iDreamPost

పింఛన్ డోర్ డెలివరీ.. నెవర్‌ బిఫోర్‌.. నెవర్‌ ఆఫ్టర్‌..

పింఛన్ డోర్ డెలివరీ.. నెవర్‌ బిఫోర్‌.. నెవర్‌ ఆఫ్టర్‌..

దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ జరగని సంఘటన ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ సర్కార్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని అమలు చేసింది. ఫిబ్రవరి నెల ఈ చరిత్రకు ప్రారంభవేదికైంది. లబ్ధిదారులు ఇంటి వద్దకే పింఛన్‌ నగదు అందించే బృహత్తర పథకం ఈ రోజు (ఫిబ్రవరి ఒకటో తేదీ) ప్రారంభమైంది.

ఉదయం ఆరు గంటలకు పేపర్‌ బాయ్, పాలుపోసే వ్యక్తితోపాటు ఈ రోజు ఓ కొత్త వ్యక్తి రావడం పింఛన్‌ లబ్ధిదారుల కుటుంబాల్లో సరికొత్త అనుభూతిని పంచింది. వచ్చిన వ్యక్తి తమకు మేలు చేసే ప్రభుత్వ ప్రతినిధి కావడం వారిలో సంతోషాన్ని మరింత పెంచింది. వార్డు, గ్రామ వాలంటీర్లు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్‌ లబ్ధిదారుల ఇంటికి వెళ్లారు. ఒకటో తేదీన, తెల తెలవారకముందే.. వృద్ధులు, వికలాంగులు, వితంతులు చేతిలో వాంలంటీర్లు పింఛన్‌ నగదు పెట్టి వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు.

పంచాయతీ కార్యాలయం, దేవాలయం, పాఠశాల.. పింఛన్‌ తీసుకోవడానికి గతంలో లబ్ధిదారులు ఈ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఉండదు. గంటల తరబడి, రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. వేలి ముద్రల వెతలు ఇకపై కనిపించవు. పింఛన్‌ ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగి సాకులు వినపడకుండా.. పింఛన్‌ డోర్‌ డెలివరీ పథకాన్ని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ విజయవంతంగా ప్రారంభించింది.

రాష్ట్రంలో పింఛన్‌ అందుకోబోయే 54.64 లక్షల మంది లబ్ధిదారులందరికీ ఒకే రోజు పింఛన్‌ నగదు అందించి వాలంటీర్ల వ్యవస్థను హేళన చేసిన వారికి తగిన సమాధానం చెప్పింది. పాత లబ్ధిదారులతోపాటు కొత్త లబ్ధిదారులకు కూడా ఈ నెల నుంచే పింఛన్‌ అందించడంతో ఆంధ్రప్రదేశ్‌లో పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా ఒకటో తేదీన పింఛన్‌ నగదు ఇవ్వడంతో లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వులు చిందాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి