iDreamPost

రాజమహేంద్రవరం రాజకీయాల్లో కీలక మలుపు… సీటు తనకే దక్కేలా గోరంట్ల వ్యూహం!

  • Published Feb 26, 2024 | 12:41 PMUpdated Feb 26, 2024 | 12:41 PM

కూటమి అభ్యర్థుల ప్రకటన రెండు పార్టీల్లో అసంతృప్త జ్వాలలు రగిల్చింది. అనేక చోట్ల టికెట్‌ ఆశించిన జనసేన నేతలకు మొండి చేయి ఎదురయ్యింది. స్వయంగా పవన్‌ ప్రకటించిన రాజమహేంద్రవరంలో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఆ వివరాలు..

కూటమి అభ్యర్థుల ప్రకటన రెండు పార్టీల్లో అసంతృప్త జ్వాలలు రగిల్చింది. అనేక చోట్ల టికెట్‌ ఆశించిన జనసేన నేతలకు మొండి చేయి ఎదురయ్యింది. స్వయంగా పవన్‌ ప్రకటించిన రాజమహేంద్రవరంలో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఆ వివరాలు..

  • Published Feb 26, 2024 | 12:41 PMUpdated Feb 26, 2024 | 12:41 PM
రాజమహేంద్రవరం రాజకీయాల్లో కీలక మలుపు… సీటు తనకే దక్కేలా గోరంట్ల వ్యూహం!

టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థుల జాబితా రెండు పార్టీల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలను రగల్చింది. ఈ జాబితాపై జనసేన కార్యకర్తలు, నేతలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పొత్తు ధర్మం, విలువలు పాటించకుండా కేవలం తన స్వప్రయోజనాల కోసమే సీట్లు కేటాయించారు.. ఆ ప్రకారమే జాబితా రూపొందించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 24 సీట్లు తీసుకుని పవన్‌ రాజ్యాధికారం ఎలా సాధిస్తారని జనసేన కేడర్‌ ప్రశ్నిస్తోంది. పైగా గతంలో పవన్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తానని మాట ఇచ్చిన వారికి కూడా ఇప్పుడు హ్యాండిచ్చాడు. అభ్యర్థుల ప్రకటనకు ఐదు రోజుల ముందే రాజమహేంద్రవరం రూరల్‌ సీటును జనసేన నేతకు కేటాయించిన పవన్‌.. జాబితాలో మార్పు చేయడంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు..

రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ను జనసేన అభ్యర్థికే అని వారం రోజుల క్రితం ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. కందుల దుర్గేష్‌కు రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ ఇస్తామని భరోసా కూడా ఇచ్చాడు పవన్‌. కానీ అభ్యర్థుల జాబితాలో దుర్గేష్‌కు కేటాయించకపోవడంతో జనసేన నేతలు మండిపడుతున్నారు. మాట ఇస్తే ప్రాణం పోయినా సరే దానిపైనే నిలబడతాను అని ప్రచారం చేసుకునే పవన్‌.. ఐదు రోజుల వ్యవధిలోనే ఇంత దారుణంగా మాట మార్చడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

ఫిబ్రవరి 20న రాజమహేంద్రవరం వచ్చిన జన సేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అంతర్గత సమావేశంలో ఈ సీటుపై దుర్గేష్‌కు భరోసా ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇది జరిగిన ఐదు రోజుల వ్యవధిలోనే ఈ మార్పు చేయడం ఏమిటని దుర్గేష్‌ అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జనసేన పార్టీ గుర్తు ఉన్న స్టిక్కర్లు చించివేశారు. జెండా పీకేసి నిరసన తెలిపారు. దుర్గేష్‌కు రాజమహేంద్రవరం రూరల్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సీటు తనకే దక్కేలా గోరంట్ల వ్యూహం..

రాజమహేంద్రవరం రూరల్‌ సీటు జనసేనకే అని పవన్‌ ప్రకటించిన వెంటనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దీనిపై స్పందిస్తూ.. ఓ ట్వీట్‌ చేశాడు. రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ తనదే అని.. దీనిపై ఎలాంటి మార్పు లేదని.. ఎవరి మాటలు పట్టించుకోవద్దని ట్వీట్‌ చేశాడు. అన్నట్లుగానే.. ఎలాగైనా సరే రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ దక్కించుకోవాలనే పట్టుదలతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చక్రం తిప్పాడు. ఈ సీటు చేజారిపోయిందనుకున్న సమయంలో చంద్రబాబుతో పెద్ద ఎత్తున వాదనకు దిగి మరీ సాధించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయమై పవన్‌ కల్యాణ్‌ సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దుర్గేష్‌ను శనివారం రాత్రి మంగళగిరికి పిలిపించాడు పవన్‌. రూరల్‌ ఆశలు వదిలేసి, నిడదవోలు నుంచి పోటీ చేయాలని దుర్గేష్‌కు సూచించాడు. చేసేది లేక దుర్గేష్‌ నిడదవోలు నుంచి పోటీకి సిద్ధమవుతున్నాడు. కానీ పవన్‌ తీరుపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోసం జనసేన టికెట్లు త్యాగాలు చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి