iDreamPost

పుజారాను ఔట్‌ చేయడం కష్టం అంటున్న ఆసీస్‌ పేస్ బౌలర్

పుజారాను ఔట్‌ చేయడం కష్టం అంటున్న ఆసీస్‌ పేస్ బౌలర్

కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమితమై బోర్‌గా ఫీల్ అవుతున్న క్రికెటర్లను ఉత్తేజపరచడానికి ఆ దేశ క్రికెటర్‌లతో ఆస్ట్రేలియన్‌ క్రికెటర్స్‌ ఆసోసియేషన్‌ లైవ్‌లో కోశన్స్ అండ్ ఆన్సర్స్ పోగ్రామ్ నిర్వహించింది.ఆ కార్యక్రమంలో టెస్ట్ క్రికెట్‌లో ఏ బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్‌ చేయడం కష్టమని ప్యాట్ కమిన్స్‌ను అడిగారు.ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ ‘భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్‌ పుజారాను ఔట్‌ చేయడం చాలా కష్టమని’ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకులలో అగ్రస్థానంలో ఉన్నకమిన్స్‌ తెలిపాడు.

ఇంకా
ఆసీస్‌ పేస్ బౌలర్ కమిన్స్‌ ఆ ప్రశ్నకు జవాబిస్తూ “నా కెరీర్‌లో నేను బౌలింగ్‌ చేసిన వారిలో బాగా ఇబ్బంది పెట్టిన బ్యాట్స్‌మెన్‌ చాలా మంది ఉన్నారు.అయితే ప్రత్యేకంగా టీమిండియా బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా పేరును చెప్పగలను.2018-19 సీజన్‌లో అతను ఆసీస్‌ బౌలర్‌లను చాలా ఇబ్బంది పెట్టాడు.ఆ సిరీస్‌లో భారత్‌కు అతనే ప్రధానమైన బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌లో పుజారా ఒక దృఢమైన రాయి వలె నిలబడి,అత్యంత ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తాడు.అతనిని ఔట్‌ చేయడానికి చాలా శ్రమించాం.రోజూ అతడిని నియంత్రించడంపై శ్రద్ధ పెట్టే వాళ్ళము.ఇప్పటివరకు నా టెస్టు క్రికెట్‌లో నేను ఎదుర్కొన్న వారిలో చాలా ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌’ అని పేర్కొన్నాడు.

గత 2018-19 సీజన్‌లో కంగారుల గడ్డపై కోహ్లీ సేన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో గెలుపొంది చారిత్రక విజయం నమోదు చేసింది.అలాగే ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుపొందిన తొలి ఆసియా జట్టుగా భారత్ ఘనత సాధించింది.గత సీజన్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించిన పుజారా మూడు సెంచరీలు,ఒక అర్ధ సెంచరీ కొట్టి నాలుగు టెస్టులలో సుమారు 74 సగటుతో 521 పరుగులు సాధించాడు. కాగా కంగారుల గడ్డపై భారత్‌ తొలిసారి టెస్టు సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పుజారా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు దక్కించుకున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి