఎలా మొదలైంది!

కోలీవుడ్ సూపర్​స్టార్ రజినీకాంత్​ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయనకు సంబంధించిన సినిమాల ద్వారానో లేదా రాజకీయంగానూ తలైవా మీద ఏదో ఒక న్యూస్, గాసిప్ వస్తూనే ఉంటుంది. యాక్టివ్ పాలిటిక్స్​కు రజినీ దూరంగా ఉంటున్నప్పటికీ కొన్నిసార్లు రాజకీయ నేతల నుంచి ఆయన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు కూడా తమిళనాడులో కొందరు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. రజినీని సంఘీ అని పిలుస్తున్నారు. దీంతో ఇది కాస్తా కాంట్రవర్సీగా మారింది. తాను నటించిన కొత్త చిత్రం ‘లాల్ సలామ్’ ఆడియో ఫంక్షన్​లో ఈ వివాదంపై రజినీతో పాటు ఆయన కూతురు ఐశ్వర్య కూడా రియాక్ట్ అయ్యారు. తన తండ్రి సంఘీ కాదని ఆమె అన్నారు. ఆయన సంఘీ అయ్యుంటే ‘లాల్ సలామ్’ మూవీ చేసేవారు కాదన్నారు. ఈ పదం చెడ్డదేమీ కాదని తలైవా కూడా అన్నారు. ఈ నేపథ్యంలో అసలు సంఘీ అంటే ఏంటి? ఈ వివాదం ఎప్పుడు మొదలైంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వివాదం ఎందుకు?
తలైవా రజినీకాంత్​ను కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తుంటారు. పెద్ద నోట్ల రద్దుతో పాటు కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలకు సూపర్​స్టార్ మద్దతును ఇవ్వడం, ట్యుటికోరన్ కాల్పుల ఘటనలో నిరసనకారులను సంఘ వ్యతిరేక శక్తులుగా వ్యాఖ్యానించడం, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకోవడం, రామ మందిర ప్రారంభోత్సవం రోజున అయోధ్యకు వెళ్లడం తదితర విషయాల మీద తమిళనాడులో ఆయన విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. బీజేపికి సపోర్ట్ చేస్తున్న రజినీ సంఘీ అని నెట్టింట్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘లాల్ సలామ్’ ఆడియో వేడుకలో తలైవా కూతురు ఐశ్వర్య దీనిపై రియాక్ట్ అయ్యారు. తన తండ్రిని కొందరు సంఘీ అని పిలుస్తున్నారని.. ఇది విని కోపం వచ్చిందన్నారు. రజినీ సంఘీ కాదని.. ఆయన సంఘీ అయ్యుంటే ఈ మూవీలో యాక్ట్ చేసేవారు కాదన్నారు. ఆయన మతవాది కాదని.. మానవతావాది అని ఐశ్వర్య స్పష్టం చేశారు.

సంఘీకి అర్థం ఏంటి?
ఒక పార్టీకి చెందిన వారిని సంఘీగా చెబుతున్నారని.. గతంలో సంఘ్​లో పనిచేస్తున్న వారిని మాత్రమే సంఘీ అని పిలిచేవారని రిటైర్డ్ ప్రొఫెసర్ దిలీపన్ అన్నారు. ఇది తమిళ పదం కాదని.. అలాగని సంస్కృతమూ కాదన్నారు. మార్పులను అంగీకరించని వారే సంఘీ అని.. అందుకే బీజేపీ దీన్ని చూసి గర్విస్తుందన్నారు. తమ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉండేవారికి సంఘీ అనే పదం అవమానకరమైనదిగా కనిపిస్తుందని దిలీపన్ పేర్కొన్నారు. అయితే సంఘీ అనే పదం తులసీదాస్ రాసిన హనుమాన్ చాలీసాలో ఉందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్ చెప్పారు. చాలీసాలోని ‘మహా వీర విక్రమ్ భజరంగీ.. గుమతి నివార్ కే సంఘీ’ అనే లైన్లలో సంఘీ అనే పదం ఉందన్నారు. సంఘీ అంటే స్నేహితుడు అనే భావన కనిపిస్తుందని.. అందుకే అలా పిలిస్తే తాము గర్విస్తామన్నారు శ్రీనివాసన్.

సంఘీ అని పిలిస్తే అవమానించినట్లా?
సంఘీ అంటే స్నేహితుడని బీజేపీ నేతలు అంటుంటే.. ఈ పదం వాడుకలోని ధ్వని దాన్ని అవమానకరమైనదిగా చూపుతోందన్నారు రచయిత మత్తిమారన్. ఇది ఎవరూ సృష్టించిన పదం కాదని.. జన్​సంఘ్ నుంచి మొదలుపెడితే బీజేపీ నేతలు, దానికి అనుబంధంగా ఉండేవారందరూ తమను తాము సంఘీలని పిలుచుకుంటున్నారని మత్తిమారన్ తెలిపారు. ఇప్పుడు బీజేపీ మద్దతుదారులను, పార్టీతో సంబంధం లేనివారిని కూడా సంఘీ అని పిలుస్తున్నారని చెప్పారు. గతంలో ఒక సంఘాన్ని తెలియజేసేందుకు వాడిన పదం.. ఇప్పుడు ఓ దృక్పథం ఉన్న వారిని సూచించడానికి ఉపయోగిస్తున్నారని మత్తిమారన్ వివరించారు. మరి.. రజినీకాంత్ సంఘీ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి