iDreamPost

పోలవరంపై అసత్య ప్రచారానికి పీపీఏ చెక్‌..!

పోలవరంపై అసత్య ప్రచారానికి పీపీఏ చెక్‌..!

పోలవరం ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యంపై జరుగుతున్న ప్రచారం అంతా అసత్యమని తేలిపోయింది. ప్రాజెక్టు సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తామని పోలవరం ప్రాజెక్టు అధారిటీ(పీపీఏ) స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని పేర్కొంది. డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ (డీపీఆర్‌) ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం, నీటి నిల్వ చేస్తామని పీపీఏ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) ఎ.కె. ప్రధాన్‌ తెలిపారు. ప్రాజెక్టు పరిశీలన నిమిత్తం రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఎ.కె. ప్రథాన్‌ బృందం.. మంగళవారం ప్రాజెక్టును సందర్శించింది. ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పోలవరం సూపరింటెండెంట్‌ ఎం. నాగిరెడ్డి వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువు లోపు పూర్తి చేస్తామని కూడా పీపీఏ ఎస్‌ఈ ఎ.కె. ప్రధాన్‌ పునరుద్ఘాటించారు.

ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వ కెపాసిటీపై తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా విస్తృత ప్రచారం సాగించాయి. ముందు ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ మీడియాలో వరుస కథనాలు రాగా.. ఆ తర్వాత వాటిని పట్టుకుని తెలుగుదేశం పార్టీ నేతలు ఎత్తు తగ్గిస్తున్నారంటూ హడావుడి చేశారు. ఎత్తు ఎట్టి పరిస్థితులలోనూ తగ్గబోదని, ప్రాజెకు పూర్తయిన తర్వాత కావాలంటే టేపు పెట్టి కొలుచుకోవాలని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పలువురు మంత్రులు స్పష్టత ఇచ్చారు.

ఎత్తుపై జరిగిన ప్రచారానికి చెక్‌ పడిందనుకునేలోపు మళ్లీ నీటి నిల్వపై సందేహాలు రేగేలా కథనాలు, టీడీపీ నేతల ప్రకటనలు యథావిధిగా సాగాయి. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామరథ్యం 194 టీఎంసీలు కాగా.. ముంపు పరిహారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయదంటూ ప్రచారం సాగించారు. ప్రాజెక్టు పూర్తి చేసే ఇతర ప్రాజెక్టుల మాదిరిగానే దఫదఫాలు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్నే తాజాగా పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ప్రతినిధులు స్పష్టం చేయడంతో జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పడినట్లైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి