iDreamPost

హైదరాబాదు పోదాం బా..

హైదరాబాదు పోదాం బా..

బావా.. హైద్రాబాద్‌ వెళ్ళిపోదామనుకుంటున్నాను.. బావా.. అన్నాడు వచ్చీరాగానే మణి. రావడం రావడంతోనే స్పీకర్‌ ఆన్‌చేసిన మణి వైపు అనుమానంగా చూసాడు కిట్టయ్య.

ఏంట్రోయ్‌.. ఇప్పుడేమైపోయిందని హైదరాబాదు పోతానంటున్నావు… మా చెల్లెలేమైనా అన్నాదేంట్రా.. అంటూ ఎటకారం చేసాడు కిట్టయ్య.

అదేం లేదు బావా. మీ చెల్లికే బంగారం.. ఏం అన్లేదు. కానీ గ్రేటర్‌ హైదరాబాదు ఎన్నికల కదా బావా.. అక్కడికెళ్ళితే ఏమైనా కలిసొస్తుందేమోనని.. వెళ్ళిపోదామనుకుంటున్నాను.. బావా అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.

ఎన్నికలైతే అక్కడున్న ఓటర్లకు ఉపయోగం గానీ.. నీలాంటి వసల పక్షులకు ఏం ఉపయోగం రా.. అంటూ ఆరా తీసాడు కిట్టయ్య.

అదేం లేదు బావా.. మనూరోళ్ళు చాలా మంది ఉన్నారు కదా.. వాళ్ళందరిని పోగేసి జట్టు కడితే ఏదైనా ఉపయోగం ఉండకపోతుందంటావా.. అన్నాడు మణి కాస్త ఆసక్తిగా.

నీకేం ఉంటుందిరా.. ఏమైనా ఉంటే అక్కడ స్థిరపడ్డ వాళ్ళకు తాయిలాల ప్రకటన అప్పుడు మొదలైపోయింది కదా.. అంటూ చెప్పసాగాడు కిట్టయ్య. ఆస్థిపన్నులో 50శాతం రాయితీని ప్రకటించేసారు.. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచారు.. మొన్న వరదల కారణంగా ఇంకా పరిహారం అందని బాధితుల వివరాలు కూడా నమోదు చేసుకుంటున్నారు.. ఇలా ఎన్నికల తాయిలు అప్పుడే మొదలైపోయినట్టేరా.. నువ్వింకా ఆలస్యం చేసేసావు అంటూ.. చెప్పుకొచ్చాడు కిట్టయ్య.

అద్సరే బావా.. ఉన్నట్టుండి కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకిన్ని తాయిలాలు ప్రకటించేస్తుందంటావ్‌? అన్నాడు సందేహంగా మణి.

ఎందుకేంట్రా దుబ్బాక ఎఫెక్ట్‌ గట్టిగానే టీఆర్‌ఎస్‌ పార్టీని తాకిందంటున్నార్రా అన్నాడు కిట్టయ్య.

ఏంటి బా.. ఒక్క సీటుకే అంత గట్టిగా తాకేసిందంటావా? అన్నాడు మణి.

మరి తాకదేంట్రా.. మేం తప్ప ఎవ్వరూ గెలవలేరు.. లక్ష ఓట్లు.. లక్ష ఓట్లు మెజార్టీ.. అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులను చూసి ఇతర పార్టీల నేతలు బేజారెత్తిపోయేవార్రా. కనీసం పరువు దక్కించుకోవడానికే పోరాడాలేమో అన్నంత రీతిలో ఇతర పార్టీల నైతికసై్థర్యం ఒకదశలో దిగజారిపోయిందంట.. అటువంటిది దుబ్బాకలో బీజేపీ గెలుపొందడంతో ఆ పార్టీలు అన్నీ కూడా కొంచెం ఊపిరిపోసుకుంటున్నాయంట..

మార్పు మొదలైపోయిందంటూ, ఆయా పార్టీలు ఉన్న శక్తియుక్తులన్నింటినీ కూడగట్టుకుని టీఆర్‌ఎస్‌పై పోరాడేందుకు సిద్ధమైపోయాయంట్రా.. అంటూ వివరించాడు కిట్టయ్య.

అంటే బావా.. నువ్వు ఫైనల్‌గా చెప్పేదేంటంటే.. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది కాబట్టే.. ఇప్పుడు కేసీఆర్‌ తాయిలాలు ప్రకటిస్తున్నాడంటావ్‌.. అంతేనా? కరెక్టే కదా? అంటూ గొంతు పెంచి అడిగాడు మణి.

నేను అనడం కాదురా అక్కడున్న ఇతర పార్టీల నాయకులు కూడా ఇదే చెబుతున్నార్రా బాబూ.. అంటూ తెగేసి చెప్పాడు కిట్టయ్య.

బావా నువ్వు చెప్పింది ఒక వేళ కరెక్టే అనుకో
బావా.. తాయిలాల ద్వారా ఆకట్టుకుందామని చూస్తున్న కేసీఆర్‌కే భిన్నంగా తెలంగాణా ప్రజలు ఆలోచిస్తే ఏమవుతుందంటావ్‌? అన్నాడు మణి కన్నుగీటుతూ..

అంటే ఏంట్రా.. అన్నాడు అనుమానంగా కిట్టయ్య కొంచెం ముందుకు వచ్చి.. ఏం లేదు బావా ఒక్క సీటుకే ఇన్ని తాయిలాలు ఇస్తున్నారు కదా.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఇంకో పార్టీని గెలిపించేస్తే 2023లో వచ్చే తెలంగాణా ఎన్నికల్లో ఇంకొంచెం ఎక్కువ తాయిలాలు పొందొచ్చని ప్రజలు అనుకుంటే పరిస్థితి ఏంటంటావ్‌? బావా అన్నాడు మణి.

ఓర్నాయనోయ్‌.. నువ్వు ఇలాక్కూడా ఆలోచిస్తున్నావేంట్రా బాబూ.. మణీ.. అంటూ ఆశ్చర్యపోయాడు కిట్టయ్య.

మరేంటనుకున్నావ్‌ బావా.. సపోజ్‌.. ఫర్‌ సపోజ్‌.. ప్రజలు ఇలాగే ఆలోచించారనుకో.. అప్పుడు పరిస్థితి ఏంటంటావ్‌? అంటూ మళ్ళీ రెట్టించాడు మణి.

ఏం ఉంటుంది.. ఏం ఉంటుందిరా..? అంటూ.. నీళ్ళు నములుతూ.. అయ్య బాబోయ్‌ నువ్వు చెప్పినట్టే ప్రజలు ఆలోచిస్తే గనుక బుర్రతిరగడం ఖాయంరా.. అంటూ రెండు చేతులు పైకెత్తి మణిని చూస్తూ నిలబడిపోయాడు.. కిట్టయ్య.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి