iDreamPost

కూలీ నుంచి కేంద్ర మంత్రి వరకు..

కూలీ నుంచి కేంద్ర మంత్రి వరకు..

అతని నిబద్ధత, నిజాయితీ అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. చివరకు ఎవరూ ఊహించని విధంగా అతన్ని వైసిపి లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఒక సామాన్యుడు సంచలన విజయం సాధించి ఏకంగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఒకప్పుడు పొలం పనులు చేసుకునే వ్యక్తిని ఎంపీని చేసిన ఘనత ఎస్సార్సీసిపి కి దక్కింది. అతడే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌. ఒకప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రెస్‌మీట్‌లలో వెనకుండి టీవీలో కనిపిస్తే చాలనుకున్న వ్యక్తి ఇప్పుడు బాపట్ల ఎంపీగా ఎన్నికై ఏకంగా కేంద్ర మంత్రి పదవి చేపట్టబోతున్నారు.

వైసిపి అధినేత వైయస్ జగన్ వైసిపి తరపున నందిగం సురేష్ పేరుని బాపట్ల నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా ప్రకటించేవరకు బహుశా ఆయన పేరు వైసిపిలో కూడా చాలామంది నాయకులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన బాపట్ల పార్లమెంట్ స్థానానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుండి పోటీ చేసి ఎంపీలుగా ఎన్నికైన నాయకులు దేశ రాజకీయాల్లో విశేషంగా రాణించి తమ సత్తా చాటారు. ఈ నేపథ్యంలో బాపట్ల స్థానం ఎస్సి రిజర్వుడ్ కావడంతో ఈ స్థానానికి వైసిపి తరుపున మాజీ కేంద్ర మంత్రులు పనబాక లక్షి లాంటి వారితో పాటు ఢిల్లీ స్థాయిలో పేరున్న చాలా మంది ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు పేర్లు వినపడినప్పటికీ, చివరి నిమిషంలో అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ నందిగం సురేష్ పేరుని ప్రకటించింది. రాజకీయాల్లో అప్పటివరకు పెద్దగా పరిచయం లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో కూడా సురేష్ గురించి ఆసక్తికర చర్చ జరిగింది.

అమరావతి ప్రాంతం ఉద్దండరాయుని పాలెంలో ఒక నిరుపేద దళిత రైతు కూలి కుటుంబానికి చెందిన నందిగం సురేష్ చిన్న వయసు లోనే వ్యవసాయ కూలి పనులకు వెళుతూ ఉండేవాడు. పేదరికం వల్ల మందడం హైస్కూల్ లో 10 వ తరగతి మధ్యలోనే మానేసి తన 15 సంవత్సరాల వయసులో కుటుంబ పోషణ కోసం విజయవాడలో ఫొటోగ్రాఫర్ గా అతి తక్కువ జీతానికి పని చేసాడు.

రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతాన్ని నూతన రాజధానిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజధాని ఏర్పాటుకు భూములు సేకరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుండి 33 వేల ఎకరాలు సేకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే సమయంలో కొన్ని గ్రామాల్లో రైతులు ల్యాండ్ పూలింగ్ ని తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు పంటలు పండే తమ భూములు ప్రభుత్వానికి ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇలా రాజధాని ప్రాంతంలో రైతులు తమ భూములు ఇవ్వడానికి ఎదురు తిరిగిన వారిలో నందిగం సురేష్‌ కూడా ఉన్నారు. తమకున్న రెండెకరాల అసైన్డ్‌ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదని తెగేసి చెప్పి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దాంతో కక్ష సాధింపు చర్యగా అప్పటి అధికార పక్షం ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్ పై కేసులు పెట్టారు.

సరిగ్గా అదే సమయంలో రాజధాని పరిధిలోని లింగాయపాలెంలో చెరుకు తోటలను కొందరు గుర్తు తెలియని దుండగులు తగులబెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పనేనని భావించిన పోలీసులు మొదటి నుండి ల్యాండ్ పూలింగ్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నందిగం సురేశ్‌ను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో జగన్‌‌కు ప్రమేయం ఉందని బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేశారని సురేశ్ తరువాత కూడా చాలాసార్లు చెప్పారు.

అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెయ్యమంటేనే తాము పంట పొలాలను తగలబెట్టామని మీడియా ముందు ఒప్పుకోవాలని చిట్టెం కోటేశ్వర రావు అనే సిఐ సురేష్ ని తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఒక దశలో తన సర్వీస్ రివాల్వర్ ను నందిగాం సురేష్ నోటిలో గురిపెట్టి నిజం ఒప్పుకోపోతే ఎంకౌంటర్ చేస్తామని బెదిరించారు. తన కుటుంబాన్న, తన భార్యని కూడా నానా దుర్భాషలాడారని, తరువాత కాలంలో అనేక సందర్భాలలో నందిగం సురేష్ ఆ సంఘటనని గుర్తు తెచ్చుకొని కన్నీళ్ల పర్యంతం అవుతూ ఆ ఘటనను మీడియాతో పంచుకున్నారు.

పోలీసులు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ నందిగం సురేష్ లొంగకపోవడంతో చివరికి అతన్ని బెయిల్ పై వదిలిపెట్టారు. అయితే నందిగం సురేష్ గురించి తెలుసుకున్న జగన్ స్వయంగా ఆయన్ని పిలిపించారు. జగన్ ని కలసిన సురేష్ తనపై అక్రమంగా పెట్టిన కేసుల గురించి జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అసైన్డ్, లంక భూముల వివాదంలో సురేశ్ చేసిన పోరాటానికి ముగ్ధుడైన జగన్ సురేష్ కి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని, అతన్ని అన్ని విధాలా ఆదుకొనే భాద్యత తనదేనని మాట ఇచ్చారు. ఆవిధంగా నందిగం సురేష్ జగన్ కు బాగా దగ్గరయ్యాడు.

2017లో బాపట్ల నియోజకవర్గానికి సురేశ్‌ను జగన్ ఇన్‌చార్జిగా నియమించారు. తర్వాత బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు ఇడుపులపాయలో సురేశ్‌ను తన పక్కన కూర్చుబెట్టుకున్న జగన్ తన పార్టీ నుండి పోటీ చెయ్యబోయే 25 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ఆయనతోనే చదివించారు. బాపట్లలో భారీగా డబ్బులు పంచే నేతలను దింపాలని పార్టీ నేతలు జగన్ కు సూచించినప్పటికీ జగన్ మాత్రం సురేశ్‌ను ఎన్నికల బరిలో నిలిపి గెలిపించారు. ఆ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలను ప్రతిపక్షం గెలుచుకొన్నప్పటికీ ఎంపీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం నందిగం సురేష్ తన సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి తో హోరాహోరిగా జరిగిన పోరులో 14 వేల మెజారిటీతో సంచలన విజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు.

చిన్నతనం లో తాను వ్యవసాయ కూలీగా పనులకు వెళ్ళి, తాటి ముంజలు అమ్ముకున్న ప్రాంతం నుండే ఎంపీగా గెలుపొందడం నిజంగా సంచలనమే. ప్రస్తుతం పార్లమెంట్ లో ఉన్న ఎంపీలలో దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాల వారికి ఇచ్చే బీపీల్ కార్డు ఉన్న అతి కొద్దీ మంది ఎంపీలలో నందిగం సురేష్ ఒకరు. అతని నిజాయితీ, నిబద్ధతే రాజకీయాల్లో ఆయన్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి