iDreamPost

బిజినెస్ మేన్ చిత్ర నిర్మాత RR వెంకట్ ఇక లేరు

బిజినెస్ మేన్ చిత్ర  నిర్మాత  RR వెంకట్ ఇక లేరు

ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ మూవీస్ అధినేత వెంకట్ ఇవాళ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంత కాలంగా బాధపడుతున్న వెంకట్ హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చివరి శ్వాస తీసుకున్నారు. కొన్నేళ్లుగా నిర్మాణానికి దూరంగా ఉన్న వెంకట్ గతంలో అగ్ర హీరోలతో చాలా సినిమాలు తీశారు. మహేష్ బాబు ‘బిజినెస్ మెన్’ ఈయన్ని అభిమానులకు చేరువ చేసింది. రవితేజతో కిక్, మిరపకాయ్, డాన్ శీను లాంటి బ్లాక్ బస్టర్లు వెంకట్ ఖాతాలో ఉన్నాయి. ఆది సాయికుమార్ ని ‘ప్రేమ కావాలి’తో పరిచయం చేసింది వెంకటే. అది కమర్షియల్ గానూ మంచి రిటర్న్స్ ఇచ్చింది. సునిల్ తో చేసిన ‘పూలరంగడు’ కూడా ప్రాఫిటబుల్ వెంచర్ గా మిగిలింది.

నాగార్జునతో భారీ బడ్జెట్ తో రూపొందించిన ‘ఢమరుకం’ వెంకట్ ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టింది. నాగ చైతన్య ‘ఆటో నగర్ సూర్య’ కూడా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. నాని పైసా, నితిన్ విక్టరీ, శ్రీకాంత్ మాయాజాలం ఫ్లాపులుగా మిగిలిపోయాయి. 2004లో ‘ఆంధ్రావాలా’ ఆడియో ఫంక్షన్ ని కనివిని ఎరుగని రీతిలో నిర్వహించడం ఇప్పటికీ ఒక రికార్డుగా మిగిలిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది కానీ అంచనాలను అందుకుని ఉంటే కనకవర్షం కురిసేదని అప్పట్లో మీడియా కథనాలు వచ్చాయి. జగపతి బాబుతో ‘సామాన్యుడు’ లాంటి సోషల్ మెసేజ్ హిట్స్ కూడా వెంకట్ తీశారు.

హిందీలో ఆర్ఆర్ వెంకట్ రెండు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఒకటి ఊర్మిళాతో తీసిన ‘ఎక్ హసీనా ధీ’ పర్వాలేదు అనిపించుకోగా రెండోది ‘జేమ్స్’ దెబ్బ కొట్టింది. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డితో ఆహ్వానం హాలీవుడ్ రీమేక్ ‘డైవోర్స్ ఇన్విటేషన్’ తీశారు. ఇది ప్రశంసలు దక్కించుకుంది. ఇలా టాలీవుడ్లో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసిన ఆర్ఆర్ వెంకట్ కన్నుమూయడం ఆయనతో పని చేసిన దర్శకులు హీరోలతో పాటు ఎందరో సాంకేతిక నిపుణులు, అభిమానులను శోక సంద్రంలో ముంచింది. 2011లో యూనివర్సిటీ అఫ్ కొలంబియా నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు వెంకట్. ఆయన లేని లోటు తీర్చలేనిది

Also Read : తమన్నా కెరీర్ ప్లానింగ్ బాగుందిగా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి