iDreamPost

ఫ్యాక్షన్ నుంచి వైరస్ దాకా అన్నీ సీమే

ఫ్యాక్షన్ నుంచి వైరస్ దాకా అన్నీ సీమే

నిజంగా రాయలసీమ గడ్డ మీద ఫ్యాక్షనిజం ఎంత ఉందో అక్కడే ఉండే వాళ్లకు సైతం తెలియదు కానీ తెలుగు తెరమీద దాన్ని క్యాష్ చేసుకున్న దర్శకులు హీరోలు లెక్కలేనంత మంది ఉన్నారు. ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన సమరసింహారెడ్డి నుంచి ఆ మధ్య వచ్చిన అరవింద సమేత వీర రాఘవ దాకా లెక్కబెట్టుకుంటూ పోతే వందల్లో ఉంటాయి. ఎన్ని విమర్శలు వచ్చినా మేకర్స్ ధోరణిలో మాత్రం మార్పు రాలేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఉన్న నెత్తుటి కక్షలు ఇప్పుడు కూడా రాజ్యమేలుతున్నట్టు చూపడం మీద ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఇది కొనసాగుతూనే వచ్చింది.

ఇప్పుడు వైరస్ వంతు వచ్చింది. ప్రపంచమంతా కరోనా వల్ల ఎంత వణికిపోయిందో చూస్తూనే ఉన్నాం. ఇంకా లక్షలాది ప్రాణాలు ఆ మహమ్మారి నుంచి బయట పడేందుకు జీవన పోరాటం చేస్తున్నాయి. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ వైరస్ మీద సినిమా తీస్తున్నాడు. దాని ఫస్ట్ లుక్ పోస్టర్ దాకా ఇందాక విడుదల చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజును బ్యాక్ గ్రౌండ్ లో పెట్టి రక్త కోరలు చాచిన సెటప్ ని జబ్బు రూపంలో హై లైట్ చేసి ఒకరకంగా భయం కలిగించేలా డిజైన్ చేశారు. కాన్సెప్ట్ పరంగా ఆసక్తి రేపినప్పటికీ ఇప్పుడీ నేపధ్యానికి కూడా సీమనే వాడుకోవాలా అంటూ సోషల్ మీడియాలో సీమవాసులు ప్రశ్నిస్తున్నారు.

వాస్తవంగా ఒకదశలో కర్నూలులోనే అధిక కేసులు నమోదు కావడం నిజమే. అయితే దాని కన్నా చాలా రోజుల క్రితమే గుంటూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో సైతం భారీ సంఖ్యలో రోగులు బయటపడ్డారు. అలాంటప్పుడు కేవలం కర్నూలుని మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారన్న ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. ఒక్కడు, ప్రేమించుకుందాం రా, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల పుణ్యమాని కొండారెడ్డి బురుజు బాగా హై లైట్ అయ్యింది కాబట్టి ఇప్పుడీ జబ్బు కోసం కూడా దాన్నే వాడేశారు. అ! తో విమర్శకుల మెప్పు పొంది కల్కితో నిరాశ పరిచిన ప్రశాంత్ వర్మకు ఇది మూడో సినిమా. లాక్ డౌన్ ముందు 40 శాతం దాకా పూర్తి చేశారు. బాలన్స్ అనుమతులు రాగానే మొదలుపెడతారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి