iDreamPost

లవ్ స్టోరీ ముందు గట్టి చిక్కులు

లవ్ స్టోరీ ముందు గట్టి చిక్కులు

కొద్దిరోజుల క్రితం హడావిడిగా ప్రకటించిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 10 రిలీజ్ డేట్ తర్వాత యూనిట్ నుంచి ఇంకా యాక్టివ్ ప్రమోషన్లు మొదలుకాలేదు. టక్ జగదీష్ అదే రోజు ప్రైమ్ లో వస్తుందన్న వార్తల నేపథ్యంలో నిర్మాత సునీల్ నారంగ్ ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టి తన అసంతృప్తిని వ్యక్తపరచడం, కొందరు నోరు జారడం, తర్వాత సారీ చెప్పడం, మళ్ళీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి కౌంటర్ రావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. నిన్న మాస్ట్రో ట్రైలర్ కూడా వచ్చేసింది. అందులో ఓటిటి రిలీజ్ సెప్టెంబర్ 9 ఇచ్చి కొద్దినిమిషాలకే ఎడిటింగ్ చేసి కమింగ్ సూన్ అని పెట్టేశారు. గ్రాండ్ గా అనౌన్స్ చేసేందుకు వేరే ప్లాన్ వేసుకున్నారేమో తెలియదు.

లవ్ స్టోరీ ఇంకా మౌనంగా ఉండటానికి ప్రధాన కారణం ఒకటి కనిపిస్తోంది. వినాయక చవితి పండగ తర్వాత ఏపిలోనూ నాలుగు షోలకు అనుమతులు ఇచ్చి వంద శాతం సీటింగ్ కి పర్మిషన్లు వస్తాయనే టాక్ గట్టిగానే ప్రచారమవుతోంది. ఈ నేపథ్యంలో 10కి బదులు ఇంకో వారం ఆగితే ఈ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదానే ఆలోచనలో లవ్ స్టోరీ నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఇంకా ఏదీ చెప్పలేదు కాబట్టి నిర్ధారించలేం కానీ మొత్తానికి చర్చలైతే జరుగుతున్నాయి. ఇదే నిజమైతే అప్పుడు టక్ జగదీష్ డేట్ మార్చుకోకుండా ప్రైమ్ లో వచ్చినా ఏ ఇబ్బందీ ఉండదు. ఇప్పటికైతే దీనికి సంబంధించి కూడా క్లారిటీ లేదు.

ఒకవేళ మొన్న ప్రకటనకే కట్టుబడితే మాత్రం లవ్ స్టోరీ టీమ్ చేతిలో ఉన్నది కేవలం 15 రోజులు మాత్రమే. ఆల్రెడీ కావాల్సినంత హైప్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కి థియేటర్ కు రప్పించాలంటే ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఏదైనా స్కెచ్ వేయాలి. ట్రైలర్ ని సిద్ధం చేయాలి. దానికో ఈవెంట్ అవసరం. పాటలు ఇంకేవైనా బాలన్స్ ఉంటే వాటినీ విడుదల చేసేయాలి. పబ్లిసిటీ ఈవెంట్లు సెట్ చేసుకోవాలి. ఇవన్నీ రెండు వారాల వ్యవధిలోనే జరిగిపోవాలి. లవ్ స్టోరీ వచ్చే రోజునే తలైవి విడుదల కాబోతోంది. దీన్ని ఇక్కడ పోటీగా అనుకోలేం కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం కొంత కాంపిటీషన్ ఇస్తుంది. చూద్దాం ఫైనల్ గా ఏం డిసైడ్ అవుతారో

Also Read : కళ్లులేని యువకుడి జీవితంలో అలజడి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి