iDreamPost

స్వీపర్‌గా పని చేసిన బ్యాంకులోనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా

చిన్న వయసులో పెళ్లి.. పెళ్ళైన మూడేళ్లకే భర్త చనిపోయాడు. ఆమె చదివిన చదువుకి స్వీపర్ ఉద్యోగం తప్ప ఇంకేమీ రాదు. ఆ స్వీపర్ ఉద్యోగం చేస్తూనే ఆమె బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా ఎదిగారు. ఈమె ఒక సూపర్ ఉమెన్. నేటి యువతకు ఒక రోల్ మోడల్. ఆమె స్ఫూర్తిదాయకమైన కథ మీ కోసం.

చిన్న వయసులో పెళ్లి.. పెళ్ళైన మూడేళ్లకే భర్త చనిపోయాడు. ఆమె చదివిన చదువుకి స్వీపర్ ఉద్యోగం తప్ప ఇంకేమీ రాదు. ఆ స్వీపర్ ఉద్యోగం చేస్తూనే ఆమె బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా ఎదిగారు. ఈమె ఒక సూపర్ ఉమెన్. నేటి యువతకు ఒక రోల్ మోడల్. ఆమె స్ఫూర్తిదాయకమైన కథ మీ కోసం.

స్వీపర్‌గా పని చేసిన బ్యాంకులోనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా

17 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే విధవరాలు.. స్వీపర్ గా పని చేయడం తప్ప ఇంకేమీ తెలియదు. జీవితంలో భర్తను కోల్పోయిన మహిళకి నమ్మకం కోల్పోవడం తప్ప ఆశ ఉంటుందా? ఏదైనా సాధించాలన్న సంకల్పం కలుగుతుందా? కానీ భర్తే సర్వస్వం అనుకున్న ఆ మహిళ.. ఆ సర్వస్వాన్ని కోల్పోయినా భవిష్యత్తు మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేశారు. స్వీపర్ గా పని చేసిన బ్యాంకు బ్రాంచ్ లోనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఇంతకంటే గొప్ప సక్సెస్ ఇంకెక్కడైనా ఉంటుందా? పేదరికం నుంచి వచ్చి ప్రతికూల పరిస్థితులను జయించి మరీ విజయ డంఖా మోగించిన సూపర్ ఉమెన్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. 

ఆమె పేరు ప్రతీక్ష ప్రమోద్ తోండ్ వోల్కర్. ఈమె 1964లో పూణేలో జన్మించారు. తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నారు. పదో తరగతి పరీక్షలు పూర్తవ్వకుండానే 17వ ఏట సదాశివ్ కదు అనే వ్యక్తితో వివాహం జరిగింది. సదాశివ్ ముంబైలోని ఎస్బీఐ బ్యాంకులో బుక్ బైండర్ గా పని చేసేవారు. అయితే పెళ్ళైన మూడేళ్లకే భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు. దీంతో ఆమె 20 ఏళ్లకే భర్తను కోల్పోయిన నిస్సహాయురాలు అయ్యారు. ఆ సమయంలో ఈమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆమె భర్త మరణించిన తర్వాత అతని జీతం తీసుకునేందుకు ఎస్బీఐ బ్రాంచ్ కు వెళ్ళారామె. అయితే తన భర్త ఉద్యోగం ఆమెకు వస్తుందని తెలుసు కానీ చదువు లేని కారణంగా తనకు అర్హత లేదని ఆమె అర్ధం చేసుకున్నారు. దీంతో ఆమె తాను బతకడానికి ఉద్యోగం ఇవ్వమని బ్యాంకు వారిని అడిగారు. అలా ఆమె ఎస్బీఐ బ్యాంకులో స్వీపర్ గా చేరారు.

బ్యాంకు పరిసరాలను శుభ్రం చేయడం.. బాత్రూంలు క్లీన్ చేయడం.. ఫర్నీచర్ దుమ్ము దులపడం వంటివి చేసేవారు. ఈ పనులన్నీ చేసినందుకు ఆమెకు అప్పట్లో నెలకు 60 నుంచి 65 రూపాయల జీతం ఇచ్చేవారట. చిన్న చితకా పనులు చేస్తూ తన కొడుకును చూసుకునేవారు. తన ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. అప్పటి వరకూ ఆమె ఏమీ సంపాదించలేదు. తన ఇంటిని, తన కొడుకుని చూసుకోవడం ఒకటే ఆమె ముందున్న సవాలు. ఈ దుస్థితి నుంచి ఆమె బయట పడాలని అనుకున్నారు. బ్యాంకులో పని చేసినప్పుడు ఇతర ఉద్యోగులను.. వారి అత్యధిక జీతాలను చూసి ఆమె ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలబడాలని.. తన కల కోసం పని చేయడం ప్రారంభించారు. కల నెరవేరాలంటే బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలి. అది జరగాలంటే 10+2 అర్హత ఉండాలి. ముందు పదో తరగతి పాసవ్వాలి. అందుకోసం చదవాలి. చదవాలంటే పుస్తకాలు కావాలి. తనకొచ్చే జీతమే అంతంత మాత్రం. ఆ జీతంతోనే తను, తన కొడుకు బతకాలి.

ఎలా అనుకున్న సమయంలో స్నేహితులు, బంధువుల రూపంలో ఆమెకు సాయం అందింది. ఆమెకు పుస్తకాలు పొందడంతో వారంతా సహాయం చేశారు. బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తూనే కష్టపడి చదివి పదోతరగతి పరీక్షలు రాశారు. ఆ తర్వాత ముంబైలోని విఖ్రోలీలో ఉన్న నైట్ కాలేజీలో చేరి 12వ తరగతి పరీక్షలు పాసయ్యారు. 1993లో ప్రతీక్ష ప్రమోద్ తోండ్ వోల్కర్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈమె బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి కారణం ఈయనే. ఈయన బ్యాంక్ మెసెంజర్ గా పని చేసేవారు. ఈయనే ఆమెను బ్యాంక్ ఎగ్జామ్ రాయమని ప్రోత్సహించారు. ప్రమోద్.. ఆమెకు అన్ని విధాలా సపోర్ట్ గా ఉండేవారు. ఇంటి పనులు చేయడం, కొడుకుని చూసుకోవడం వంటివి చేసేవారు. దీంతో చదువుకునేందుకు ప్రతీక్షకు ఎక్కువ సమయం దొరికేది.

1995లో నైట్ కాలేజీలో చేరి సైకాలజీ విభాగంలో కోర్సు పూర్తి చేశారు. ఆ సమయంలో బ్యాంకు వారు ఆమెకు స్వీపర్ నుంచి క్లర్క్ గా ప్రమోట్ చేశారు. స్వీపర్ గా చేరినప్పటి నుంచి ఆమె ఆ బ్యాంకులో కష్టపడి పని చేసేవారు. ఆమె కష్టాన్ని, నిబద్ధతను మెచ్చిన బ్యాంకు వారు ఆమెకు క్లర్క్ గా ప్రమోషన్ ఇచ్చారు. ఆ తర్వాత భర్త ప్రమోద్ చెప్పినట్టే ఆమె బ్యాంక్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారు. ఆ పరీక్షల్లో ఉతీర్ణులయ్యారు. 2004లో ఆమె ట్రైనీ ఆఫీసర్ గా ఎదిగారు. ఆ తర్వాత స్కేల్ 4కి, ఆ తర్వాత చీఫ్ జనరల్ మేనేజర్ గా ప్రమోట్ చేశారు. రీసెంట్ గా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు. ఇలా ఆమె 18 ఏళ్ల పాటు ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రమోషన్ మీద ప్రమోషన్ పొందుతూ చివరకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. దాదాపు 40 ఏళ్ల పాటు ఆమె ఎస్బీఐ బ్యాంకులో పని చేశారు.

ఆమె పట్టుదల, నిబద్ధత, కష్టపడేతత్వం, నిజాయితీ, కృషి కారణంగా భారతీయ స్టేట్ బ్యాంక్ ఆమెను సత్కరించింది. ఈమె 2021లో నేచురోపతి ప్రోగ్రాంలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఆమె పదవీ విరమణ పొందనున్నారు. రిటైర్మెంట్ తర్వాత ఆమె నేచురోపతిగా తన కెరీర్ ని కొనసాగించనున్నారు. 17 ఏళ్లకే పెళ్లైపోయింది. 20 ఏళ్లకే భర్త చనిపోయాడు. ఆమె చూస్తే పెద్దగా చదువుకోలేదు. తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నారు. లైఫ్ లో ఎదగడానికి కావాల్సిన అర్హతలు ఏమీ లేవు. కానీ ఆమె ఆ అర్హతలన్నిటినీ సంపాదించుకున్నారు. ఏ మనిషికీ పుట్టుకతో అర్హతలు ఉండవు.. కానీ ఆ అర్హతలను మనలోంచి మనమే పుట్టించాలి. మనమే సంపాదించుకోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరగలం.. ఉన్నత శిఖరాలను అధిగమించగలం. మరి ఒక స్వీపర్ గా బ్యాంకులో చేరి అదే బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగిన స్ఫూర్తిదాయకమైన ఈ తల్లి కథను మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వారిలో స్ఫూర్తిని నింపండి. అలానే ఈ తల్లికి కామెంట్లలో ఒక సెల్యూట్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి