iDreamPost

అమ్మ ఒడి పేరుతో ఫోన్ కాల్స్..! తస్మాత్ జాగ్రత్త

అమ్మ ఒడి పేరుతో ఫోన్ కాల్స్..! తస్మాత్ జాగ్రత్త

సెల్ ఫోన్స్ వచ్చాక ఆన్ లైన్ మోసాలకు అడ్డు లేకుండా పోయింది. ఇప్పటి వరకు బ్యాంకు అధికారులమంటూ లేదా ఈ ఆఫర్ ఉందంటూ బురిడీ కొట్టించేవారు మోసగాళ్లు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పథకాల విషయంలోనూ అమాయకుల్ని నిండా ముంచేసేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా ఇటువంటి మోసం ఒకటి వెలుగు చూసింది. ఏపీ ప్రభుత్వ పథకానికి సంబంధించి.. డబ్బులు వచ్చాయంటూ వివరాలు తెలియజేయాలని, అప్పుడే మీ ఖాతాలో డబ్బులు పడతాయంటూ ఫోన్లు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ మహిళ ఇటువంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. చివరకు నిజమేనని నమ్మి.. వివరాలు చెప్పడంతో ఖాతాలో రూ. 42 వేలు మాయం చేశారు కేటుగాళ్లు.

వివరాల్లోకి వెళితే.. కంబాల చెరువు ఆదమ్మ దిబ్బ ప్రాంతానికి చెందిన హరిప్రసాద్.. ఓ ప్రైవేటు టీచర్. ఆయన భార్య రత్నకుమారికి ఈ నెల 18న ఓ ఫోన్ వచ్చింది. అమరావతి క్యాంపు కార్యాలయం అమ్మఒడి విభాగం నుండి కాల్ చేస్తున్నట్లు నమ్మించారు. మీ అబ్బాయి పేరిట అమ్మఒడి వచ్చిందని, బ్యాంకు వివరాలు చెప్పే డబ్బుల్ని అందులో జమ చేస్తామని తెలిపారు. నిజమేనని నమ్మిన రత్న కుమారి.. బ్యాంకు ఖాతా, తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పింది. నిమిషాల వ్యవధిలో బ్యాంక్ అకౌంట్ నుండి రూ. 42 వేలు మాయం అయ్యాయి. డబ్బులు డెబిట్ అయినట్లు ఆమె ఫోన్‌కు మేసేజ్ వచ్చింది.

మళ్లీ కొద్దిసేపటి తర్వాత అదే వ్యక్తి ఫోన్ చేసి మళ్లీ ఓటీపీ వస్తుందని, అది చెప్పాలని కోరాడు. ఆమెకు అనుమానం వచ్చి ఫోన్ కట్ చేసి.. భర్తకు విషయం చెప్పింది. వెంటనే వారు బ్యాంకు సిబ్బందిని సంప్రదించారు. అకౌంట్ లో రూ. 5.24 లక్షలు ఉన్నాయని, ఓటీపీ చెప్పగానే రూ. 42 వేలు మాత్రమే కట్ అయినట్లు బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన హరిప్రసాద్, రత్న కుమారి దంపతులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా,  ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి