iDreamPost

Power Cut: అరగంట కరెంట్‌ కట్‌ చేశారన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. డీఈపై వేటు

  • Published Apr 29, 2024 | 12:15 PMUpdated Apr 29, 2024 | 12:15 PM

మాజీ మంత్రి మల్లారెడ్డి.. కరెంట్‌ కోతలపై చేసిన వ్యాఖ్యలు ఓ ఉద్యోగిపై వేటుకు దారి తీశాయి. అసలేం జరిగింది.. మల్లారెడ్డి ఏం అన్నాడు.. ఎందుకు డీఈని సస్పెండ్‌ చేశారంటే..

మాజీ మంత్రి మల్లారెడ్డి.. కరెంట్‌ కోతలపై చేసిన వ్యాఖ్యలు ఓ ఉద్యోగిపై వేటుకు దారి తీశాయి. అసలేం జరిగింది.. మల్లారెడ్డి ఏం అన్నాడు.. ఎందుకు డీఈని సస్పెండ్‌ చేశారంటే..

  • Published Apr 29, 2024 | 12:15 PMUpdated Apr 29, 2024 | 12:15 PM
Power Cut: అరగంట కరెంట్‌ కట్‌ చేశారన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. డీఈపై వేటు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోపణలు.. కరెంట్‌ కోతలు. తాము అధికారంలో ఉన్న పది ఏళ్లలో రాష్ట్రంలో కరెంటు కష్టాలు లేవని.. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేశామని.. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. విద్యుత్‌ కోతలు మొదలయ్యాయని.. బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేస్తోంది. అయితే కావాలనే కొందరు ఉద్యోగులు కరెంట్‌ కోతలు విధించి.. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అధికార కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తెలంగాణలో అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య.. పవర​ కట్స్‌ పంచాయతీ నడుస్తోంది.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కరెంటు కోతలు పెరిగాయని.. బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంటే.. అదంతా అసత్య ప్రచారం అని అధికార పార్టీ చెప్పుకొస్తుంది. అంతేకాక క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు కావాలనే అనధికారికంగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని.. అలాంటి చర్యలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇది వరకే హెచ్చరించారు. అలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా దీన్ని నిజం చేస్తూ.. డీఈని సస్పెండ్‌ చేశారు. ఆ వివరాలు..

తాజాగా.. అరగంట పాటు కరెంట్‌ కట్‌ చేసినందుకు గాను.. హైదరాబాద్‌లోని హబ్సిగూడ సర్కిల్‌ కీసర డివిజనల్‌ ఇంజినీర్‌ (డీఈ) ఎల్‌.భాస్కర్‌రావును సస్పెండ్‌ చేస్తూ.. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక నాగారం ఆపరేషన్‌ అడిషనల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈఈ)పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో లైన్‌ క్లియరెన్స్‌ (ఎల్‌సీ) తీసుకోవాలన్నా సరే.. సర్కిల్‌ ఎస్‌ఈ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళితే.. 33కేవీ అమ్ముగూడ ఫీడర్‌పై శనివారం నాడు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే ఎల్‌సీ ఇచ్చాడు డీఈ భాస్కర్‌ రావు. దీంతో ఆ రోజు ఉదయం 10.05 నుంచి 10.35 వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సరిగా అదే సమయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి.. నాగారంలో బీఆర్ఎస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కరెంట్‌ పోవడంతో.. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం కార్పొరేట్‌ కార్యాలయం దృష్టికి రావడంతో నివేదిక ఇవ్వాలని ఎస్‌ఈ, సీజీఎంను సీఎండీ కోరారు.

ఇక విచారణలో.. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అరగంట పాటు కరెంట్‌ సరఫరా నిలిపేశారని తెలిసింది. దీనిని తీవ్రంగా భావించిన యాజమాన్యం డీఈ భాస్కర్‌ రావు, నాగారం ఏఈఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా డీఈని సస్పెండ్ చేశారు. అలానే ఈ వేసవిలో వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరాకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కార్పొరేట్‌ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ కరెంట్‌ కోతలపై ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు పవర్‌ కట్సే రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి