iDreamPost

ATM : ఊపందుకుంటున్న వెబ్ సిరీస్ ట్రెండ్

ATM : ఊపందుకుంటున్న వెబ్ సిరీస్ ట్రెండ్

ఇప్పుడంతా వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. మెల్లగా స్టార్లతో పాటు ప్రొడ్యూసర్లు స్టార్ డైరెక్టర్లు వీటి వైపుకు వచ్చేస్తున్నారు. తాజాగా యాభై సినిమాల మార్కుకి దగ్గరగా ఉన్న నిర్మాత దిల్ రాజు ఇందులో అడుగు పెట్టారు. జీ5 కోసం నిర్మించబోయే ఏటిఎం(ATM) కోసం హరీష్ శంకర్ తో చేతులు కలిపారు. రాజు గారి కూతురు హన్షిత ఇందులో భాగస్వామి కావడం విశేషం. అంతేకాదు అగ్ర హీరోలతో సినిమాలు మాత్రమే తీస్తూ వచ్చిన హరీష్ శంకర్ దీనికి కథను అందించడమే కాదు పార్ట్ నర్ గా కూడా పెట్టుబడి పెడుతున్నారు. చంద్రమోహన్ దర్శకత్వం వహించే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో టైటిల్ ని బట్టి ఇది దొంగతనం చుట్టూ తిరిగే కాన్సెప్ట్ అన్ని అర్థమైపోతుంది.

ఇంత పెద్ద చేతులు ఉన్నాయి కాబట్టి క్యాస్టింగ్ కూడా గట్టిగానే ఉంటుంది. కాకపోతే ఎవరు నటిస్తారనేది బయట పెట్టలేదు. ఓ కుర్రాళ్ళ బ్యాచ్ తో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం పేరున్న నటుడినే ప్లాన్ చేసుకున్నారట. ఒక్కొక్కటిగా డీటెయిల్స్ ని తర్వాత ప్రకటిస్తారు. అగ్ర నిర్మాతలు ఒక్కొక్కరుగా ఇప్పుడీ వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు. ఓటిటి సంస్థల నుంచి పెట్టుబడికి రక్షణతో పాటు లాభాలకు గ్యారెంటీ ఉంటోంది. దీని వల్ల సినిమా తీసేందుకు విడుదల చేసేందుకు జరిగే వ్యయ ప్రయాసలన్నీ ఇందులో తప్పుతున్నాయి. అందుకే సమాంతరంగా వీటి మీద కూడా ప్రొడ్యూసర్లు దృష్టి పెడుతున్నారు. అందులో భాగంగా వస్తోందే ఈ ఏటిఎం.

ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో ఊపందుకుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా భారీ సంఖ్యలో వీటిలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గత మూడేళ్ళలో వచ్చిన వెబ్ సిరీస్ లు చూసుకుంటే మాధవన్, కాజల్ అగర్వాల్, తమన్నా, సాయి పల్లవి, సూర్య, శృతి హాసన్, రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లాంటి ఎందరో పేరున్న ఆర్టిస్టులు వీటిలో అడుగు పెట్టి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. నాగ చైతన్య ఓ హారర్ సిరీస్ ని పూర్తి చేశాడు కూడా. ఇప్పుడు దిల్ రాజు ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే రాబోయే రోజుల్లో వీటి తాకిడి భారీగానే ఉండబోతోంది మరి

Also Read : Tollywood Sankranthi : బంగారం లాంటి సీజన్ వృథా అయిపోయింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి