iDreamPost

రైతు సంక్షేమం ధ్యేయంగా మరో ముందడుగు

రైతు సంక్షేమం ధ్యేయంగా మరో ముందడుగు

పంట వేసే దశ నుండి ఫలసాయం చేతికొచ్చేవరకూ ప్రతిదశలోనూ కల్తీ , అధిక ధరలూ , ఎరువుల కొరత వంటి పలు సమస్యలు ఎదుర్కొనే రైతుకు ఉపశమనం దొరకాబోతుందా అంటే అవుననే చెప్పొచ్చు .

“వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం”

వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన విషయం పాఠకులకు విదితమే . ఆ తర్వాత గత అక్టోబర్ 29 వ తారీఖు “వన్ స్టాప్ షాప్” అనే రైతు కేంద్ర ప్రకటన చేశారు . ఈ కేంద్రాల ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం రైతుకు పంట వేసే దశ నుండి ఫల సాయం చేతికొచ్చేవరకూ ప్రతి దశలోనూ కీలకమైన వ్యవసాయ సలహా సూచనలను ఇస్తూ భూసార పరీక్షల ద్వారా , నీటి లభ్యతని బట్టి ఏ పంటలు వేయొచ్చో సూచనలు చేస్తూ , రైతులు కల్తీలతో మోసపోయి అవకాశం ఉన్న ప్రధానమైన విత్తనాలు , ఎరువులు , పురుగు మందులు లాంటివి స్థానికంగా పరీక్షించి నాణ్యతని నిర్ధారించి తద్వారా రైతులు రైతులు కల్తీ అధిక ధరల బారిన పడకుండా కాపాడటమే ఈ కేంద్రాల ప్రకటన ముఖ్య ఉద్దేశ్యం.

అంతే కాదు గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఉండే ఈ కేంద్రాల్లో అగ్రి షాప్స్ కూడా ఏర్పాటు చేసి స్ప్రేయర్స్ , రోటోవేటర్స్ , వాటర్ ఇంజన్స్ లాంటి మధ్యరకం యంత్రాలు , పలు వ్యవసాయ పరికరాలు నాణ్యమైనవి తక్కువ ధరకు అందించడంతో పాటు పంటల సాగు మెళకువలు , పంటనాశించే తెగుళ్లు , శిలీంద్రాలు , పురుగుల నివారణా పద్ధతుల పట్ల అవగాహన ఏర్పాటు చేయడంతో పాటు , మార్కెటింగ్ అవకాశాలు తెలియజేయడం ఈ క్రాప్ నమోదులో సహాయం చేయడం ద్వారా గిట్టుబాటు ధర అందించడం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు మొత్తం సమగ్రంగా రైతు గ్రామంలో అందించటానికి ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాలకు రైతు బాంధవుడిగా పేరు పొందిన దివంగత నేత స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీదుగా 
“వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం” అని పేరు నిర్ధారించారు .

రాష్ట్రవ్యాప్తంగా 12000 పాయింట్లను గుర్తించి భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి మూడు వేల కేంద్రాలు సిద్ధం చేసింది . మిగతా తొమ్మిది వేల కేంద్రాల పనుల్లో లాక్ డౌన్ నిబంధనల కారణంగా కొంత స్తబ్దత ఏర్పడ్డా వచ్చే ఖరీఫ్ నాటికి రైతులకు అందుబాటులోకి తెచ్చే దిశగా కృషి జరుగుతోంది .

ఇహ ఈ భరోసా కేంద్రాల నిర్వహణకు అవసరమైన పలు రకాల పరీక్షల మినీ కిట్స్ కూడా ఈ నెలాఖరుకు అందుబాటులోకి వస్తాయని సమాచారం . ఈ భాద్యతలు వ్యవసాయ శాఖ కమిషనర్ , ఏపీ సీడ్స్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తుండగా , గ్రామ కేంద్రాల్లో విధులు నిర్వహించే ఉద్యోగస్తులకు వ్యవసాయ , ఉద్యాన శాఖల ద్వారా శిక్షణా తరగతుల నిర్వహణ కూడా పూర్తయ్యింది .

ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత సరైన దిశలో విధులు నిర్వహిస్తే కల్తీ , అధిక ధరలు , అవగాహన లేమితో ఇబ్బంది పడుతున్న రైతులకు ఉపశమనం లభించటంలో ఈ కేంద్రాలు సహాయపడతాయి అని చెప్పొచ్చు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి