iDreamPost

లాస్ ఏంజెల్స్ లో RRRకు బ్రహ్మరథం

లాస్ ఏంజెల్స్ లో RRRకు బ్రహ్మరథం

ఒక సినిమా మహా అయితే నెల రోజులు ఆడటమే గొప్పనుకుంటే ఒక ప్యాన్ ఇండియన్ మూవీ రిలీజై ఏడాదికి దగ్గరగా ఉన్నా ఓవర్సీస్ లో బ్రహ్మరథం దక్కించుకోవడం అంటే అది ఒక్క ఆర్ఆర్ఆర్ కే సాధ్యమయ్యింది. లాస్ ఏంజెల్స్ లో ఉన్న టిసిఎల్ చైనీస్ ఐమ్యాక్స్ థియేటర్ లో జరిగిన స్క్రీనింగ్ కిక్కిరిసిపోయిన ఆడియన్స్ మధ్య తొమ్మిది వందల సీట్లకు పైగా హౌస్ ఫుల్ అయిపోయి నానా రచ్చ చేసింది. విదేశీయులు ఆనందం తట్టుకోలేక భారతీయులతో కలిసి స్క్రీన్ దగ్గరగా వెళ్లి నాటునాటు డాన్స్ చేయడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. షో అయ్యాక యూనిట్ తో ముఖాముఖీ అద్భుతంగా జరిగింది


ఈ స్పెషల్ ప్రీమియర్ కు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటు జక్కన్న ఫ్యామిలీ హాజరవుతారనే సమాచారం ముందే ఉండటంతో కేవలం నిమిషంన్నరకే టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి. ఫ్యాన్స్ విపరీతమైన తాకిడి మధ్య ఇద్దరు హీరోలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మూవీ లవర్స్ తాకిడికి అది అమెరికానా ఇండియానా అని సందేహం వచ్చేలా సందడి నెలకొనడంతో యుఎస్ మీడియా సైతం ఆశ్చర్యపోయి కవరేజ్ ఇచ్చారు. మార్చిలో జరగబోయే ఆస్కార్ వేడుక కోసం రాజమౌళి ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. స్వంత వ్యయంతో గ్లోబల్ ఆడియన్స్ ని చేరువ చేసేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.

వాతావరణం చూస్తుంటే ఏదో ఒక విభాగంలో ఆర్ఆర్ఆర్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. అకాడెమి దృష్టికి ఈ సినిమా గొప్పదనం తీసుకెళ్లేందుకు ఫారిన్ జర్నలిస్ట్ లే కాదు హాలీవుడ్ ప్రముఖులు సైతం తమ వంతుగా ట్వీట్లతో మద్దతు తెలుపుతున్నారు. ఈ అవకాశాన్ని వదిలేస్తే మళ్ళీ ఈ స్థాయిలో రీచ్ మరో చిత్రానికి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీ కాకపోయినా ఆర్ఆర్ఆర్ కష్టపడుతున్న తీరు నిజంగా అభినందనీయం. అధికారికంగా వెళ్లిన గుజరాతీ మూవీ లాస్ట్ షోకి అవకాశాలు తక్కువగానే ఉన్న నేపథ్యంలో దశాబ్దాలుగా తీరని కలగా మిగిలిపోయిన ఆస్కార్ స్వప్నం ఈసారి నెరవేరుతుందేమో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి