iDreamPost

5 కి.మీ భుజాలపై మోసి.. గాయపడిన నక్సలైట్ కు పోలీసుల ప్రాణదానం

5 కి.మీ భుజాలపై మోసి.. గాయపడిన నక్సలైట్ కు పోలీసుల ప్రాణదానం

నక్సలిజాన్ని విడనాడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ప్రభుత్వాలు, పోలీసు అధికారులు మావోయిస్టులను కోరుతూనే ఉంటారు. లొంగిపోయిన నక్సలైట్లకు ఉపాధి కల్పిస్తామని చెప్పినప్పటికీ వారిలో మార్పు రావడం లేదు. ప్రజా సంపదకు నష్టం చేకూర్చుతూ, దాడులకు తెగబడుతూ అమాయకుల ప్రాణాలను కూడా బలిగొంటున్నారు నక్సలైట్లు. అయితే నక్సలిజాన్ని రూపుమాపడం కోసం ఆయా రాష్ట్రాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగానే మావోయిస్టులను ఏరివేయడానికి అడవుల్లో కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఎదురుపడిన నక్సలైట్లపై కాల్పులు జరిపాయి భద్రతా బలగాలు. ఈ దాడుల్లో ఓ నక్సలైట్ తీవ్రంగా గాయపడగా అతడికి పోలీసులు ప్రాణదానం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పోలీసులకు, మావోయిస్టులు ఎదురుపడితే చాలు నిప్పులో ఉప్పేసినట్లుగా కాల్పుల మోత మోగిపోద్ది. భద్రతాబలగాలు, నక్సలైట్ల మధ్య భీకర పోరు సాగుతుంటుంది. తాజాగా ఝార్ఖండ్ లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలోని హుస్సీపి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాగా ఈ కాల్పుల్లో ఓ మావోయిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నక్సలైట్ ను సహచరులు వదలేసి పారిపోగా పోలీసులే అక్కున చేర్చుకున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మావోయిస్టుకు ప్రాణదానం చేశారు.

కాల్పుల్లో గాయపడిన మావోయిస్టుకు వైద్యం అందించేందుకు భద్రతాబలగాలు ముందుకొచ్చాయి. వెంటనే అతడిని భుజాలపై మోసుకుని దట్టమైన అడవిలో 5 కి.మీలు నడిచి సీఆర్పీఎఫ్ క్యాంప్ కు తరలించారు. అక్కడ ఆ మావోయిస్టుకు ప్రాథమిక చికిత్స అందించారు. కానీ అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హెలికాఫ్టర్ ద్వారా లిఫ్ట్ చేసి రాంచీలోని ఓ హాస్పిటల్ కు తరలించారు. కష్టకాలంలో ఉంటే శత్రువుకు సైతం సాయమందించేందుకు ఏ మాత్రం సంకోచించకుండా మానవత్వాన్ని చాటుకున్నారు భద్రతాబలగాలు. ఈ ఘటనపై సింగ్భమ్ ఐజీ మాట్లాడుతూ.. రాష్ట్ర డీజీపీ సూచనతోనే నక్సలైట్ కు వైద్యం అందించామని తెలిపాడు. ఇప్పటికైనా మావోయిస్టులు ఆయుధాలను వదిలి లొంగిపోవాలని హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి