iDreamPost

టీవీ 5 ఆఫీసుపై దాడి, అసలు విషయం బయటకు వచ్చింది

టీవీ 5 ఆఫీసుపై దాడి, అసలు విషయం బయటకు వచ్చింది

తెలుగు టీవీ చానెల్ టీవీ5 తీరు ఇటీవల చర్చనీయాంశం అవుతోంది. ఆ చానెల్ యాంకర్ల తీరు దానికి కారణం. ప్రతీ సందర్భంలోనూ ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని దూషించడానికే వారు సమయాన్ని వెచ్చిస్తున్న తీరు విశేషంగా మారుతోంది. ముఖ్యంగా సాంబశివరావు, మూర్తి వంటి వారి వ్యవహారం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. చివరకు అన్నీ వదిలేసి నేరుగా అమరావతి వంటి ఉద్యమాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించే స్థాయికి వారు చేరిపోయారు. వార్తలు అందించే బదులు, వార్తలు సృష్టించేందుకు సిద్ధపడడమే విస్మయకర అంశంగా తయారయ్యింది.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆ చానెల్ ఆఫీసు మీద జరిగిన దాడిని పెద్ద అంశంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. టీవీ 5 ఆఫీసు ముందు ఉండే సెక్యూరిటీ సిబ్బంది దగ్గర చిన్న అద్దం పగిలిన తీరుని కొన్ని గంటల పాటు చానెల్ లో పెద్ద హడావిడి చేయడం ఆశ్చర్యం అనిపించింది. అదో పెద్ద జాతీయ సమస్య అన్నట్టుగా చూపించడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. చిన్న అద్దం పగిలితే దానిని కూడా ఆఫీస్ పై దాడిగా, ప్రజాస్వామ్యం కాలరాచినట్టుగా , మీడియాను అణచివేస్తున్నట్టుగా చెప్పడానికి వెనకాడలేదు. కానీ ఎంత పెద్ద హైడ్రామా నడిపిన తర్వాత ఇప్పుడు అసలు సంగతి బయటకురావడంతో టీవీ5 అసలు గుట్టురట్టయ్యింది. నానా హంగామా చేసిన విషయంలో నిజాలను తెలంగాణా పోలీసులు వెలుగులోకి తేవడంతో ఇప్పుడు ప్రజలకు షాక్ అయ్యే పరిస్థితి వచ్చింది.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన చిరంజీవీ అనే వ్యక్తి ఓ సాధారణ కార్మికుడు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారు. సినిమా షూటింగ్ ల కోసం వేసే సెట్స్ లో వెల్డర్ గా పనిచేస్తాడు. కానీ ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. నిత్యం సినిమా పరిశ్రమకు చెందిన కార్మికుడు కావడంతో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ఏరియాల్లోనే తిరుగుతూ ఉంటాడు. అలాంటి చిరంజీవి తన కష్టాలు పెరిగాయనే అసహనంలో ఏం చేయాలో తెలియక, ఫ్రస్ట్రేషన్ పెరిగివడంతో హద్దులు మీరి వ్యవహరించాడు. ఫుల్ గా మద్యం సేవించి, ఆ మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని దశలో చివరకు టీవీ5 ఆఫీస్ మీదుగా వెళుతున్నప్పడు ఓ రాయి వేసినట్టు రూఢీ అయ్యింది. ఇతనికి ఏ పార్టీ తో సంబంధం లేదని హైదరాబాద్ జూబిలీ హిల్స్ పోలీస్ విచారణలో తేలింది. అంటే కేవలం ఓ అసంఘటిత రంగ కార్మికుడు మతి చలించి చేసిన చిన్న పనిని టీవీ 5 కూడా మతిలేని రీతిలో, ప్రజల మతులు పోగొట్టే రీతిలో పెద్ద విషయంగా చిత్రీకరించడం గమనిస్తుంటే వారి పరిస్థితి అర్థమవుతోంది. రాజకీయాలతో ముడిపెట్టి లబ్ది పొందే యత్నం చేసిన తీరు గమనిస్తే వారు ఎంతకైనా తెగించేలా ఉన్నట్టు స్పష్టమవుతోంది.