iDreamPost

నింగికేగిన సంగీత కిరణం

నింగికేగిన సంగీత కిరణం

ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శకుల ద్వయం సాజిద్-వాజిద్ లో వాజిద్ ఈ రోజు కన్ను మూశారు. గత కొంత కాలంగా కిడ్నీకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్న వాజిద్ ముంబైలోని ఓ సిటీ హాస్పిటల్ లో కోలుకోలేక మృతి చెందారు. ఈయన వయసు కేవలం 42 సంవత్సరాలు. ఈ విషాదం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ ప్యార్ కియాతో డర్నాతో ప్రయాణం మొదలుపెట్టిన ఈ సోదరులు ఆ తర్వాత ఎక్కువగా కండల వీరుడి సినిమాలతోనే గొప్ప పేరు తెచ్చుకున్నారు. హలో బ్రదర్, తుంకో న భూల్ పాయేంగే, గర్వ్, ముజ్సే షాదీ కరోగి, పార్ట్ నర్, గాడ్ తుస్సి గ్రేట్ హో, వాంటెడ్, వీర్ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

దబాంగ్ మూడు భాగాలకు సాజిద్-వాజిద్ లే కంపోజ్ చేశారంటే సల్మాన్ తో వీళ్లకు ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా అక్షయ్ కుమార్ రౌడీ రాథోడ్, మల్టీ స్టారర్ వెల్కమ్, ఇతర హీరోలు నటించిన తేజ్, జుద్వా 2, వెల్కమ్ న్యూ యార్క్ లాంటి చాలా చిత్రాలు వీళ్ళ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం 3 దేవ్ విడుదల కావాల్సి ఉంది. ఐపిఎల్ సీజన్ 4కు మ్యూజిక్ కంపోజ్ చేసింది కూడా వీళ్ళే. ట్విట్టర్ లో ఎందరో ప్రముఖులు వాజిద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సాజిద్ వాజిద్ నాన్న గారు ఉస్తాద్ షరాఫత్ అలీ ఖాన్ సుప్రసిద్ధ తబలా వాయిద్యకారులు.

1998లో తమ ప్రయాణం మొదలుపెట్టాక గత 22 ఏళ్ళుగా వీళ్ళ జైత్రయాత్ర కొనసాగుతోంది. సోదరుడు మృతి చెందటంతో సాజిద్ తీవ్ర శోకంలో మునిగిపోయారు. సంగీత దర్శకులుగా ఇంత సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న అన్నదమ్ములు వీళ్లిద్దరే. ఇప్పుడు ఆ ఘనతకు బ్రేక్ పడింది. కెరీర్ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఇలా కన్ను మూయడం నిజంగా షాక్ కలిగించేదే. అందులోనూ ఇంకా ఐదు పదుల వయసుకు దూరంగా ఉన్న వాజిద్ లాంటి కళాకారులు స్వర్గానికి ఏగడం మ్యూజిక్ లవర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సల్మాన్ తో సహా పలువురు హీరోలు దర్శక నిర్మాతలు ఇవాళ వాజిద్ కు ప్రత్యక్షంగా నివాళి అర్పించనున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి