iDreamPost

1855లో చైనాలో మొదలయి ప్రపంచ వ్యాప్తంగా మారణహోమం సృష్టించిన ప్లేగు మహమ్మారి

1855లో చైనాలో మొదలయి ప్రపంచ వ్యాప్తంగా మారణహోమం సృష్టించిన ప్లేగు మహమ్మారి

ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నెమ్మదిస్తుందేమో అని ఆశించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆ ఛాయలు ఏమాత్రం కనిపించక పోయేసరికి కరోనాని pandemic గా గుర్తించింది.

జబ్బులు అవి వ్యాపించిన భౌగోళిక విస్తీర్ణం బట్టి మూడు రకాలుగా విభజిస్తారు. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన వాటిని endemic జబ్బులు అంటారు. ఇవి ఒక ప్రాంతంలోనే ఉంటాయి. ఆ జబ్బు వ్యాపించడానికి అవసరమైన పరిస్థితులు ఆ ప్రాంతంలోనే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా బయట ప్రాంతంనుంచి వచ్చి, ఆ జబ్బు అంటుకుని, తన ప్రాంతానికి తిరిగి వెళ్ళినా అక్కడ తగిన పరిస్థితులు లేనందున ఆ జబ్బు అక్కడ వ్యాపించలేదు.

రెండు మూడు రాష్ట్రాలకో, దేశాలకో పరిమితమైన వాటిని epidemic వ్యాధులు అంటారు. ఆమధ్య కొన్ని ఆఫ్రికా దేశాల్లో వ్యాపించిన ఎబోలా లాంటివి ఈ శ్రేణికి చెందిన జబ్బులు. దేశాల, ఖండాల సరిహద్దులను దాటి వ్యాపించే వాటిని pandemic వ్యాధులు అంటారు.

ఇలా పెద్ద సంఖ్యలో మనుషుల ప్రాణాలు తీసిన మహమ్మారుల్లో చెప్పుకోదగ్గది 1855 సంవత్సరంలో చైనాలో మొదలై ఒక శతాబ్దం కాలం చురుగ్గా ఉన్న ప్లేగు మహమ్మారి. చైనా నైరుతి ప్రాంతంలో ఉన్న యున్నాన్ ప్రాంతంలో మొదలైన ఈ ప్లేగు అప్పటి బ్రిటిష్ ఇండియాలోనే కోటి మంది ప్రాణాలు తీసింది.

యున్నాన్ ప్రాంతానికి పరిమితమై ఎప్పటినుండో ఉన్న ప్లేగు వ్యాధి, అక్కడ బయల్పడిన రాగి తదితర ఖనిజాలను వెలికితీయడం కోసం ప్రజలు ఎక్కువ సంఖ్యలో వలస రావడంతో ఎక్కువ మందికి సోకింది. అదే సమయంలో చైనాలోని హాన్, హుయీ జాతుల మధ్య మొదలైన అంతర్యుద్ధం వలన ఆ పోరాటంలో పాల్గొన్న సైనికులు, యుద్ధం వలన నివాసం కోల్పోయిన కాందిశీకుల వల్ల మరింత వ్యాపించింది ఈ జబ్బు.

అదే సమయంలో అంతర్జాతీయంగా సముద్ర వాణిజ్యం పెరగడంతో ప్లేగు బాక్టీరియా బారిన పడిన ఎలుకలు నౌకాశ్రయాల నుంచి వాటిలో ఆగి ఉన్న ఓడల్లోకి, ఓడల్లో ఉన్న ఎలుకలు ఓడరేవుల్లోకి ఆ జబ్బుని రవాణా చేసి ప్రపంచమంతా వ్యాప్తి చెందేలా చేశాయి.

అప్పటి బ్రిటిష్ ఇండియాలో ప్రధానమైన ఓడరేవులు బొంబాయి, కలకత్తా నగరాలకు ఈ జబ్బు వచ్చి చేరి అక్కడ నుంచి దేశమంతా వ్యాపించింది. అప్పట్లో ఈ జబ్బుని ఎదుర్కోవడానికి అవసరమైన యాంటీ బయాటిక్స్ లేకపోవడంతో మరణాల సంఖ్య బాగా ఎక్కువగా ఉండేది.

అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ప్లేగు వ్యాప్తి చెందకుండా రోగులని నిర్బంధం చేయడంలో కఠినంగా వ్యవహరించింది. ఇందుగ్గానూ ప్రత్యేక ప్లేగు అధికారులను నియమించి వారికి పూర్తి అధికారం ఇచ్చి, సైన్యాన్ని కూడా వారికి అందుబాటులో ఉంచింది. ప్లేగు సోకిన రోగులు ఉన్న ఇళ్ళమీద నల్లరంగు గుర్తులు వేయడం లాంటి చర్యలతో వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంచే ప్రయత్నం చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు భారతీయులకు కొంతమందికి నచ్చలేదు. 1897లో పూనే నగరంలో చప్కేపర్ సోదరులు పూనే నగర ప్రత్యేక ప్లేగు అధికారిని, అతని మిలిటరీ బాడీగార్డునీ కాల్చి చంపారు. తన పత్రికలో ఈ నిర్బంధ చర్యలకు వ్యతిరేకంగా రాసినందుకు బాలగంగాధర్ తిలక్ రాజద్రోహ నేరం కింద పద్దెనిమిది నెలల జైలు శిక్షకు గురయ్యాడు.

ప్లేగ్ వాక్సీన్

1890 దశకం నాటికి వ్యాధి తీవ్రత ఎక్కువై మనుషులు పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో, అప్పటికి కలరా వ్యాధికి టీకా కనిపెట్టిన మైక్రోబయాలజీ నిపుణుడు వాల్డెమార్ హాఫ్కిన్ సహాయం కోరింది అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం. రష్యాలో జన్మించిన ఈ యూదు జాతీయుడు అక్కడి మత వివక్ష భరించలేక ఫ్రాన్స్ వచ్చి అక్కడ కలరా వ్యాధికి టీకా కనిపెట్టి అంతర్జాతీయ ఖ్యాతి గడించి ఉన్నాడు.

1896లో తన టీమ్ తో సహా బొంబాయి చేరిన హాఫ్ కిన్ గ్రాంట్ వైద్య కళాశాలలో ఒక వరండాలో తన ప్రయోగశాల ఏర్పాటు చేసుకుని, కొందరు స్థానికుల సహాయంతో పగలూ, రాత్రి తేడా లేకుండా 1897 జనవరి కల్లా ప్లేగుని నిరోధించగల టీకాని రూపొందించి, దానిని తనే వేసుకుని అది సురక్షితం అని నిరూపించి,అధికారులకు అప్పగించాడు.

అధికారులు దాని ప్రభావం పరీక్షించి చూడ్డానికి బొంబాయి లోని బైకుల్లా జైలులో ఉన్న ఖైదీలను ఎంచుకున్నారు. సగం మందికి వాక్సీన్ ఇచ్చి, సగం మందికి ఇవ్వకుండా కొంతకాలం చూస్తే, వాక్సీన్ ఇచ్చిన వారిలో ఒక్కరికి కూడా ప్లేగ్ సోకలేదు. దీంతో సంతృప్తి చెందిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాక్సీన్ తయారు చేసి ప్రజల వినియోగానికి అందించడంతో ప్లేగ్ మరణాలు గణనీయంగా తగ్గాయి. బొంబాయిలో ప్లేగ్ లాబొరేటరీ స్థాపించి, దానికి హాఫ్ కిన్ ని డైరెక్టర్ గా నియమించింది అప్పటి ప్రభుత్వం. దీనినే తర్వాత హాఫ్ కిన్ ఇన్స్టిట్యూట్ గా పేరు మార్చారు.

ఈ ప్లేగు మహమ్మారికి సంబంధించిన పరిశోధనలోనే 1894లో హాంగ్ కాంగ్ లో స్విట్జర్లాండ్ సైంటిస్ట్ అలెగ్జాండర్ యెర్సీన్ ఈ జబ్బుని కలిగించే బాక్టీరియాని కనిపెట్టారు. దాన్ని ఆయన పేరుతో యెర్సీనియా పెస్టిస్ అని పిలుస్తారు.

హాఫ్ కిన్ రూపొందించిన వాక్సీన్ తో పాటు తర్వాత కాలంలో యాంటీ బయాటిక్స్ కూడా అందుబాటులోకి రావడంతో ప్లేగ్ మరణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అయితే 1960 వరకూ అక్కడక్కడా ప్లేగ్ మరణాలు నమోదు అవుతూ వచ్చి, 1955లో ప్రారంభమైన ఈ ప్లేగ్ పాన్ డెమిక్ 1960లో అధికారికంగా ముగిసిపోయింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి