iDreamPost

“ఆది” కి ముగింపునిచ్చిన బ్రదర్స్‌..!

“ఆది” కి ముగింపునిచ్చిన బ్రదర్స్‌..!

మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి కుటుంబంలో ఏకాకిగా మిగిలిపోయినట్లు కనిపిస్తోంది. మొన్నటి దాకా మంత్రి పదవిలో ఉండి ఓ వెలుగు వెలిగిన ఆదికి నేడు చీకట్లు వెంటాడుతున్నాయి. నిలకడ లేని మనస్తత్వం సొంత వాళ్లకు దాదాపుగా దూరమైపోయారు. తాను ఎక్కడ ఉంటే తన సోదరులు కూడా అక్కడ ఉన్నట్లే అంటూ ఆది చేస్తున్న నిరంకుశ ధోరణిపై సోదరులు, బంధువులు తిరుగుబాటు చేసినట్లు జమ్మలమడుగు నియోజవర్గంలో ఆయన వర్గీయులే చెబుతున్నారు. నీతో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కరాఖండిగా చెప్పేసినట్లు తెలుస్తోంది. తన స్వార్థ రాజకీయాల కోసం ఆది.. తమ కుమారుల రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అటూ ఇటూ జంపింగ్స్‌..వైఎస్సార్‌ అనుచరులుగా పేరొందిన దేవగుడి సోదరులు అప్పట్లో వైఎస్‌ జగన్‌ కాంగ్రెస్‌కు రాజీనామా  చేసినప్పుడు ఆయన వెంట వైఎస్సార్‌సీపీకి వెళ్లారు. తర్వాత కొన్ని రోజులకే ఆదినారాయణ రెడ్డి ప్రోద్భలంతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆ సమయంలో ఆది వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలో సోదరులంతా వైఎస్‌ జగన్‌తో మాట్లాడడంతో వైఎస్సార్‌సీపీలో చేర్చుకున్నారు. జమ్మలమడుగులో గెలిచిన సంవత్సరం తిరగకముందే సోదరులు ఎంత చెప్పినా వినకుండా టీడీపీలో చేరిపోయారు. రామసుబ్బారెడ్డి కుటుంబంతో వైరాన్ని కూడా కాదని, కుటుంబానికి ప్రాధన్యమిచ్చి సోదరులు కూడా టీడీపీ చెంతకు చేరారు.

కొన్నాళ్లకు మంత్రి పదవి సాధించిన తర్వాత చంద్రబాబు ప్రోద్భలంతో దివంతగ వైఎస్సార్‌పై, వైఎస్‌ విజయమ్మపై, వైఎస్‌ జగనపై, వారి కుటుంబంపై ఆదినారాయణ రెడ్డి విపరీత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆది సోదరులు అభ్యంతరం చెప్పినా ఆయన వినిపించుకోలేదు. నోటి ఎంత మాటస్తే అంతా అనేసి రోజూ మీడియాలో కనిపించేవారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ ఆది పేరు వినిపించింది. కాలం గిర్రున తిరిగింది. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్‌ దక్కకపోవడంతో కడప ఎంపీగా పోటీలో దిగి ఘోరంగా ఓటమి పాలయ్యారు.

అంతటితో ఊరుకోకుండా ఢిల్లీకి చేరుకొని బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భంగా బీజేపీ పెద్దలతో తాను ఎక్కడుంటే తన సోదరులు అక్కడ  ఉన్నట్లు అని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే తాను బీజేపీలో చేరుతున్న విషయం సోదరులకుగానీ, బంధువులకు గానీ చెప్పలేదని తెలుస్తోంది. అప్పటి నుంచి కుటుంబంలో లుకలుకలు మొదలయ్యాయి.

కలసి పనిచేసేది లేదు..
ఈ జనవరి నెలలో ఆదినారాయణ రెడ్డి తన కుటుంబసభ్యులు, బంధువులతో బెంగళూరులో ఓ మీటింగ్‌ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనతో పాటు బీజీపీ కోసం పనిచేయాలని ఆది కోరగా.. అక్కడున్న వారందరూ ముక్త కంఠంతో తిరస్కరించారు. ఇకపై కలసి పనిచేయలేమని తేల్చి చెప్పారు.

వైఎస్‌ జగన్‌ అనుమతి కోసం ఎదురు చూపులు..
ఆది సోదరులలోని మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తన కొడుకు భూపేష్, మరో సోదరుడు, ఎమ్మెల్సీ విశ్వనాథరెడితో కలసి వైఎస్సార్‌సీపీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డిని కలసి తమ అభీష్టాన్ని వెల్లడించారు. తమకు ఎలాంటి పదవులు అవసరం లేదని, పార్టీలో కార్యకర్తల్లా పనిచేస్తామని, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కింద పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకున్నారు. అయితే ప్రస్తుతానికి వైఎస్‌ జగన్‌ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

మేం చేరకపోయినా వైఎస్సార్‌సీపీలో ఉన్నట్లే..
ఇటీవల మండలిలో జరిగిన వికేంద్రీకరణ బిల్లు విషయంలో ఎమ్మెల్సీ శివనాథ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం ద్వారా వైఎస్సార్‌సీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై తాజాగా ఆయన మాట్లాడుతూ.. తమ కుటుంబం ఎప్పటి నుంచో వైఎస్‌ కుటుంబం అడుగుజాడల్లో నడుస్తోందన్నారు. పరిపాలల వికేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, అలాగే జిల్లాలో ఏర్పాటు చేస్తున్న స్టీల్‌ ఫ్యా‍క్టరీ వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చారు. తమ అన్న బీజేపీలో ఉండచ్చేమోగానీ మేం మాత్రం చేరలేదని స్పష్టం చేశారు. అప్పట్లో పేరుకే తాము టీడీపీలో ఉన్నప్పటికీ ఏ రోజూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పారు. వైఎస్సార్‌సీపీలో చేరాల్సిన అధికారికంగా చేరాల్సిన అవసరం లేదని, తాము ఎప్పటికీ వైఎస్సార్‌సీపీలో ఉంటామని చెప్పుకురావడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి